Pages

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదకొండవ అధ్యాయం

             

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదకొండవ అధ్యాయం 

శ్రీభగవానువాచ
బద్ధో ముక్త ఇతి వ్యాఖ్యా గుణతో మే న వస్తుతః
గుణస్య మాయామూలత్వాన్న మే మోక్షో న బన్ధనమ్

బంధమూ మోక్షమూ అనేది గుణాలను బట్టే గానీ ఆత్మకు ఏ బంధమూ లేదు. గుణములతో కలసి ఉంటే బంధం అనీ, గుణములు లేకుంటే మోక్షం అనీ అంటున్నాము. గుణములే మాయతో కల్పించబడినవి. ఇంక బంధమూ మోక్షమూ ఎక్కడిది

శోకమోహౌ సుఖం దుఃఖం దేహాపత్తిశ్చ మాయయా
స్వప్నో యథాత్మనః ఖ్యాతిః సంసృతిర్న తు వాస్తవీ

శొకమూ మోహమూ సుఖమూ దుఃఖమూ శరీరమూ మాయతోనే ఏర్పడుతున్నాయి. కలలో మనకు ఏవేవి వస్తాయో అవి ఎలా వాస్తవాలు కావో దేహమూ సంసారమూ కూడా వాస్తవం కాదు

విద్యావిద్యే మమ తనూ విద్ధ్యుద్ధవ శరీరిణామ్
మోక్షబన్ధకరీ ఆద్యే మాయయా మే వినిర్మితే

విద్యా అవిద్యా రెండూ నా దేహములే. ఇవే మోక్షమూ బంధమూ కలిగిస్తాయి. ఇవన్నీ నా మాయ వలన ఏర్పడినవి.

ఏకస్యైవ మమాంశస్య జీవస్యైవ మహామతే
బన్ధోऽస్యావిద్యయానాదిర్విద్యయా చ తథేతరః

ఈ జీవుడు నా అంశ. అలాంటి ఈ జీవుడికి అవిద్యతోనే బంధము. విద్యతో మోక్షము ఏర్పడతాయి.

అథ బద్ధస్య ముక్తస్య వైలక్షణ్యం వదామి తే
విరుద్ధధర్మిణోస్తాత స్థితయోరేకధర్మిణి

ఒకే ధర్మం కలవారిలో ఉండే విరుద్ధ ధర్మాలు ఎలా ఉంటాయో చెబుతాను విను

సుపర్ణావేతౌ సదృశౌ సఖాయౌ యదృచ్ఛయైతౌ కృతనీడౌ చ వృక్షే
ఏకస్తయోః ఖాదతి పిప్పలాన్నమన్యో నిరన్నోऽపి బలేన భూయాన్

(ద్వాసుపర్ణా ... కఠోరోపనిషత్తు) ఒకే చెట్టు మీద రెండు పక్షులున్నాయి మంచి రెక్కలుకలిగి ఉన్నాయి, కలిసే ఉంటాయి, ఒకే వృక్షాన్ని రెండూ ఆశ్రయించి ఉన్నాయి. ఆ రెండు పక్షులలో ఒక పక్షి, చెట్టు ఆకులు రుచిగా ఉంటాయి అని తింటుంది. అలా తిన్న పక్షి ఏడుస్తుంది. తినని పక్షి ఆనందముగా ఉంటుంది. ఈ సంసారములో కూడా రెండు పక్షులున్నాయి, జీవాత్మా పరమాత్మ. జీవుడు కర్మఫలాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు. పరమాత్మ ఏదీ అనుభవించక ఆనందముగా ఉంటాడు.
ఒక పక్షి పిప్పల వృక్షాన్ని తింటూ ఉంటుంది. ఏ అన్నమూ లేకున్నా రెండవ పక్షి బలముగా ఉంటుంది.

ఆత్మానమన్యం చ స వేద విద్వానపిప్పలాదో న తు పిప్పలాదః
యోऽవిద్యయా యుక్స తు నిత్యబద్ధో విద్యామయో యః స తు నిత్యముక్తః

చెట్టు యొక్క ఆకులు తినని వాడు, తానేమిటో ఇతరులేమిటో తెలుసుకుంటాడు. అవిద్యతో కూడి ఉన్నాడు నిత్యబద్ధుడు. విద్యతో కూడి ఉన్నవాడు నిత్య ముక్తుడు.

దేహస్థోऽపి న దేహస్థో విద్వాన్స్వప్నాద్యథోత్థితః
అదేహస్థోऽపి దేహస్థః కుమతిః స్వప్నదృగ్యథా

జ్ఞ్యానం ఉన్నవాడు శరీరముతో ఉన్నా లేనివాడితో సమానమే. మేలుకొన్నవాడికి స్వప్నం రానట్లు. దేహములో లేకున్నా అవిద్య ఉంటే దేహం ఉన్నట్లే, కలలు కనే వాడిలా

ఇన్ద్రియైరిన్ద్రియార్థేషు గుణైరపి గుణేషు చ
గృహ్యమాణేష్వహం కుర్యాన్న విద్వాన్యస్త్వవిక్రియః

విద్వాంసుడైన వాడు అర్థములయందు విషయములను ప్రవర్తింపచేయకూడదు. విషయములయందు ఇంద్రియములను ప్రవర్తింపచేయకూడదు. ఆయా విషయముల యందు విషయములను ప్రవర్తింపచేయకుండా ఉండాలి. మనం నిరోధించినా ఆ ఇంద్రియాలు ఊరుకోవు. విషయములో ఇంద్రియములు వెంబడిస్తున్నా వాటి వెంబడి మనసు లేకుంటే ముక్తుడు, లేకుంటే బద్ధుడు. నేను చేస్తున్నాను అనే అహంకారం ఎవరికి లేదో అలాంటి వాడికి ఆ విషయములు అనుభవిస్తున్నా వికారం కలుగదు.

దైవాధీనే శరీరేऽస్మిన్గుణభావ్యేన కర్మణా
వర్తమానోऽబుధస్తత్ర కర్తాస్మీతి నిబధ్యతే

శరీరం దైవాధీనం. గుణములు కర్మలు చేస్తున్నాయి. ఇంక మనం చేసేదేముంది. మనకే సంబంధం లేకున్నా అజ్ఞ్యానముతో నేనే చేసుకుంటున్నాను అన్న భావనతో కర్తృత్వ బుద్ధితో నేను కర్తను అని భావించి బంధించబడుతున్నాడు

ఏవం విరక్తః శయన ఆసనాటనమజ్జనే
దర్శనస్పర్శనఘ్రాణ భోజనశ్రవణాదిషు
న తథా బధ్యతే విద్వాన్తత్ర తత్రాదయన్గుణాన్

అది తెలుసుకుని, శరీరం నాదికాదు అనీ కర్తను నేను కాదు అని శయన ఆసన అటనం దర్శనం స్పర్శన ఘ్రాణ భోజన ఇలాంటి వాటిలో నేను కర్తను కాదు అనుకున్నవాడు బంధించబడడు.ఆయా ప్రదేశాలలో ఆయా గుణములను భుజింపచేస్తూ కూడా పండితుడైన వాడు బంధములో చిక్కడు

ప్రకృతిస్థోऽప్యసంసక్తో యథా ఖం సవితానిలః
వైశారద్యేక్షయాసఙ్గ శితయా ఛిన్నసంశయః
ప్రతిబుద్ధ ఇవ స్వప్నాన్నానాత్వాద్వినివర్తతే

ప్రకృతిలో ఉన్నా జీవుడు ప్రకృతిలో సంగం కలిగి ఉండడు. ఆకాశమూ వాయువూ అగ్నీ అంతటా ఉన్నా ఏదీ అటంకుండా ఉంటాయి. మనం కూడా అన్నిటిలో ఉండి కూడా ఏదీ అంటకుండా  ఉండవచ్చు.
గురు ముఖతా లభించిన విద్యతో, అసంగం అనే కత్తితో వివేక దృష్టితో అన్ని సంశయాలూ తొలగించుకుని కల నుండి మేలుకున్నవాడు తొలగిపోయినట్లు సంసారం నుండి తొలగిపోతాడు

యస్య స్యుర్వీతసఙ్కల్పాః ప్రాణేన్ద్రియర్ననోధియామ్
వృత్తయః స వినిర్ముక్తో దేహస్థోऽపి హి తద్గుణైః

ఎవరికైతే సంకల్పం లేదో, ఎవరైతే ప్రాణ ఇంద్రియ మనో బుద్ధి సంకల్పముల యందు విడిగా ఉన్నవాడు అన్నిటి నుండీ విముక్తుడవుతాడు. శరీరములో ఉన్నా శరీర ఇంద్రియ మనో బుద్ధి ప్రవృత్తికి దూరముగా ఉంటే , శరెరములో ఉన్నా లేని వాడికిందే లెక్క

యస్యాత్మా హింస్యతే హింస్రైర్యేన కిఞ్చిద్యదృచ్ఛయా
అర్చ్యతే వా క్వచిత్తత్ర న వ్యతిక్రియతే బుధః

పండితుడైన వాడు హింసా శీలమైన వాడితో హింసించబడ్డా, పూజించబడుతున్నా, నిందించబడుట అనేది మనకు కాదు అనుకున్నపుడు అలాంటి బంధాల నుండి దూరముగా ఉంటాడు. చెడు చేసినా మంచి చేసినా స్తోత్రమూ నిందా చేయకుండా ఉండాలి

న స్తువీత న నిన్దేత కుర్వతః సాధ్వసాధు వా
వదతో గుణదోషాభ్యాం వర్జితః సమదృఙ్మునిః

గుణముతో దోషముతో పని లేకుండా రెంటినుంచీ దూరముగా ఉన్నవాడు ముని. ఇది చెడూ అనీ ఇది మంచీ అనీ ఆలోచించడు

న కుర్యాన్న వదేత్కిఞ్చిన్న ధ్యాయేత్సాధ్వసాధు వా
ఆత్మారామోऽనయా వృత్త్యా విచరేజ్జడవన్మునిః

ఆత్మారాముడై ఇలాంటి వృత్తితో జడుడిలా విహరిస్తాడు.

శబ్దబ్రహ్మణి నిష్ణాతో న నిష్ణాయాత్పరే యది
శ్రమస్తస్య శ్రమఫలో హ్యధేనుమివ రక్షతః

కేవలం పుస్తకాలని చదివి పరమాత్మను తెలియలేకపోతే అలాంటి వాడు పడ్డ శ్రమకు శ్రమే ఫలితం. సంతానం కలగని ఆవును పోషిస్తే ఎలా ఫలితం ఉండదో ఇలాంటి వాడి పుస్తక జ్ఞ్యానం పనికిరాదు

గాం దుగ్ధదోహామసతీం చ భార్యాం దేహం పరాధీనమసత్ప్రజాం చ
విత్తం త్వతీర్థీకృతమఙ్గ వాచం హీనాం మయా రక్షతి దుఃఖదుఃఖీ

పాలుడిగి పోయిన భార్య దుష్టురాలైన భార్య పరాధీనమైన శరీరం దుష్ట సంతానమూ యోగ్యమైన వారికి దానం ఇవ్వబడని ధనమూ నా ప్రసంగం లేని వాక్కునూ దుఃఖాన్ని పెంచుకోవడానికే కాపాడుకుంటారు.

యస్యాం న మే పావనమఙ్గ కర్మ స్థిత్యుద్భవప్రాణనిరోధమస్య
లీలావతారేప్సితజన్మ వా స్యాద్వన్ధ్యాం గిరం తాం బిభృయాన్న ధీరః

నా విషయములో పవిత్రమైన కర్మను ఆచరించని వారు, పుట్టుకా రక్షణం ప్రళయం మొదలైన, నేను ఆయా అవతారములలో ఆచరించిన పనులనూ లీలలను జనంలనూ ఎవరు స్మరించడో అలాంటి వారిని విడిచిపెట్టాలి. భగవంతుని నామ కర్మ గుణ అవతారాలను ఏ నాలుక పలుకదో అలాంటి నాలుకను పోషించరాదు

ఏవం జిజ్ఞాసయాపోహ్య నానాత్వభ్రమమాత్మని
ఉపారమేత విరజం మనో మయ్యర్ప్య సర్వగే

ఇలా విచారించి ఆత్మలో ఉన్నభేద బుద్ధిని తొలగించి విరమించాలి. విరక్త్మైన మనసును అంతటా ఉండే నా యందు అర్పించి

యద్యనీశో ధారయితుం మనో బ్రహ్మణి నిశ్చలమ్
మయి సర్వాణి కర్మాణి నిరపేక్షః సమాచర

పరమాత్మ యందు నిశ్చలమైన మనసును ధరించలేని నాడు. ఒక వేళ చేసిన పనులను నాయందు అర్పించకుంటే వాటిని కోరికలు లేకుండా ఆచరించు

శ్రద్ధాలుర్మత్కథాః శృణ్వన్సుభద్రా లోకపావనీః
గాయన్ననుస్మరన్కర్మ జన్మ చాభినయన్ముహుః

పరమ మంగళ కరములూ సకల లోకములనూ పవిత్రం చేసే నా కథలను వింటూ గానం చేస్తూ స్మరిస్తూ నా అవతారములూ , అవతారములలో నా కర్మలనూ అభినయిస్తూ

మదర్థే ధర్మకామార్థానాచరన్మదపాశ్రయః
లభతే నిశ్చలాం భక్తిం మయ్యుద్ధవ సనాతనే

నా కోసమే ధర్మ అర్థ కామాలను ఆచరిస్తూ ఉన్నవాడు నిశ్చలమైన భక్తిని నా యందు కలిగి ఉంటాడు

సత్సఙ్గలబ్ధయా భక్త్యా మయి మాం స ఉపాసితా
స వై మే దర్శితం సద్భిరఞ్జసా విన్దతే పదమ్

సజ్జనుల కలయికతో సత్సంగం వలన లభించిన భక్తితో నన్ను వాడు ఉపాసన చేయాలి. అలాంటి వాడు నేను చూపిన నా స్థానాన్ని సులభముగా పొందుతాడు

శ్రీద్ధవ ఉవాచ
సాధుస్తవోత్తమశ్లోక మతః కీదృగ్విధః ప్రభో
భక్తిస్త్వయ్యుపయుజ్యేత కీదృశీ సద్భిరాదృతా

సాధువు అంటే ఎవరు? ఎవరిని సాధువు అనాలి. సజ్జనులందరూ నీ యందు ఉపయోగించే భక్తి ఎలా ఉండాలి

ఏతన్మే పురుషాధ్యక్ష లోకాధ్యక్ష జగత్ప్రభో
ప్రణతాయానురక్తాయ ప్రపన్నాయ చ కథ్యతామ్

దీన్ని నాకు వివరించు. నీకు వంగి ఉన్నాను, నీ మీద ప్రేమ కలిగి నిన్నే ఆశ్రయించి ఉన్నాను

త్వం బ్రహ్మ పరమం వ్యోమ పురుషః ప్రకృతేః పరః
అవతీర్నోऽసి భగవన్స్వేచ్ఛోపాత్తపృథగ్వపుః

నీవే పరబ్రహ్మవూ పరమాకాశానివి పరమ పురుషుడవు ప్రకృతి కంటే విలక్షణుడవు. నీ సంకల్ప అనుగుణముగా ఆయా శరీరములను ధరించి అవతరిస్తూ ఉన్నావు

శ్రీభగవానువాచ
కృపాలురకృతద్రోహస్తితిక్షుః సర్వదేహినామ్
సత్యసారోऽనవద్యాత్మా సమః సర్వోపకారకః

దయ కలవాడు, ఏ ప్రాణూలూ ద్రోహం చేయని వాడు, ఎదుటివారు చేసిన ద్రోహాన్ని క్షమించేవాడు సత్యమ్యందే తన బలం కలిగి ఉన్నవాడు, నిందించబడని మనసు కలవాడు, అందరికీ ఉపకారంచేసే బుద్ధి కలవాడు

కామైరహతధీర్దాన్తో మృదుః శుచిరకిఞ్చనః
అనీహో మితభుక్శాన్తః స్థిరో మచ్ఛరణో మునిః

కోరికలతో కొట్టబడని మనసు కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు మెత్తని స్వభావం కలవాడు శుచి గలవాడు, ఏదీ లేనివాడు ఏదీ కోరని వాడు మితముగా భుజించేవాడు, శాంతుడు స్థిరముగా గుణరహితుడై నాయందు మాత్రమే రక్షణత్వ బుద్ధి కలవాడు

అప్రమత్తో గభీరాత్మా ధృతిమాఞ్జితషడ్గుణః
అమానీ మానదః కల్యో మైత్రః కారుణికః కవిః

త్వర పడని వాడూ, తనలో కలిగే దోషాలనూ గుణాలనూ ఎదుటివారికి తెలుపని వాడు, ధైర్యం కలవాడు కామ క్రోధాలను గెలిచినవాడు, అహంకారం లేనివాడు ఎదుటివారిని గౌరవించేవాడు, సమర్ధుడు, మైత్రి కలవాడు, దయ కలవాడు, జ్ఞ్యానం కలవాడు

ఆజ్ఞాయైవం గుణాన్దోషాన్మయాదిష్టానపి స్వకాన్
ధర్మాన్సన్త్యజ్య యః సర్వాన్మాం భజేత స తు సత్తమః

ఈ రీతిలో గుణ దోషాలను బాగా తెలుసుకుని, నేను బోధించిన తన గుణాలను తెలుసుకుని, తన ధర్మాలను విడిచిపెట్టి నన్ను మాత్రమే సేవించేవాడు సాధువు. నాయందు మనసు లగ్నం చేసి నా కోసం తన ధర్మాలనూ కూడా విడిచిపెడతాడో వాడు సాధువు.

జ్ఞాత్వాజ్ఞాత్వాథ యే వై మాం యావాన్యశ్చాస్మి యాదృశః
భజన్త్యనన్యభావేన తే మే భక్తతమా మతాః

నేనెవరూ ఎంతటి వాడినీ ఎలాంటి వాడిని, తెలుసుకుని అనన్య భావనతో ఎవరు సేవిస్తారో వారు నాకు అత్యుత్తమమైన భక్తులు

మల్లిఙ్గమద్భక్తజన దర్శనస్పర్శనార్చనమ్
పరిచర్యా స్తుతిః ప్రహ్వ గుణకర్మానుకీర్తనమ్

నా గుర్తులను గానీ నా గుర్తులు కల నా భక్త జనమును గానీ దర్శించుట, స్పృశించుట పూజించుట సేవించుట స్తోత్రం చేయుట వినయముగా వారి గుణాలనూ కర్మలనూ కీర్తించుట

మత్కథాశ్రవణే శ్రద్ధా మదనుధ్యానముద్ధవ
సర్వలాభోపహరణం దాస్యేనాత్మనివేదనమ్

నా కథలను వినడములో శ్రద్ధ కలవాడు, నన్ను ఎపుడూ ధ్యానం చేస్తూ ఉండాలి. పొందినవాటి మొత్తాన్నీ నాకు అర్పించుట, దాస్యముతో తనను తాను నాకు నివేదన చేయుట.

మజ్జన్మకర్మకథనం మమ పర్వానుమోదనమ్
గీతతాణ్డవవాదిత్ర గోష్ఠీభిర్మద్గృహోత్సవః

గానములూ వాయిద్యములూ తాండవుములూ ఇలాంటి వాటితో పండగ చేసుకొనుట.

యాత్రా బలివిధానం చ సర్వవార్షికపర్వసు
వైదికీ తాన్త్రికీ దీక్షా మదీయవ్రతధారణమ్

వార్షికపర్వలు చేసుకొనుట. వైదిక, తంత్ర దీక్షా, నా వ్రతాన్ని ధరించుట

మమార్చాస్థాపనే శ్రద్ధా స్వతః సంహత్య చోద్యమః
ఉద్యానోపవనాక్రీడ పురమన్దిరకర్మణి

నా విగ్రహాన్ని ప్రతిష్టించడములో శ్రద్ధ కలిగి ఉండుట, తనకు తానుగా ముందుకు వచ్చి ఉదయమం చేయుట, ఉద్యానాలూ ఊపవనాలూ క్రీడా పురాలూ  ఇలాంటి వాటిలో

సమ్మార్జనోపలేపాభ్యాం సేకమణ్డలవర్తనైః
గృహశుశ్రూషణం మహ్యం దాసవద్యదమాయయా

ఊడ్చుట, అలుకుట నీళ్ళు జల్లుట ముగ్గులుజల్లుట, ఇంటిలో సేవించుట, కపటం లేకుండా దాసునిలా నన్ను సేవించుట

అమానిత్వమదమ్భిత్వం కృతస్యాపరికీర్తనమ్
అపి దీపావలోకం మే నోపయుఞ్జ్యాన్నివేదితమ్

గర్వం లేకుండుట కపటం లేకుండుట, తాను చేసిన దాన్ని తానే కీర్తించుకోకుండా ఉండుట. నాకు అర్పించిన దాన్ని తాను వాడకూడదు. భగవంతునికి అర్పించిన దీపాదులను మనకోసం వాడరాదు.

యద్యదిష్టతమం లోకే యచ్చాతిప్రియమాత్మనః
తత్తన్నివేదయేన్మహ్యం తదానన్త్యాయ కల్పతే

భగవంతునికి మనకు ఏది అత్యంత ఇష్టమో దాన్ని స్వామికి నివేదన చేయాలి. అలాంటిదే మోక్షాన్ని ఇస్తుంది. మనకు ఇష్టమైన దాన్నే భగవంతునికి సమర్పించాలి.

సూర్యోऽగ్నిర్బ్రాహ్మణా గావో వైష్ణవః ఖం మరుజ్జలమ్
భూరాత్మా సర్వభూతాని భద్ర పూజాపదాని మే

సూర్యుడూ అగ్నీ బ్రాహ్మణుడూ గోవులూ వైష్ణవులూ ఆకాశం వాయువూ జలమూ భూమీ ఆత్మ సర్వ భూతములూ ఇవన్నీ నాకు మారుగా పూజించదగినవి. ఇంటిలో విగ్రహం లేకపోయినా, గుడికి వెళ్ళలేకపోయినా వీటిని పూజించవచ్చు.

సూర్యే తు విద్యయా త్రయ్యా హవిషాగ్నౌ యజేత మామ్
ఆతిథ్యేన తు విప్రాగ్ర్యే గోష్వఙ్గ యవసాదినా

సూర్యభగవానున్ని గాయత్రీ మంత్రముతో ఆరాధించాలి
అగ్నిని హవిస్సుతో
బ్రాహ్మణునికి ఆతిధ్యముతో
తృణాలు ఇచ్చి గోవులనూ
బంధువులా విష్ణుభక్తున్ని సత్కరించాలి
దహరాకాశములో ధ్యానముతో స్వామిని ఆరాధించాలి

వైష్ణవే బన్ధుసత్కృత్యా హృది ఖే ధ్యాననిష్ఠయా
వాయౌ ముఖ్యధియా తోయే ద్రవ్యైస్తోయపురఃసరైః

వాయువును ప్రాణ బుద్ధితో ఆరాధించాలి
జలమును ఇతర ద్రవ్యములతో ఆరాధించాలి
స్థండిలములో మనకు అన్ని భోగములనూ పరమాత్మ బుద్ధితో పూజించాలి

స్థణ్డిలే మన్త్రహృదయైర్భోగైరాత్మానమాత్మని
క్షేత్రజ్ఞం సర్వభూతేషు సమత్వేన యజేత మామ్

అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మను సమబుద్ధితో పూజించాలి

ధిష్ణ్యేష్విత్యేషు మద్రూపం శఙ్ఖచక్రగదామ్బుజైః
యుక్తం చతుర్భుజం శాన్తం ధ్యాయన్నర్చేత్సమాహితః

నా ఆలయాలలో ఈ రూపముతో ఉన్న నన్ను సావధాన మనస్కుడై ధ్యానమూ అర్చనా చేయాలి

ఇష్టాపూర్తేన మామేవం యో యజేత సమాహితః
లభతే మయి సద్భక్తిం మత్స్మృతిః సాధుసేవయా

ఇలా నన్ను ఎవరు పూజిస్తారో వారు నాయందు భక్తిని పొందుతారు. నన్ను మరువ కుండా ఉండడానికి సజ్జనులను పూజించాలి.

ప్రాయేణ భక్తియోగేన సత్సఙ్గేన వినోద్ధవ
నోపాయో విద్యతే సమ్యక్ప్రాయణం హి సతామహమ్

సత్సంగం లేకుండా వేరే ఉపాయం నన్ను పొందడానికి లేదు.సత్పురుషులకు నేను ముఖాన్ని

అథైతత్పరమం గుహ్యం శృణ్వతో యదునన్దన
సుగోప్యమపి వక్ష్యామి త్వం మే భృత్యః సుహృత్సఖా

ఇది పరమ రహస్యము. నీవు నావాడవు కాబట్టి దాచకుండా చెబుతున్నాను.  నీవు నా నమ్మిన బంటువు స్నేహితుడవు.

                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు