Pages

Thursday, 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై మూడవ అధ్యాయం

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై మూడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అయుతే ద్వే శతాన్యష్టౌ నిరుద్ధా యుధి నిర్జితాః
తే నిర్గతా గిరిద్రోణ్యాం మలినా మలవాససః

క్షుత్క్షామాః శుష్కవదనాః సంరోధపరికర్శితాః
దదృశుస్తే ఘనశ్యామం పీతకౌశేయవాససమ్

శ్రీవత్సాఙ్కం చతుర్బాహుం పద్మగర్భారుణేక్షణమ్
చారుప్రసన్నవదనం స్ఫురన్మకరకుణ్డలమ్

పద్మహస్తం గదాశఙ్ఖ రథాఙ్గైరుపలక్షితమ్
కిరీటహారకటక కటిసూత్రాఙ్గదాఞ్చితమ్

భ్రాజద్వరమణిగ్రీవం నివీతం వనమాలయా
పిబన్త ఇవ చక్షుర్భ్యాం లిహన్త ఇవ జిహ్వయా

జిఘ్రన్త ఇవ నాసాభ్యాం రమ్భన్త ఇవ బాహుభిః
ప్రణేముర్హతపాప్మానో మూర్ధభిః పాదయోర్హరేః

కృష్ణసన్దర్శనాహ్లాద ధ్వస్తసంరోధనక్లమాః
ప్రశశంసుర్హృషీకేశం గీర్భిః ప్రాఞ్జలయో నృపాః

ఇరవై వేల ఎనిమిది వందల మంది రాజులను జరాసంధుడు లీలగా ఓడించి తన దగ్గర ఉంచుకుని బంధించాడు. మురికి బట్టలు ఉన్నవారు, ఆకలితో ఉన్నవారైన ఆ రాజులు పరమాత్మను నీలమేఘశ్యాముడూ, పీతాంబరధారి, శ్రీవత్సాంకితుడు, పద్మగర్భారుణేక్షుడు  చతుర్భాహుడు చారుప్రసన్నవదనుడు, పద్మ హస్తాం గలవాడు, ఇలాంటి పరమాత్మను కన్నులతో తాగుతున్నట్లుగా బాహువులతో ఆలింగనం చేసుకున్నట్లుగా తమ శిరస్సులతో స్వామి పాదాలమీద పడి నమస్కరించి కృష్ణ పరమాత్మను దర్శించడం వలన ఇంత కాలం బంధించబడడం వలన వచ్చిన అలసటా బాధా అంతా పోయి పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు. ఆశ్రయించినవారి బాధను తొలగించే వాడా

రాజాన ఊచుః
నమస్తే దేవదేవేశ ప్రపన్నార్తిహరావ్యయ
ప్రపన్నాన్పాహి నః కృష్ణ నిర్విణ్ణాన్ఘోరసంసృతేః

నైనం నాథానుసూయామో మాగధం మధుసూదన
అనుగ్రహో యద్భవతో రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో

రాజ్యైశ్వర్యమదోన్నద్ధో న శ్రేయో విన్దతే నృపః
త్వన్మాయామోహితోऽనిత్యా మన్యతే సమ్పదోऽచలాః

ఈ భయంకరమైన సంసారమువలన చిన్న బోయిన మమ్ము, నిన్ను ఆశ్రయించిన మమ్ము కాపాడు. ఇప్పటిదాకా జరాసంధుడు దుర్మార్గుడు అని అనుకున్నాముగానీ ఆయన స్తోత్రం చేయడానికి అర్హుడు. ఆయన వలననే నీవు ఈనాడు మాకు సాక్షాత్కరించావు
రాజులకు రాజ్యం భ్రంశం అగుట నీ అనుగ్రహమే కదా. నీవు ఎవరిని దయ చూడాలని అనుకుంటావో వారి సంపదను హరిస్తావు. మాకే కాదు ఏ రాజులకు రాజ్యం పోయిన నీవు వారిని అనుగ్రహించావు అని అర్థం. రాజ్యం, ఐశ్వర్యం అనే మదం కమ్మితే ఏ మానవుడూ శ్రేయస్సును చూడలేడు. నీ మాయతో మోహించబడి అనిత్యములను నిత్యమని భావిస్తాడు

మృగతృష్ణాం యథా బాలా మన్యన్త ఉదకాశయమ్
ఏవం వైకారికీం మాయామయుక్తా వస్తు చక్షతే

ఎండమావులను చూచి పిల్లలు నీటి మడుగుగా భావించినట్లుగా చంచలములైన వాటిని నిత్యముగా భావిస్తారు. మేము కూడా శ్రీ మదముతో జ్ఞ్యానాన్ని కోల్పోయి ఒకరినొకరు గెలవాలని ఒకరిపై ఒకరు స్పర్థనూ ద్వేషాన్నిపెంచుకుని మావారిని మేమే దయలేనివారమై చంపుకున్నాము. ముందర వున్న మృత్యును లెక్కించక మావారిని మేమే ధ్వేషించుకుని చంపుకుంటూ ఉన్నాము. ఇలా చేసిన మేము ఈనాడు మహావేగము ఉన్నటువంటి కాలవేగముతో సంపద కాస్తా భ్రంశమైతే, నీ దయతో కాలముతో సంపదలు నశిస్తే గర్వం అంతా పోయి నిన్ను స్మరిస్తున్నాము. మాకు ఇంక ఏ రాజ్యమూ వద్దు. ఎండ మావులవంటిది ఈ రాజ్యం. ఈ శరీరం కూడా వద్దు. అది ఎపుడు పడిపోతుందో తెలియదు. పడిపోకుండా ఉన్నా అది రోగ భూయిష్టం. దీనితో మాకు పని లేదు. మాకేమనిపిస్తుందంటే, నిరంతరం నిన్ను సేవించాలి, నీ సేవనే కోరుతున్నాము. ప్రాణం విడిచినా అక్కడా నీ సేవే చేయాలి, ప్రాణముతో ఉన్నందుకూ నీ సేవే చేయాలి. నిరంతరం నీ పాద పద్మముల యందు మా బుద్ధి ప్రవర్తించేలా, సంసారాన్ని విరమించేలా మాకు ఉత్తమ ఉపాయాన్ని మీరు బోధించండి

వయం పురా శ్రీమదనష్టదృష్టయో జిగీషయాస్యా ఇతరేతరస్పృధః
ఘ్నన్తః ప్రజాః స్వా అతినిర్ఘృణాః ప్రభో మృత్యుం పురస్త్వావిగణయ్య దుర్మదాః

త ఏవ కృష్ణాద్య గభీరరంహసా దురన్తేవీర్యేణ విచాలితాః శ్రియః
కాలేన తన్వా భవతోऽనుకమ్పయా వినష్టదర్పాశ్చరణౌ స్మరామ తే

అథో న రాజ్యమ్మృగతృష్ణిరూపితం దేహేన శశ్వత్పతతా రుజాం భువా
ఉపాసితవ్యం స్పృహయామహే విభో క్రియాఫలం ప్రేత్య చ కర్ణరోచనమ్

తం నః సమాదిశోపాయం యేన తే చరణాబ్జయోః
స్మృతిర్యథా న విరమేదపి సంసరతామిహ

కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే
ప్రణతక్లేశనాశాయ గోవిన్దాయ నమో నమః

ఇది కృష్ణ పరమాత్మ యొక్క అత్యద్భుతమైన ఇరవై ఏడు మంత్రములో ఇది ఒక మంత్రం. ఇలా ప్రార్థన చేస్తే దయతో ప్రేమతో స్వామి ఇలా అన్నాడు

శ్రీశుక ఉవాచ
సంస్తూయమానో భగవాన్రాజభిర్ముక్తబన్ధనైః
తానాహ కరుణస్తాత శరణ్యః శ్లక్ష్ణయా గిరా

శ్రీభగవానువాచ
అద్య ప్రభృతి వో భూపా మయ్యాత్మన్యఖిలేశ్వరే
సుదృఢా జాయతే భక్తిర్బాఢమాశంసితం తథా

ఈ రోజు నుంచీ మీకు నాయందు భక్తి దృఢముగా ఉంటుంది, మీరు కోరిన విధముగా.మీరూన్న మాటే చెప్పారు. సంపదా ఐశ్వర్యమూ అన్న మదముతో ఉన్నవాడు తనను తాను తన తాళ్ళతోనే కట్టేసుకుంటాడు. అటున్వటి పిచ్చివారిని చూడండి

దిష్ట్యా వ్యవసితం భూపా భవన్త ఋతభాషిణః
శ్రీయైశ్వర్యమదోన్నాహం పశ్య ఉన్మాదకం నృణామ్

హైహయో నహుషో వేణో రావణో నరకోऽపరే
శ్రీమదాద్భ్రంశితాః స్థానాద్దేవదైత్యనరేశ్వరాః

హైహయుడూ నహుషుడు వేనుడూ రావణుడూ నరకాసురుడు వీరందరూ దేవ దైత్య అధిపతులు. వీరందరూ శ్రీమదం చేతనే పతనమయ్యారు

భవన్త ఏతద్విజ్ఞాయ దేహాద్యుత్పాద్యమన్తవత్
మాం యజన్తోऽధ్వరైర్యుక్తాః ప్రజా ధర్మేణ రక్ష్యథ

సన్తన్వన్తః ప్రజాతన్తూన్సుఖం దుఃఖం భవాభవౌ
ప్రాప్తం ప్రాప్తం చ సేవన్తో మచ్చిత్తా విచరిష్యథ

ఈ విషయాన్ని మీరు కూడా తెలుసుకోండి. పుట్టుక గల శరీరాలన్నీ నశించేవే అన్న విషయం తెలుసుకోండి.
యజ్ఞ్యములతో నన్ను పూజిస్తూ ప్రజలను ధర్మముతో కాపాడండి, సంతానాన్ని పొంది వంశం అభివృద్ధి చేసుకుని సుఖదుఃఖములూ పుట్టుక మరణములూ ఇలా సహజముగా లభించినవాటిని సేవించండి. లభించని వాటి కొరకు వెంపర్లాడకండి. నా చేత లభించబడిన దాని చేతే మీరు తృప్తి పొందండి. ఒక విజయమూ సంపదా ఉత్సవం లభించినా అది మా వలననే వచ్చింది అని గర్వించకండి. నా యందు మనసు ఉంచండి.

ఉదాసీనాశ్చ దేహాదావాత్మారామా ధృతవ్రతాః
మయ్యావేశ్య మనః సమ్యఙ్మామన్తే బ్రహ్మ యాస్యథ

దేహమూ దేహం కోసం వచ్చిన వారిపైనా శరీరం వలన వచ్చిన వారిపైనా ఉదాసీనముగా ఉండండి. పరమాత్మ ఐన నాయందే విహరించండి." అది మా వ్రతం" అని దీక్ష పూనండి. మనసును నా యందు ఉంచి ఇలా వ్యవహరించగలిగితే చివరకు నన్ను చేరుకుంటారు

శ్రీశుక ఉవాచ
ఇత్యాదిశ్య నృపాన్కృష్ణో భగవాన్భువనేశ్వరః
తేషాం న్యయుఙ్క్త పురుషాన్స్త్రియో మజ్జనకర్మణి

సపర్యాం కారయామాస సహదేవేన భారత
నరదేవోచితైర్వస్త్రైర్భూషణైః స్రగ్విలేపనైః

అని ఆజ్ఞ్యాపించి భగవానుడు వారిని స్నానం చేయడానికి స్త్రీపురుషులను ఉంచి వారి సపర్యలు చేయమని సహ దేవుడిని ఆజ్ఞ్యాపిస్తే మహారాజులకు తగిన వస్త్రాభరణములూ పూలదండలూ ఉత్తమమైనభోజనం పెట్టించి

భోజయిత్వా వరాన్నేన సుస్నాతాన్సమలఙ్కృతాన్
భోగైశ్చ వివిధైర్యుక్తాంస్తామ్బూలాద్యైర్నృపోచితైః

తే పూజితా ముకున్దేన రాజానో మృష్టకుణ్డలాః
విరేజుర్మోచితాః క్లేశాత్ప్రావృడన్తే యథా గ్రహాః

రథాన్సదశ్వానారోప్య మణికాఞ్చనభూషితాన్
ప్రీణయ్య సునృతైర్వాక్యైః స్వదేశాన్ప్రత్యయాపయత్

చక్కగా స్నానం చేసి అలంకరించుకున్నవారికి అన్ని భోగ్యములూ ఇచ్చి తాంబూలం సమర్పించి, చెవులకు ఆభరణాలు ఇచ్చారు. (చెవులకు ఆభరణాలు ఉంటేనే తక్కిన శరీరానికి ఉన్న ఆభరణాలు సార్ధకం.నిజమైన కర్ణాభరణాలు పరమాత్మ కథలు వినడమే)
మబ్బులు తొలగిపోతే నక్షత్రాలలాగ రాజులందరూ ప్రకాశించారు.చక్కగా అలమర్కించబడిన రథములు ఎక్కారు. కృష్ణ పరమాత్మ మంచి మాటలతో వారికి ప్రీతి కలిగించి వారిని వారి రాజ్యాలకు వెళ్ళి రాజ్యపాలన చేసుకోమనీ, తనను మరవద్దని చెప్పాడు. పరమాత్మ చేత విడుదల చేయబడిన వారు పరమాత్మను ధ్యానం చేస్తూ పరమాత్మ కృత్యములను తలచుకుంటూ తమ తమ రాజ్యములకు వెళ్ళి కృష్ణ పరమాత్మ చేసిన కృత్యములను వివరించి చెప్పారు. పరమాత్మ అజ్ఞ్యాపించిన రీతిలో రాజ్యపాలనను తూ చా తప్పకుండా ఆచరించారు.

త ఏవం మోచితాః కృచ్ఛ్రాత్కృష్ణేన సుమహాత్మనా
యయుస్తమేవ ధ్యాయన్తః కృతాని చ జగత్పతేః

జగదుః ప్రకృతిభ్యస్తే మహాపురుషచేష్టితమ్
యథాన్వశాసద్భగవాంస్తథా చక్రురతన్ద్రితాః

జరాసన్ధం ఘాతయిత్వా భీమసేనేన కేశవః
పార్థాభ్యాం సంయుతః ప్రాయాత్సహదేవేన పూజితః

కృష్ణ పరమాత్మ భీమునితో జరాసంధుని వధింపచేసి సహదేవుని చేత పూజించబడి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. ఖాండవ ప్రస్థానికి వెళ్ళి మిత్రువులకు ఆనందాన్ని శత్రువులకు దుఃఖాన్నీ కలిగించే శత్రు జయాన్ని చాటి చెప్పే శంఖాన్ని పూరించాడు

గత్వా తే ఖాణ్డవప్రస్థం శఙ్ఖాన్దధ్ముర్జితారయః
హర్షయన్తః స్వసుహృదో దుర్హృదాం చాసుఖావహాః

తచ్ఛ్రుత్వా ప్రీతమనస ఇన్ద్రప్రస్థనివాసినః
మేనిరే మాగధం శాన్తం రాజా చాప్తమనోరథః

దాన్ని విని ఇంద్రప్రస్థములో ఉన్నవారందరూ సంతోషించి అర్థం చేసుకున్నారు. భీమ కృష్ణార్జనులు గెలిచారని తెలుసుకున్నారు
ధర్మరాజు తన కోరిక తీరినవాడయ్యాడ్య్

అభివన్ద్యాథ రాజానం భీమార్జునజనార్దనాః
సర్వమాశ్రావయాం చక్రురాత్మనా యదనుష్ఠితమ్

నిశమ్య ధర్మరాజస్తత్కేశవేనానుకమ్పితమ్
ఆనన్దాశ్రుకలాం ముఞ్చన్ప్రేమ్ణా నోవాచ కిఞ్చన

ముగ్గురూ ధర్మరాజునకు నమస్కరించి తాము చేసిన పని మొత్తాన్ని పూస గుచ్చినట్లు వివరించారు. అంతా విని ఆనందం ఉప్పొంగగా నోట మాట రాక ఆనందబాష్పాలు కళ్ళ నిండగా మౌనం వహించాడు

                                                         సర్వం శ్రీకృష్ణార్పణమస్తు