Pages

Thursday, 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై ఒకటవ అధ్యాయం

         

          ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై ఒకటవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఇత్యుదీరితమాకర్ణ్య దేవఋషేరుద్ధవోऽబ్రవీత్
సభ్యానాం మతమాజ్ఞాయ కృష్ణస్య చ మహామతిః

ఒక విషయం మాట్లాడాలి అనుకున్నప్పుడు సభలో ఐతే సభలో ఉన్న వారి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అది తెలుసుకుని, కృష్ణుడు కూడా ఏమనుకుంటున్నాడో కూడా తెలుసుకున్నాడు, గొప్ప బుద్ధి కలవాడైన ఉద్ధవుడు. తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు

శ్రీద్ధవ ఉవాచ
యదుక్తమృషినా దేవ సాచివ్యం యక్ష్యతస్త్వయా
కార్యం పైతృష్వస్రేయస్య రక్షా చ శరణైషిణామ్

రెండు పనులూ చాలా ముఖ్యమైనవే, తప్పకుండా చేయవలసినవే. మేనత్తకొడుకు యజ్ఞ్యం చేస్తున్నపుడు సాయం చేయడం, జరాసంధుని  బారిన పడిన రాజులను విడిపించడం

యష్టవ్యమ్రాజసూయేన దిక్చక్రజయినా విభో
అతో జరాసుతజయ ఉభయార్థో మతో మమ

ఈ రెండూ వేరు వేరు పనులేమీ కాదు. ఒకే పని. రాజసూయమంటే భూమండలములో ఉన్న సకల రాజులనూ గెలిచినవారే రాజసూయం చేయాలి. అందరూ తాను చెప్పినట్లు వినేవారే కావాలి. అందులో రాజ జయం కూడా అంగమే కాబట్టి, రాజసూయములోనే జరాసంధవధ భాగముగా చేద్దాము

అస్మాకం చ మహానర్థో హ్యేతేనైవ భవిష్యతి
యశశ్చ తవ గోవిన్ద రాజ్ఞో బద్ధాన్విముఞ్చతః

ఇలా చేస్తే మనకు కూడా చాలా పెద్ద ప్రయోజనం నెరవేరుతుంది. బావగారి క్రతువుకు సాయం చేసినవారం అవుతాము, బంధిన బడిన రాజులను విడిపించగలుగుతాము. తద్వారా నీకు చాలా మంచి కీర్తి వస్తుంది

స వై దుర్విషహో రాజా నాగాయుతసమో బలే
బలినామపి చాన్యేషాం భీమం సమబలం వినా

అతను పది వేల ఏనుగుల బలం కలవాడు. ఒక్క భీముడు తప్ప, అతను తక్కిన బలవంతులుగా పేరుగాంచి వారందరికన్నా బలవంతుడు

ద్వైరథే స తు జేతవ్యో మా శతాక్షౌహిణీయుతః
బ్రాహ్మణ్యోऽభ్యర్థితో విప్రైర్న ప్రత్యాఖ్యాతి కర్హిచిత్

జరిగిన అనుభవాన్ని జ్ఞ్యాపకం ఉంచుకుంటే నూరు అక్షౌహిణీల సైన్యముతో వెళ్ళినా లాభం లేదు. ద్వంద్వ యుద్ధముతో గెలవాలి. అతను దుష్టుడే ఐనా బ్రాహ్మణులంటే భక్తి కలవాడు

బ్రహ్మవేషధరో గత్వా తం భిక్షేత వృకోదరః
హనిష్యతి న సన్దేహో ద్వైరథే తవ సన్నిధౌ

భీముడు బ్రాహ్మణుడి వేషములో వెళ్ళి యాచించి, ద్వంద్వ యుద్ధాన్ని యాచిస్తే జరాసంధుడు కాదనడు. అందులో ఆయనను ఓడించవచ్చు. అది నీవు ఉండగా జరగాలి. అంటే నీవు కూడా బ్రాహ్మణ వేషం వేసుకుని వెళ్ళాలి. నీ అనుగ్రహముతోనే భీముడు జరాసంధుడిని వధించాలి

నిమిత్తం పరమీశస్య విశ్వసర్గనిరోధయోః
హిరణ్యగర్భః శర్వశ్చ కాలస్యారూపిణస్తవ

సకల చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణం ఐన నీవు ఒక్కో సారి ఒక్కొకరిని నిమిత్తముగా చేసుక్ని చేస్తావు పనులను

గాయన్తి తే విశదకర్మ గృహేషు దేవ్యో
రాజ్ఞాం స్వశత్రువధమాత్మవిమోక్షణం చ
గోప్యశ్చ కుఞ్జరపతేర్జనకాత్మజాయాః
పిత్రోశ్చ లబ్ధశరణా మునయో వయం చ

కాల రూపుడివై నీవే అందరిలో ఉండి కర్మలు చేస్తావు. బ్రహ్మ రూపముతో సృష్టి విష్ణు రూపములో రక్షణ రుద్ర రూపములో సంహారమూ చేస్తావు. నీ అద్భుతమైన పనులనూ నీ పరాక్రమాలనూ , ప్రతీ రాజ్యములో ఉన్న అంతఃపుర స్త్రీలూ గానం చేస్తారు. నీవు జరాసంధుని చంపి రాజులను విడిపిస్తే వారి పత్నులందరూ నీ ఘనకీర్తిని గానం చేస్తారు

జరాసన్ధవధః కృష్ణ భూర్యర్థాయోపకల్పతే
ప్రాయః పాకవిపాకేన తవ చాభిమతః క్రతుః

గోపికలూ  మహారాజులూ నీ తల్లి తండ్రులూ మేమూ అందరమూ నీ కీర్తిని కాపాడుతాము. చాలా గొప్ప పనులకు జరాసంధ వధ ఉపకరిస్తుంది.ఇలాంటి పెద్ద పెద్ద పనులను పూర్తి చేసుకోవడానికి రాజసూయ యాగం నీకు అనుకూలమని భావిస్తున్నాను.

శ్రీశుక ఉవాచ
ఇత్యుద్ధవవచో రాజన్సర్వతోభద్రమచ్యుతమ్
దేవర్షిర్యదువృద్ధాశ్చ కృష్ణశ్చ ప్రత్యపూజయన్

అన్ని రకములా క్షేమదాయకమైన ఉద్ధవుని వాక్యం విని నారదుడూ, యాదవులూ వృద్ధులూ కృష్ణపరమాత్మా అందరూ ఆమోదించారు,.

అథాదిశత్ప్రయాణాయ భగవాన్దేవకీసుతః
భృత్యాన్దారుకజైత్రాదీననుజ్ఞాప్య గురూన్విభుః

ఇంక మనం బయలుదేరదాము అని పెద్దల అనుమతి తీసుకుని బయలుదేరారు. బలరాముని ఉగ్రసేనుని ఆజ్ఞ్య తీసుక్ని తన రథాన్ని తాను అధిరోహించి తక్కినవారందరితో బయలుదేరాడు

నిర్గమయ్యావరోధాన్స్వాన్ససుతాన్సపరిచ్ఛదాన్
సఙ్కర్షణమనుజ్ఞాప్య యదురాజం చ శత్రుహన్
సూతోపనీతం స్వరథమారుహద్గరుడధ్వజమ్

తతో రథద్విపభటసాదినాయకైః
కరాలయా పరివృత ఆత్మసేనయా
మృదఙ్గభేర్యానకశఙ్ఖగోముఖైః
ప్రఘోషఘోషితకకుభో నిరక్రమత్

నృవాజికాఞ్చనశిబికాభిరచ్యుతం సహాత్మజాః పతిమను సువ్రతా యయుః
వరామ్బరాభరణవిలేపనస్రజః సుసంవృతా నృభిరసిచర్మపాణిభిః

నరోష్ట్రగోమహిషఖరాశ్వతర్యనః
కరేణుభిః పరిజనవారయోషితః
స్వలఙ్కృతాః కటకుటికమ్బలామ్బరాద్య్
ఉపస్కరా యయురధియుజ్య సర్వతః

సకుటుంబ సపరివారముగా స్వామి బయలుదేరాడు. ఎంతో మంది రాజులు ఆభరణములూ వస్త్రములూ కానుకలూ తీసుకుని రకరకముల శకటములతో (నరులు మోసేవి, ఒంటెలూ మహిషములూ ఖరములూ, కంచరగాడిదలనూ, ఏనుగులూ, ఇలాంటివాటితో మోయబడే రథాలతో) బయలు దేరారు

బలం బృహద్ధ్వజపటఛత్రచామరైర్
వరాయుధాభరణకిరీటవర్మభిః
దివాంశుభిస్తుములరవం బభౌ రవేర్
యథార్ణవః క్షుభితతిమిఙ్గిలోర్మిభిః

అథో మునిర్యదుపతినా సభాజితః ప్రణమ్య తం హృది విదధద్విహాయసా
నిశమ్య తద్వ్యవసితమాహృతార్హణో ముకున్దసన్దరశననిర్వృతేన్ద్రియః

రాజదూతమువాచేదం భగవాన్ప్రీణయన్గిరా
మా భైష్ట దూత భద్రం వో ఘాతయిష్యామి మాగధమ్

ఇత్యుక్తః ప్రస్థితో దూతో యథావదవదన్నృపాన్
తేऽపి సన్దర్శనం శౌరేః ప్రత్యైక్షన్యన్ముముక్షవః

ధ్వజములూ ఆభ్రణములూ చత్రములూ చామరములూ ఇలాంటి అనేక శోభలతో బాగా అలలతో ఉప్పొంగిన సముద్రములో ఎలాంటి ఘోష వస్తుందో కృష్ణ భగవానుని సైన్య పరివారముతో బయలుదేరిన ఆ పరివారం అంత కలకలమూ కలిగించుకుంటూ వస్తోంది. నారదుడు కృష్ణ పరమాత్మ చేత పూజించబడి అతనినే మనసుతో ధ్యానం చేస్తూ, ఆయన రెండు పనులనూ చేయబోతున్నాడని తెలుసుకుని ఆనందించాడు. కృష్ణుడు బయలు దేరబోతూ రాజులు పంపిన దూతలకు భయమిచ్చాడు.; నేను జరాసంధుని వధిస్తాను, మీరాజులను నిర్భయముగా ఉండమనండి. అన్నాడు.

ఆనర్తసౌవీరమరూంస్తీర్త్వా వినశనం హరిః
గిరీన్నదీరతీయాయ పురగ్రామవ్రజాకరాన్

దారిలో ఉన్న రాజ్యములూ నగరములూ పురములూ అన్ని దాటి సర్వస్తీ మొదలైన నదులను దాటి ఇంద్రప్రస్థానికి వచ్చాడు కృష్ణుడు.

తతో దృషద్వతీం తీర్త్వా ముకున్దోऽథ సరస్వతీమ్
పఞ్చాలానథ మత్స్యాంశ్చ శక్రప్రస్థమథాగమత్

తముపాగతమాకర్ణ్య ప్రీతో దుర్దర్శనం నృనామ్
అజాతశత్రుర్నిరగాత్సోపధ్యాయః సుహృద్వృతః

 కృష్ణ పరమాత్మ వచ్చాడన్న వార్త విని ధర్మరాజు పురోహితులతో మిత్రులతో తగిన పరివారముతో ఎదురుగా వచ్చి

గీతవాదిత్రఘోషేణ బ్రహ్మఘోషేణ భూయసా
అభ్యయాత్స హృషీకేశం ప్రాణాః ప్రాణమివాదృతః

దృష్ట్వా విక్లిన్నహృదయః కృష్ణం స్నేహేన పాణ్డవః
చిరాద్దృష్టం ప్రియతమం సస్వజేऽథ పునః పునః

మంగళ్ వాద్యాలతో వేద ఘోషతో స్వాగం చెప్పి, ప్రాణాలు వస్తే ఎలా సంతోషిస్తామో అంతగా ఆనందించి, స్వామిని చూచి చాలా కాలం అవ్వడముతో

దోర్భ్యాం పరిష్వజ్య రమామలాలయం ముకున్దగాత్రం నృపతిర్హతాశుభః
లేభే పరాం నిర్వృతిమశ్రులోచనో హృష్యత్తనుర్విస్మృతలోకవిభ్రమః

కృష్ణున్ని ఆలింగనం చేసుకుని అన్ని పాపాలనూ పోగొట్టుకున్నాడు. గొప్ప తృప్తిని పొంది కనులలో ఆనంద్బాష్పాలు వచ్చి శరీరం పులకించింది.

తం మాతులేయం పరిరభ్య నిర్వృతో భీమః స్మయన్ప్రేమజలాకులేన్ద్రియః
యమౌ కిరీటీ చ సుహృత్తమం ముదా ప్రవృద్ధబాష్పాః పరిరేభిరేऽచ్యుతమ్

 భీముడు కూడా ఆలింగనం చేసుకున్నాడు. నకుల సహదేవులూ అర్జనుడూ కూడా ఆలింగనం చేసుకున్నారు ఆనందబాష్పాలతో. నకుల సహదేవులు నమస్కరించారు.

అర్జునేన పరిష్వక్తో యమాభ్యామభివాదితః
బ్రాహ్మణేభ్యో నమస్కృత్య వృద్ధేభ్యశ్చ యథార్హతః
మానినో మానయామాస కురుసృఞ్జయకైకయాన్

సూతమాగధగన్ధర్వా వన్దినశ్చోపమన్త్రిణః
మృదఙ్గశఙ్ఖపటహ వీణాపణవగోముఖైః
బ్రాహ్మణాశ్చారవిన్దాక్షం తుష్టువుర్ననృతుర్జగుః

 బ్రాహ్మణులకూ వృద్ధులకూ పెద్దలకూ అందరికీ నమస్కారం చేసి వారి చేత పూజించబడ్డాడూ,వారిని పూజించాడు. అన్ని మంగళ వాద్యాలతో బ్రాహ్మణులు ఆశీర్వాదములతో అక్షతలో ఆశీర్వదించారు, వంది మాగధులు స్తోత్రం చేసారు, గానం చేసేవారు గానం చేసారు, నర్తకీమణులు నాట్యం చేసారు

ఏవం సుహృద్భిః పర్యస్తః పుణ్యశ్లోకశిఖామణిః
సంస్తూయమానో భగవాన్వివేశాలఙ్కృతం పురమ్

సంసిక్తవర్త్మ కరిణాం మదగన్ధతోయైశ్
చిత్రధ్వజైః కనకతోరణపూర్ణకుమ్భైః
మృష్టాత్మభిర్నవదుకూలవిభూషణస్రగ్
గన్ధైర్నృభిర్యువతిభిశ్చ విరాజమానమ్

ఉద్దీప్తదీపబలిభిః ప్రతిసద్మ జాల
నిర్యాతధూపరుచిరం విలసత్పతాకమ్
మూర్ధన్యహేమకలశై రజతోరుశృఙ్గైర్
జుష్టం దదర్శ భవనైః కురురాజధామ

ఇలా అందరితో కలసి పుణ్యశ్లోక శిఖామణి (ఉత్తముల చేత కీర్తించబడినవారిలో సర్వోత్తముడు) ఐన స్వామి స్తోత్రం చేయబడుతూ నగరములోకి ప్రవేశించాడు
నగరాన్ని చక్కగా అలంకరించారు, ఏనుగుల మదజలములతో తడిపేసారు, మద గజములూ బంగారు తోరణములూ పూర్ణ కుంభములూ, అక్కడ సంచరించే నర నారీమణులూ గంధములూ ముత్యములూ మాలలతో అలంకరించుకున్నారు
పరమాత్మను చూడడానికి నగరములో ఉన్న నరనరీమణులు పరిగెత్తుకుని వస్తోంటే కొప్పులూ వస్త్రాలూ జారిపోతూ ఉన్నాయి. భర్తలనూ పిల్లలల్నూ ఇంటిపనులనూ వదలి స్వామిని చూడడానికి వచ్చారు

గుర్రములూ ఏనుగులూ రథములూ పదాతులూ ఇలాంటి వాటితో సంకులముగా ఉన్న రాజ్యసభలోకి పరమాత్మను తీసుకు వస్తూ ఉంటే నర నారీమణులు ఆయన మీద పుష్పవర్షం కురిపిస్తూ స్వాగతం చెప్పారు. ఆయన భార్యలతో కలసి వచ్చాడు కాబట్టి, వారిని చూస్తూ ఈ పత్నులు ఎంత తపస్సు చేసుకున్నారో ఏమి తపస్సు చేసుకున్నారో, నిరంతరం కృష్ణ పరమాత్మను తమ కన్నులతో చూస్తూ ఆనందం పొందుతున్నారు

ప్రాప్తం నిశమ్య నరలోచనపానపాత్రమ్
ఔత్సుక్యవిశ్లథితకేశదుకూలబన్ధాః
సద్యో విసృజ్య గృహకర్మ పతీంశ్చ తల్పే
ద్రష్టుం యయుర్యువతయః స్మ నరేన్ద్రమార్గే

తస్మిన్సుసఙ్కుల ఇభాశ్వరథద్విపద్భిః
కృష్ణమ్సభార్యముపలభ్య గృహాధిరూఢాః
నార్యో వికీర్య కుసుమైర్మనసోపగుహ్య
సుస్వాగతం విదధురుత్స్మయవీక్షితేన

ఊచుః స్త్రియః పథి నిరీక్ష్య ముకున్దపత్నీస్
తారా యథోడుపసహాః కిమకార్యమూభిః
యచ్చక్షుషాం పురుషమౌలిరుదారహాస
లీలావలోకకలయోత్సవమాతనోతి

తత్ర తత్రోపసఙ్గమ్య పౌరా మఙ్గలపాణయః
చక్రుః సపర్యాం కృష్ణాయ శ్రేణీముఖ్యా హతైనసః

అన్తఃపురజనైః ప్రీత్యా ముకున్దః ఫుల్లలోచనైః
ససమ్భ్రమైరభ్యుపేతః ప్రావిశద్రాజమన్దిరమ్

భక్తి బాగా ఉన్నవారు స్వామి వెళుతూ ఉంటే గంధ పుష్పాలూ వస్త్రాలూ ఇచ్చుకుంటూ ఉన్నారు.,
అంతఃపుర స్త్రీలు కూడా స్వామిని సత్కరించిన తరువాత కృష్ణుడు రాజ మందిరానికి ప్రవేశించాడు

పృథా విలోక్య భ్రాత్రేయం కృష్ణం త్రిభువనేశ్వరమ్
ప్రీతాత్మోత్థాయ పర్యఙ్కాత్సస్నుషా పరిషస్వజే

కుంతి కృష్ణభగవానుని చూచి ఆలింగనం చేసుకుంది. ధర్మరాజు కూడా స్వామిని చూచిన ఆనందములో ఆయనను ఎలా పూజించాలో మరచిపోయాడు

గోవిన్దం గృహమానీయ దేవదేవేశమాదృతః
పూజాయాం నావిదత్కృత్యం ప్రమోదోపహతో నృపః

పితృస్వసుర్గురుస్త్రీణాం కృష్ణశ్చక్రేऽభివాదనమ్
స్వయం చ కృష్ణయా రాజన్భగిన్యా చాభివన్దితః

శ్వశృవా సఞ్చోదితా కృష్ణా కృష్ణపత్నీశ్చ సర్వశః
ఆనర్చ రుక్మిణీం సత్యాం భద్రాం జామ్బవతీం తథా

స్వామి కూడా మేనత్తలకూ పెద్దల భర్యలకూ గురుపత్నులకూ అభివాదం చేసాడు. ద్రౌపతి వచ్చి స్వామికి నమస్కారం చేసింది

కాలిన్దీం మిత్రవిన్దాం చ శైబ్యాం నాగ్నజితీం సతీమ్
అన్యాశ్చాభ్యాగతా యాస్తు వాసఃస్రఙ్మణ్డనాదిభిః

అపుడు కుంతి చెప్పింది, భార్యలతో వచ్చారు కదా, మీరు మీ అంతఃపురానికి వెళ్ళి పరస్పరం గౌరవించుకోండి అని చెప్పగా
వారందరినీ తీసుకుని వెళ్ళి వస్త్రాలతో గంధములతో పూలమాలలతో పూజించారు

సుఖం నివాసయామాస ధర్మరాజో జనార్దనమ్
ససైన్యం సానుగామత్యం సభార్యం చ నవం నవమ్

తర్పయిత్వా ఖాణ్డవేన వహ్నిం ఫాల్గునసంయుతః
మోచయిత్వా మయం యేన రాజ్ఞే దివ్యా సభా కృతా

ఉవాస కతిచిన్మాసాన్రాజ్ఞః ప్రియచికీర్షయా
విహరన్రథమారుహ్య ఫాల్గునేన భటైర్వృతః

ధర్మరాజు కూడా స్వామిని తగిన రీతిన పూజించి మయసభనే విడిదిగా ఇచ్చాడు. ధర్మరాజుకు ప్రీతి కలిగించాలని కొన్ని నెలలు ఉన్నాడు. అర్జనునితో కలసి రథం ఎక్కి కొంత కాలం విహరిస్తూ గడిపాడు.


        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు