Pages

Wednesday, 7 January 2015

ఆది వైద్యులు - వాగ్భటుడు



పూర్వకాలంలో వృద్ధత్రయీ అని పేర్కొనబడినవారిలో వాగ్భటుడు ఒకరు. మిగతా ఇద్దరు ఆత్రేయుడు, సుశ్రుతుడు. ఈయనచే విరచించబడిన ప్రఖ్యాత వైద్యగ్రంథాలు అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం. సింహగుప్తుని కుమారుడైన వాగ్భటుడు సింధునదీ పరివాహక ప్రాంతములో జన్మించాడు. అవలోకితుడు అనే బౌద్ధగురువు దగ్గర వాగ్భటుడు వైద్యవిద్యను అభ్యసించాడు. అయితే వాగ్భటుడు పుట్టుకతో హిందువే అయినప్పటికీ, జీవన ప్రస్థానంలో హిందూ ధర్మాన్నే అనుసరిస్తున్నప్పటికీ, తనయొక్క గ్రంథాలకు ముడు మాటగా చెబుతున్నప్పుడు బుద్ధుని స్మరించుకుంటాడు.

ఈయన అష్టాంగ సంగ్రహం భారతదేశ పర్యంతం చదువబడింది. ఈయన తన కాలంలో లభ్యమైన వైద్యగ్రంథాలన్నింటిని పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా చేసాడు. చరకుడు, సుశ్రుతుడు చెప్పినవాటిని చక్కగా పరిష్కరించాడు. ఈయన ఋతువులను అనుసరించి చేయాల్సిన దినచర్యల గురించి, ఋతుచర్యల గురించి వివరించాడు. వీటిని పాటించడంవల్ల ఆయుర్ వృద్ధి జరుగుతుందని ప్రయోగాత్మకంగా తెలిపేవాడయాన.

ఈయన రాసిన అష్టాంగ సంగ్రహంలో 6 అధ్యాయాలు, 150 విభాగాలున్నాయి. మొదటి అధ్యాయంలో శరీర నిర్మాణము, గర్భము ధరించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రసవ సమయములో పాటించవలసిన పద్ధతులు, మూడవ అధ్యాయంలో మధుమేహం, చర్మ వ్యాధుల నివారణలను గురించి, నాలుగవ అధ్యాయములో ఆయా వ్యాధులకు తగిన చికిత్సా పద్ధతులు, ఐదవ అధ్యాయంలో చిన్నపిల్లలకు వచ్చే రోగాలు, మూర్ఛలు, పిచ్చి గురించి, వాటి నివారణ పద్ధతులను గురించి వివరించబడింది.