Pages

Thursday, 8 January 2015

నామరామాయణం (బాలకాండము - తాత్పర్యము తో పాటుగా )


బాలకాండము-
శుద్ధబ్రహ్మపరాత్పర రామ | కాలాత్మకపరమేశ్వర రామ |
శేషతల్పసుఖనిద్రిత రామ | బ్రహ్మాద్యమరప్రార్థిత రామ |
చండకిరణకులమండన రామ | శ్రీమద్దశరథనందన రామ |
కౌసల్యాసుఖవర్ధన రామ | విశ్వామిత్రప్రియధన రామ |
ఘోరతాటకాఘాతుక రామ | మారీచాదినిపాతక రామ |
కౌశికమఖసంరక్షక రామ | శ్రీమదహల్యోద్ధారక రామ |
గౌతమమునిసంపూజిత రామ | సురమునివరగణసంస్తుత రామ |
నావికధావికమృదుపద రామ | మిథిలాపురజనమోహక రామ |
విదేహమానసరంజక రామ | త్ర్యంబకకార్ముకభంజక రామ |
సీతార్పితవరమాలిక రామ | కృతవైవాహికకౌతుక రామ |
భార్గవదర్పవినాశక రామ | శ్రీమదయోధ్యాపాలక రామ |
రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

బాల కాండ: తాత్పర్యము:
శ్రీరామా! - నీవు దైవ తత్త్వమైన పరబ్రహ్మవు , కాలానికి ఆత్మ యైన పరమేశ్వరుడవు, శేషతల్పముపై నిద్రించే వాడవు, బ్రహ్మ మొదలగు దేవతలచే ప్రార్ధించ బడిన వాడవు, సూర్య వంశ యశస్సును ఇనుమడింప చేసిన వాడవు, దశరథుని ప్రియ పుత్రుడవు, కౌసల్య సుఖాన్ని పెంపొందించిన వాడవు, విశ్వామిత్రునికి ఇష్టుడవు, తాటకిని సంహరించిన వాడవు మారీచుని పారద్రోలిన వాడవు, విశ్వామిత్రుని యాగాన్ని కాపాడి ఆయన గౌరవాన్ని నిలబెట్టిన వాడవు, అహల్యను ఉద్ధరించి తిరిగి రూపాన్ని ఇచ్చిన వాడవు, గౌతమ మునిచే పూజించ బడిన వాడవు, దేవతలచే, మునులచే వరములు పొందిన వాడవు నావికుని చే మృదువైన పాదములు కడుగ బడిన వాడవు, మిథిలాపుర జనులను సమ్మోహ పరచి, జనకుని మనసుని రంజిల్ల చేసిన వాడవు, శివుని విల్లు విరచి, సీతచే వరమాలను పొంది వివాహమాడిన వాడవు, పరశురాముని గర్వము నాశనము చేసినవాడవు, అయోధ్యను పాలించిన వాడవు. 


సీతారామునకు, రాజా రామునకు జయము జయము.