Pages

Wednesday, 7 January 2015

ఆది వైద్యులు -జీవకుడు


జీవకుడు మెదడు, నరాలకు సంబంధించిన వైద్యనిపుణుడు. బౌద్ధ గ్రంథాలలో ఈయన వైద్య విధానాన్ని గురించిన ప్రశంసలను చూడగలం. బింబిసారుని కాలానికి చెందిన జీవకుడు ఒక కుప్పతోట్టిలో కనిపించాడని, రాజుకు ఈ విషయం తెలిసి, ఆ పసికందును ఆస్థానానికి రప్పించి జీవకుడు అనే పేరు పెట్టాడని చారిత్రిక కథనం. పెరిగి పెద్దయిన జీవకుడు తక్షశిలలో వైద్యవిద్యను అభ్యసించాడు. ఏడేళ్ళ పాటు సాగిన ఆ విద్య ముగిసిన అనంతరం, అతనిని గురువు పిలిచి, తక్షశిలకు వలయాకారంలో ఎనిమిది మైళ్ళ పర్యంతంలో వైద్యానికి పనికిరాని మొలకను  తీసుకురమ్మానాడు. జీవకుడు గురువు చెప్పిన ప్రకారం, ఒక యోజన పర్యంతము తిరిగి, అటువంటి మొక్క కోసం వెదకి, వైద్యానికి పనికిరాని మొక్కను కనిపెట్టడం తన వల్ల కాదన్నాడు. అప్పుడు అతని అర్హత పట్ల సంతృప్తి చెందిన గురువు, అతనిని ఆయుర్వేద వైద్యం చేయడానికి అనుమతిని ఇచ్చాడు.

అనంతరం జీవకుడు నరాలకు సంబంధించిన వైద్యాన్ని చేసేందుకు సాకేతపురానికి చేరుకున్నాడు. వైద్యవృత్తి ద్వారా జీవకుడు బాగా ధనవంతుడయ్యాడు. అనంతరం ఒకానొక సమయంలో జీవకుడు బుద్ధునికి కూడా వైద్యాన్ని అందించాడు. ఒకప్పుడు బుద్ధుని కాలికి రాయితగలగా  గాయమైంది. అప్పుడు జీవకుడు కొన్ని మూలికలను గాయముపై పూసి, కట్టు కట్టాడట. ఆ కట్టు ఓ కాలపరిమితి తర్వాత విప్పి వేయాలి. కానీ, ఆ సమయంలో జీవకుడు వేరేపనిపై పొరుగూరుకెళ్ళాడు. అప్పుడు జీవకుడు బుద్ధునితో మానసిక తరంగాల ద్వారా సంప్రదించి, అక్కడనుంచే బుద్ధుని కాలికి కట్టివున్న కట్టును ఎలా విప్పదీయాలో చెప్పి, అలాగే చేయించాడని ప్రతీతి. అప్పట్నుంచి బుద్ధుడు, జీవకుని తన ప్రధాన శిష్యులలో ఒకరినిగా నియమించాడు. జీవకుడు కూడ బుద్ధునికి ఆరోగ్యపరమైన సలహాలను ఇస్తూ ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు.