Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం — 49 శ్రీ హనుమంతుని వేదాంతం కధ


                                                                   
                  
ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా !వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మ ను వేరు వేరు గా నే భావించాలి .దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి ,శరణా గతి పొందాలి .ఇతరులకు ఉపకారం చేస్తూ ,వారు కూడా భగవంతుని స్వరూపం గా భావించి ,సేవించాలి .ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు .ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం .జీవుడు వేరు ,పరమాత్మ వేరు అని భావిస్తూ ,భగవంతుని స్మరిస్తూ , ,భగవంతుని పూజలు చేస్తూ ,భగ వంతుని మూర్తులను చూసి ఆనందిస్తూఉండటానికి ద్వైతం అంటారు .జీవుడు ,పరమాత్మ ఒక్కరే .ఎందు లోను భేదం అనేది లేదు అని భావన లో ,ఆచరణ లో చూపించటం జ్ఞాన లేక ,విజ్ఞాన లక్షణం అంటారు .ఇదే అద్వైత భావన .–”దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః –ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్  ” –రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .
”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః –యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః –శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం –భోగశ్చ  ,మోక్షశ్చ ,కరస్త యేవ ”–అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు .ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కాని శ్రీ హనుమ సేవా తత్పరు లైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం ”అను గ్రహించాడు .దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు .నేను భద్రుడను .నీకూ నాకు భేదమే లేదు ”అని చెప్పాడు .
  చిటికెల భాగవతం
అయోధ్యలో ఉన్నంత కాలం శ్రీ రామునికి సర్వ సేవలు హనుమంతుడే చేశాడు .ఇది చూసి సీత ,లక్ష్మణుడు ,భరత శత్రుఘ్నులు చాలా బాధ పడు తున్నారు . వారికి రాముని సేవలు చేసే అవకాశమే రావటం లేదు .రాత్రి వేళల్లో సీతా దేవి చేయాల్సిన సేవలకు హనుమ అడ్డం వస్తున్నాడు .వీరంతా కలిసి ఆలోచించి ,ఒక ప్రణాళిక సిద్ధం చేసు కొన్నారు .అన్ని సపర్యలు తామే చేసే టట్లు హనుమ కు మాత్రం అతి చిన్నది అయిన ఒక పని అప్ప గించారు .అదే చిటికెల కార్య క్రమం .ఆ పని నైనా తనకు ఉంచి నందుకు పరమానంద పడ్డాడు మారుతి .అందరికి అంగీకార మైన పరిష్కారం లభించింది .
ఆ రోజు హనుమ శ్రీ రాముడిని తదేకం గా చూస్తూ కూర్చున్నాడు .పగలంతా గడిచి పోయింది .సీతా దేవి శ్రీ రాముని గది లోకి ప్రవేశించింది .హనుమ బయటకు వచ్చేశాడు .తలుపులు మూసేశారు దంపతులు .రాముడు ఎప్పుడు ఆవ లిస్తాడో తెలీదు అందుకని హనుమ విడువ కుండా ”చిటికెలు ”వేస్తూనే ఉన్నాడు .రాముడికి ఆవులింతలు వచ్చి, ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు .పధకం బెడిసి కొట్టింది .మళ్ళీ అంతా సమావేశ మై సేవలన్నీ ఆంజనేయుడే చేయాలి అని నిర్ణ యించారు .ఈ విషయాన్ని హనుమ కు తెలియ జేశారు .అప్పుడు చిటికెలు వేయటం మానేశాడు మారుతి .దానితో శ్రీ రాముడు నిద్రకు ఉపక్రమించాడు .ఇదీ చిటికెల భాగవతం .
సశేషం