Pages

Sunday, 8 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం –5 ( నీలుడి కధ)



 శ్రీ రామచంద్ర  ప్రభువు .  రావణ వధ తర్వాత ,లంకా రాజ్యానికి విభీషణుడు చేత  పట్టాభి షేకం చేయించాడు  . విభీషణుడు  ధర్మ బద్ధం గా రాజ్య పాలన  చేస్తునాడు  .విభీషణుడి కొడుకు పేరు నీలుడు .ఇతడు గుణము ,బలము ,విద్య లలో మేటి .ఒక సారి నీలుడు ,తండ్రి విభీషణుడి దగ్గరకు చేరి ,నమస్కరించి ఇలా అన్నాడు”తండ్రీ !మీ పరి పాలన లో ప్రజలంతా సుఖ ,సంతోషాల తో వర్ధిల్లుతున్నారు .వారికేమీ లోటు లేదు .మనకు  ధనం సంపదలకు కొదవు కూడా లేదు .అయినా మన రాజ్య మైన లంక లో ”చింతామణి ,కామధేనువు ,కల్ప వృక్షం ”లేని లోటు బాగా కన్పిస్తోందినాకు .మీరు ,శ్రీ రాముని పద సన్నిధిని చేరి ,లంకా  సామ్రాజ్యాన్ని దక్కించుకొన్నా ,వీటిపై మీ కు ద్రుష్టి లేదు .వాటినిమీరు ఎందుకు పొందలేక పోయారు ?నాకు ఆజ్ఞ  ఇస్తే వాటిని సాధించి ,తీసుకొని వచ్చి ,మన లంకలో ఉంచు  తాను”అన్నాడు వినయం గా . ..
నీలుని మాటలను విన్న తండ్రి విభీషణుడు ”కుమారా,నీలా !నేను శ్రీ రామ చంద్ర పాదాబ్జ మకరందాన్ని గ్రోలే తుమ్మెదను .ఆ రామ ప్రభువు దివ్యానుగ్రహం వల్ల అన్ని సుఖాలు ,ఆనందాలు ,భోగ ,భాగ్యాలు అనుభవిస్తున్నాను .బ్రహ్మానంద రసాను భూతిని అనుభవిస్తున్నాను .దేవతలకుకూడా   సాధ్యం కాని దీర్ఘాయుషువు   ,సామ్రాజ్యము నాకు శ్రీ రామ కృప వల్ల లభించాయి .శ్రీ రాముడే నా చింతామణి ,కామ ధేనువు ,కల్ప వృక్షం .అంత కంటే వేరే ఏమీ నాకు అక్కర లేదు .రాముని కరుణ వల్ల ,ఇంద్రాది అష్ట దిక్పాలకులు ,నా వశం లోనే వున్నారు .కనుక నాకు నువ్వు చెప్పిన ఆ మూడిటి అవసరం లేక పోయింది .అవి లంక లో లేవనే చింత వదిలెయ్యి .శ్రీ రామ పాద భక్తి తో ధన్యుడవు అయ్యే  ప్రయత్నం చెయ్యి ”అని అనునయం గా చెప్పాడు .
తండ్రి మాటలు ,నీలుడికి రుచించ లేదు .కీర్తి కాంక్ష తో తహ తహ లాడి పోతున్నాడు .మళ్ళీ తండ్రి తో వాటి అవసరాన్ని తెలియ జేశాడు .చివరికి విభీషణుడు మెత్త బడి ”నీ కోరిక ను కాదన లేక పోతున్నాను .వాటిని సాధించి ఇక్కడికి తీసుకొని రావ టానికి గురువు ఆజ్ఞ   చాలా ముఖ్యం .ముందు గా  మన కుల గురువు శుక్రా చార్యుల వారి  అనుగ్రహం సంపాదించి ,అప్పుడు ,ఆయన  అను మతి తో ప్రయత్నం చెయ్యి ”అని సలహా ఇచ్చి ,ఆశీర్వ దించి నీలుడిని పంపాడు .
తండ్రి అనుమతి తో సగం కార్యం తీరింది అని సంతోషించిన నీలుడు ,గురువు శుక్రా  చార్యుల వారిని ,చేరి,పూజించి ,నమస్కరించి ,చేతులు జోడించి ”గురు దేవా !మా తండ్రి విభీషణ మహా రాజు ఆనతి తో మిమ్మల్ని ఆశ్రయించ టానికి వచ్చాను .నాకు చింతామణి ,కల్ప వృక్షం ,కామ ధేనువు లను సాధించి ,లంకలో వాటిని ఉంచాలి అన్న కోరిక కలిగింది .దీనికి మీ అనుగ్రహం కావాలి .ప్రసాదించండి ‘అని వేడు కొన్నాడు .నీలుని భక్తి  తత్పరత,వినయం ఆచార్యులకునచ్చి ” కుమారా !ఈ రోజూ మృగశిరా నక్షత్రం .ఈ నక్షత్ర కాలము  లో కొత్త మంత్రోపదేశానికి మంచిది .దాన్ని జపిస్తే నీ కోరిక శీఘ్రం గా ఫలిస్తుంది.శ్రీ హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను .శ్రద్ధ తో జపించి నీ కోర్కెను సాధించుకో ”అని చెప్పి ,వెంటనే ”పంచ ముఖ ఆంజనేయ మంత్రం ”ఉపదేశించాడు .జగన్నాధ క్షేత్రం చేరి ,దీక్ష తో ,ఆ మంత్రాన్ని ,త్రికరణ  శుద్ధి గా ,జపించమని చెప్పాడు శుక్రా చార్య గురువరేన్యుడు .పంచముఖ ఆంజ నేయుడు ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పాడు

”పంచ వక్త్రం ,మహాభీమం ,కపి యూద సమన్వితం –బహుభిర్దశ భిర్యుక్తం ,సర్వ కామార్ధ సిద్ధిదం
పూర్వంతు ,వానర వక్త్రం ,కోటి సూర్య సమ ప్రభం-దంస్త్రా కరాల వదనం భ్రుకుటీ కుటి లేక్షణం . ”
”అస్త్వైవ దక్షిణ వక్త్రం ,నారసింహం ,మహాద్భుతం –అత్యుగ్ర తేజో వపుషం ,భీషణం ,భయ నాశనం ”
”పశ్చిమే ,గారుడ వక్త్రం ,వక్ర తుండం ,మహాబలం –సర్వ నాగ ప్రశమనం ,సర్వ భూతాది కృంతనం”
”ఉత్తరే సూకర వక్త్రం ,కృష్ణ దీప్త నభో మయం -పాతాలే సిద్ధ భేతాళ ,జ్వర రోగాది కృంతనం ”
ఊర్ధ్వం హయాననం ,ఘోరం ,దాన వాన్తకరం ,పరం -యేన వక్త్రేనా విప్రేంద్ర తాట కాయా ,మహా హవె ”


దీని భావం తెలుసు కొందాం .పంచముఖ ఆంజ నేయుడు సర్వ సిద్ధి ప్రదాత .తూర్పు ముఖం’ వానర ముఖం” .కోటి సూర్యుల కాంతితో ,భీకరమైన  కోరలతో ,భ్రుకుటి ముడిచి కని పిస్తుంది .దక్షిణ ముఖం ‘నార సింహ ముఖం ”మహాద్భుతం గా ,మృత్యువును తెచ్చే ఉగ్ర రూపం గా ,తేజో వంతం గావుంటుంది   భయ నాశనం చేస్తుంది .పశ్చిమ ముఖం ”గరుడిని ముఖం ”దీనికి వక్ర తుండం వుంటుంది .సర్పాల విషాన్ని నాశనం చేస్తుంది .సర్వ భూతా లను అదుపు లో ఉంచుతుంది .ఉత్తర ముఖం ”సూకర ముఖం ”.ఈ వరాహ ముఖం నల్లని కాంతి తోవుంటుంది .  ,భేతాళ ప్రయోగాల్ని ,జ్వరం మొదలైన రోగాల్ని నాశనం చేస్తుంది .పై ముఖం ”హయ ముఖం ‘.ఇది మోక్షాన్ని ఇస్తుంది .ఇలాంటి మహా మహిమాన్విత మైన అయిదు ముఖాలకు చెందిన ”బీజాక్షరాలు ”తో భక్తీ గా మంత్రాలను జపిస్తే ,కోరిన కోరిక తీరు తుంది .

గురువు అనుమతి తో నీలుడు ,బయల్దేరి ‘నీలా చల  క్షేత్రమైన పూరి ,జగన్నాధ క్షేత్రాన్ని” చేరాడు .అక్కడ ఒక మహా పర్వతం ,దానికింద పెద్ద అడవి వున్నాయి .ఆ పర్వతం మీదకు చేరి ,అక్కడి జలాశయం దగ్గరున్న కొండ బిలం లో ప్రవేశించి దీర్ఘ తపస్సు చేయటం ప్రారంభించాడు .ఎన్నో సంవత్స రాల తపస్సు ఫలితం గా కోటి సూర్య ప్రభలతో ,ముప్పది మూడు  కోట్ల అద్బుత గణం తో” సంజీవ రాయుడు” అయిన ఆంజనేయ స్వామి ,నీలుడికి ప్రత్యక్ష మైనాడు .శంఖ ధ్వని వంటి ధ్వనితో నీలున్ని పిలి చాడు .,వెంటనే మేల్కొన్న నీలుడు ,ఆయన పాదాల పై సభక్తికం గా వాలి పోయాడు కళ్ళ వెంట ఆనంద  బాష్పాలు ధారా పాఠం గా కారి పోతున్నాయి  నీలుడును  భుజం పట్టి పైకి లేపాడు హనుమ .నీలుడు అత్యంత భక్తి తో స్తోత్రం చేశాడు . దీన్నే ”నీల కృత ఆంజనేయ స్తోత్రం ”అని పేరు .చాలా మహి మాన్విత మైన స్తోత్రం .దానికి విపరీతం గా సంతోషించి హనుమ ”నీలా !నీ తపస్సు ,ధ్యానాలకు మెచ్చాను .నీ మనోభీష్టం నాకు తెలుసు .త్వర లో ఇంద్రుని జయిస్తావు .చింతామణి వగైరాలను పొందుతావు .దేవతా స్త్రీలలో అందమైనది ”వన సుందరి ”అనే స్త్రీ నీకు భార్య గా లభిస్తుంది .నువ్వు కోరక పోయినా ,బ్రహ్మ దేవుడే నీకు వరాలు అనుగ్రహిస్తాడు .లోకం లో ఎవరైనా సరే ,నీలాగ నా మంత్రాన్ని జపించి ,నా వ్రతాన్ని చేస్తే వారందరి కోరికలు నేను తక్షణమే తీరుస్తాను .నీ తండ్రి విభీషణుడు నాకు మంచి మిత్రుడు .ఆయనా ,మేము  శ్రీరాముని బంటులం .నా దక్షిణ భాగం లో నీకు సుస్తిర మైన స్తానం కల్పిస్తున్నాను .నువ్వు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం ఇక నుంచి ”పురుషోత్తమ క్షేత్రం ”అని పిలువ బడుతుంది .నీ కోరికలు న్యాయ బద్ధ మైనవే .త్వరలోనే అవి తీర గలవు ”అని వర దానం చేసి ,పరి వారం తో సహా అదృశ్య మైనాడు ఆంజ నేయుడు .
శ్రీ హనుమ దర్శనం తో తృప్తి చెంది ,ఆయన వరాలను అందుకొన్ననీలుడు ,అక్కడి నుంచి బయల్దేరి మళ్ళీ గురువు  శుక్రా చార్యుల సన్నిధి కి చేరాడు దానికి  ఆయన చాలా సంతోషించి,ఆశీర్వ దించి ,తండ్రి విభీషణుడు  వివరాలన్నీ తెలియ జేయ వలసినది గా చెప్పి పంపించే శాడు .లంకలో తండ్రి 
వివిభీషణుడు ని చేరి ,జరిగిన విధానం అంతా  పూస గుచ్చినట్లు తండ్రికి విన్నవించాడు .కుమారుని అద్భుత తపో వృత్తాంతం ,వర గ్రహణం విన్న విభీషణుడు ,పరమానందం పొందాడు .నలుడిని  ఆశీర్వదించి .అంతఃపురం చేరమని పంపాడు 
.నీలుడు చింతామణి మొదలైన వాటిని ఎలా పొందాడో తరువాతి కధ లో తెలుసు కొందాం .


నీలకృత హనుమత్ స్తోత్రము

ఓం జయ జయ ఆంజనేయ కేసరీ ప్రియనందన వాయుకుమార ఈశ్వరపుత్ర పార్వతి గర్భసంభూత వానరనాయక సకల వేదశాస్త్ర పారంగ సంజీవ పర్వతోత్పాటన లక్ష్మణ ప్రాణరక్షక, విభీషణ ప్రాణరక్షక గుహప్రాణదాయక సీతా దుఃఖ నివారన ధాన్యమాలీ శాప విమోచన దోర్దందీ బంధ విమోచన నీలమేఘ రాజ్యదాయక సుగ్రీవ రాజ్యదాయక భీమసేనాగ్రజ ధనంజయ ధ్వజావాహన కాలనేమి సంహార మైరావణ మర్దన వృత్రాసుర భంజన సప్తమంత్రిసుత ధ్వంసన ఇంద్రజిధ్వధ కారన అక్షయ కుమార సంహార లంకిణీ భంజన రావణమర్దన కుంభకర్ణవధపరాయణ జంబుమాలీ నిషూదన వాలినిబర్హణ రాక్షస కులదహన అశోకవన విదారణ లంకాదహన శతముఖవధకారణ సప్తసాగరసేతు బంధన వాల నిరాకర నిర్గుణ సగుణ స్వరూప హేమవర్ణ పీతాంబర ధర సువర్చలా ప్రాణనాయక త్రయస్త్రీం శత్కోట్యర్బుద రుద్రగణ పోషక భక్త పాలన చతుర కనకకుండరాభరణ రత్నకిరీటహారనూపురశోభిత శ్రీరామ భక్తితత్పర హేమరంభా వనవిహార వజ్రక్షతాంకిత మేఘవాహన నీలమేఘశ్యామ సూక్ష్మకాయ మహాకాయబాలసూర్యగ్రహన ఋష్యమూక గిరినివాస మేరు పీఠకార్బన ద్వాత్రింశదాయుధ ధర చిత్రవర్ణ విచిత్రసృష్టి నిర్మాణకర్తః అనంతనామన్ దశావతార అఘటనా ఘటనసమర్థ అనంతకోతి బ్రహ్మాండనాయక దుర్జన సంహార సజ్జన సంరక్షక దేవేంద్రవందిత సకల లోకారాధ్య సత్య సంకల్ప భక్త సంకల్పపూరక అతి సుకుమారఖ యక్షకర్దమ వినోదలేపన కోటిమన్మధాకార రణకేళీమర్దన విజృంభమాణ సకలలోక కుక్షింభర సప్తకోటి మహామంత్ర తత్వస్వరూప భూతప్రేతపిశాచ శాకినీ ఢాకినీ విధ్వంసన శివలింగ ప్రతిష్టాపన కారణ దుష్కర్మ విమోచన దౌర్భాగ్య నాశన జ్వరాది సకలరోగసంహార భుక్తిముక్తి ప్రదాయక కపటనాటక సూత్రధారిన్ లీలావినోద అగణేత కళ్యాణగుణ పరిపూర్ణ మంగళప్రద గానలోల గానప్రియ అష్టాంగయోగనిపుణ సకల విద్యాపారీణ ఆదిమ ధ్యాన్తరహిత యజ్ఞభోక్తః షణ్మత వైభవానుభూతి చతుర సకల లోకాతీత విశ్వంభర విశ్వమూర్తే విశ్వాకర దయాస్వరూప దాసజనహృదయకమల విహారణ మనోవేగిన్ మనోభావజ్ఞ నిపుణ ఋషి గణగేయ భక్తజన మనో రధ దాయక భక్తవత్సల దీన పోషక దీన మందార సర్వస్వతంత్ర శరణాగత రక్షక ఆర్తత్రాణ పరాయణ ఏకవీర అసహాయశూర వీరహనుమాన్ విజయీభవ దిగ్విజయీభవ.


సశేషం