Pages

Saturday, 18 April 2015

గజేంద్రమోక్షము - 10


క. విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు| విశ్వు నవిశ్వున్‌
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిన్‌ బరమపురుషు| నే సేవింతున్‌


తా!! ప్రపంచానికంతకూ తానే సృష్టికర్తయైయుండి దాను వెలుపలనుండువాడును, విశ్వాత్మరూపుడును, విశ్వమునకు దెలిసిన వాడునూ, బ్రహ్మకంటే గొప్పవాడైన ఈశ్వరుని పరమపురుషోత్తముని రక్షింపమని మనసారా సేవించెదను.

*******************************************************************************************  72

వ. అని పలికి తన మనంబున నగ్గజేంద్రుం డీశ్వర సన్నిధానంబు గల్పించుకొని యిట్లనియె


తా: యీ విధంబున విలపించుచు, గజేంద్రుడు తాను ఈశ్వర సన్నిధానమునందున్నట్లు భావించుకొని తన యెదుటెవరో ఉండినట్లు భావించుకొని యిట్లు ప్రార్థిస్తున్నాడు.

******************************************************************************************   73

శా. లావొక్కింతయులేదు. ధైర్యము విలో| లంబయ్యెబ్రాణంబులున్‌
ఠావుల్దప్పెను మూర్చవచ్చె దనువున్‌| డస్సెన్‌ శ్రమంబయ్యెడిన్‌|
నీవేతప్ప నితః పరంబెఱుగ మన్నింపన్‌దగున్‌ దీనునిన్‌
రావే యీశ్వర! కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా|


తా: ప్రభూ! పరమేశ్వరా! యింకపోరాడ లేకపోవుచున్నాను తండ్రీ! శక్తి సన్నగిల్లుతోంది. అధైర్యము ఆవహించుచున్నది. ధైర్యము కుదురుటలేదు. ప్రాణములు తమతమ స్థానాల్ని కోల్పోతున్నాయి. మూర్చవస్తోంది ప్రభూ! ఈ దేహము అలసిసొలసి అణగారి పోయింది తండ్రీ! యింక నీవేదప్ప యితరులు నన్ను కాపాడలేరు. ఈ మొసలితో బోరాడలేకున్నాను స్వామి! ఈ దీనుని తప్పులు మన్నించి నన్ను కాపాడవేగమే రావా పరమేశ్వరా! ఓ దివ్యశరీరా! దయితో నన్ను రక్షించు స్వామి!

******************************************************************************************   74

వి. వను దట జీవులమాటలు
జను దట చనరాని చోట్ల| శరణార్థులకో
యను దట పిలచినసర్వము
గను దట సందేహ మయ్యె| గరుణా వార్దీ


తా!! ఓ కరుణామూర్తీ! జగద్రక్షకా! నీవు ఆపన్నులను ఆదుకొందువని, జొరరాని స్థలమునకేగ గలవని, నిన్ను శరణన్నవారికి "యిదిగో నేను వస్తున్నానని" అభయమిచ్చెదవని వినియున్నాను. కాని ఎంతసేపటి నుండి వేడికొన్ననూ రాకపోవుట చే కొంచెం సందేహము కలుగుతున్నది స్వామి!.

*******************************************************************************************  75

ఉ. ఓ కమలాక్ష యో వరద| యో ప్రతిపక్షవిపక్ష యీశ్వరా
యో కవియోగివంద్య సుగుణోత్తమ యో శరణాగతామరా
నోకహ యో మునీశ్వర మనోహర యో విమల ప్రభావ
రావే! కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గావవే.


తా!! ఓ కమలముల వంటి కన్నులుగల కమలాక్షుడా! భక్తుల కోర్కెలు సత్వరమే దీర్చువాడా! శతృవులను కూడా ప్రేమించువాడా! ఈశ్వరా! మునుల చేతను, పండితులచేతను బొగడ బడినవాడా! సుగుణోత్తమా! శరణాగతరక్షకా! మునీశ్వరులకు మనోహరమైనవాడా! ఓ నిర్మలచరితా! త్వరగా వచ్చి నన్ను కాపుము తండ్రీ! నీ నామస్మరణే నా ధ్యేయముగా నుంటిని స్వామి! దయతో రక్షించుము ప్రభువా? కాపాడవయ్యా!

*******************************************************************************************  76

వ. అని పలికి మఱియు నరక్షిత రక్షకుండైన యీశ్వరుండా
పన్నుండైన నన్నుం గాచుగాకయని నింగి నిక్కిజూచుచు
నిట్టూర్పులు నిగిడింపుచు బయలాలకింపుచు
నగ్గజేంద్రుండు మొఱ సేయుచున్న సమయంబున


తా!! ఆ గజేండ్రుడిట్లు ప్రార్థించుచూ, అనాధులను ఆదుకొనే ఆపద్భాందవుడు నన్ను గూడ రక్షించుమని ఆకాశమును జూచి తోండమును జూచి సుదీర్ఘనిట్టూర్పులు విడుస్తూ చెవులురిక్కించి పరమేశ్వరుడేమైనా మొఱవినునేమోయని మొఱపెట్టుకొనుచున్న సమయంబున

*******************************************************************************************  77

ఆ. విశ్వమయత లేమి| వినియు నూఱక యుండి
రంబుజాసనాదు| లడ్డపడక
విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణండు
భక్తియుతన కడ్డ| పడ దలంచి


తా!! గజేంద్రుడిట్లు దీనాతిదీనముగా శ్రీహరిని ప్రార్థించుసమయమున బ్రహ్మాదిదేవతలందరూ వినియువిననట్లు శక్తిలేక, ఆతని ప్రార్థననాలకింపక శ్రీహరి కార్యము కావున మిన్నకుండిరి. అట్టి సమయంబున సర్వేశ్వరుండును, సర్వవ్యాప్తియును, సర్వోత్కుష్టుడునగు యా శ్రీమన్నారాయణుండు, భక్తగజేంద్రుని యాపదను దీర్పవలేనని తలంచి రక్షించుటకు ఉద్యుక్తుడాయెను.

*******************************************************************************************  78

పల మందార వనాంతరామృతసరః| ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంకర మావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి,
హ్వల నాగేంద్రము 'పాహి-పాహి' యన గుయ్యాలించి సంరంభి యై


తా!! అచట వైకుంఠపురము నందు, కల్ప వృక్షసమూహములతోనున్న అమృతసరోవర తీరము నందు గల రాజనగరిలో నున్న మణిమయి కాంతులీను భవనములో కలువపూలు పరచిన చంద్రకాంత పాంపుమీద శ్రీలక్ష్మీదేవితో గూడి విహరించుచున్న, ఆపన్న శరణాగత వత్సలుడైన యా శ్రీ మన్నారాయణుండు తన భక్తుడైన గజరాజు యొక్క మొరవిని కాపాడతలచినవాడై తత్తరపాటుతో తటాలున...

*******************************************************************************************  79

సిరికిం జెప్పడు శంఖుచక్రయుగముం| జేదోయి సంధింపడే
పరివారంబునుం జీరడభ్రగపతిం| బన్నింప డాకర్ణికాం
తరధమ్మిల్ల ము జక్కనొత్తుడు వివా| దప్రోద్థత శ్రీకుచో
పరిచేలాంచల మైన న్వీడడు గజ| ప్రాణావనోత్సాహియై


తా!! శ్రీ మన్నారాయణుండు గజేంద్రుని కాపాడే తొందరలో తన ప్రియసఖియైన లక్ష్మీదేవికి గూడా జెప్పక, శంఖ, చక్ర, గదాధి ఆయుధములను జేబట్టక, పరివారంబును బిలువక, తన వాహనమైన గరుడనిపై గూడ నధిరోహింపక, జాఱిన జుట్టును గమనింపక, వేడుకలో లక్ష్మీదేవి కొంగుతో ముడివేసిన యామె పైటకొంగును గూడా గమనింపక తొందరపాటుతో యీడ్చుచునే బయలుదేరెను.

*******************************************************************************************  80