Pages

Saturday, 18 April 2015

గజేంద్రమోక్షము - 5


సీ. తోయజగంధంబు| దోగిన చల్లని
మెల్లని గాడ్పుల| మేనులలర
కమలనాళాహార| విమలవా క్కల హంస
రవములు సెవుల పం| డువులు సేయ
పుల్లదిందీవ రాం| భోరు హామోదంబు
ఘ్రాణ రంద్రంబుల| గారవింప
నిర్మల కల్లోల| నిర్గ తాసారంబు
వదన గహ్వరముల| వాడుదీర్ప
ద్రిజగదభినవసౌభాగ్య| దీప్తమైన
విభవ మీక్షణములకును| విందు సేయ
నగిరి పంచేంద్రియ వ్యవ హారములను
మఱచి మత్తేభ యూథంబు| మడుగు సొచ్చె


తా!! ఆ కొలని యందలి తామర పువ్వుల సువాసనలతో గూడిన చల్లని పిల్లతెమ్మెరలకు దమతమమేనులు పులకరింప, తామర తూడుల నారగించిన కలహంసధ్వనులు చెవులనుర్రూతలూరింపగా, వికసించిన, నల్లకలువ, తామరపూవుల యొక్క పరిమళము నాఘ్రాణించుచు తేటనీటి అలలతుంపరలను గ్రోలుతూ ప్రకృతి సౌందర్యమును సంతరించుకున్న సలిల కొలనును దనివితీరగాంచుచు గ్రోలుచూ, యింకను దనివి తీరక, మత్తగజేంద్రములకింపైన పంచేంద్రియగుణములా కొలనియందే యుండుటవలననూ ఆ కొలనిని విడిచిపోలేక అందు ప్రవేశించెను.

*******************************************************************************************  28

క. తొండంబుల బూరించుచు
గండంబుల జల్లుకొనుచు| గళగళరవముల్‌
మెండుకొన వలుద కడుపులు
నిండ న్వేదండకోటి| నీరుంద్రావెనె.


తా: ఆ యేనుగులు తొండముల నిండా నీటిని బీల్చి తమ తమ చెక్కిళ్లయందు చల్లుకొనుచు, గలగలరావముల మిన్ను ముట్టగా దమ తమ పెద్దకడుపులను ఆ తీయని నీటితో నింపుతూ సుష్ఠిగా పానము చేయసాగాయి.

******************************************************************************************   29

వ. అప్పుడు


తా!! ఆ యేనుగులివ్విధంబున సంతోషాతిశయముతో కొలనియందు కేకరించు సమయంబున.

*******************************************************************************************  30

మ. ఇభలో కేంద్రుడు హస్తరంధ్రములనీ| రెక్కించి పూరించి చం
డభ మార్గంబునకెత్తె నిక్కి వడిను| డ్డాడించి పై జిందునా
రభటి న్నీరములోన బెల్లగసిన| క్రగ్రాహపాఠీనముల్‌
నభమం దాడెడు మీనకర్కటములన్‌| బట్టెన్‌ సురల్‌ మ్రాంపడన్‌


తా!! గజేంద్రుడు ప్రియమైన యా కొలనియందు క్రీడించుచూ, తొండము నిండ నీటిని బీల్చి కడుంగడు సంతోషాతిశయమున పైకెత్తి నీటిని పైకెగ జిమ్మ జొచ్చెను. ఆ వేగమునకు తొండము నందలి నీటినుండి, చేపలు, ఎండ్రకాయలు, చిన్న చిన్న మొసళ్ళు, నీటి జంతువులు భయపడి శతృవులకు భయపడినవారు తమ నాయకులను ఆశ్రయించున్నట్లు, ఆకాశమున సంచరించే గ్రహరాసుల మార్గమందుండు మీన, కర్కాటక రాసులను దేవతలందరూ నాశ్చర్యపడునట్లు చేరుకొనెను.

*******************************************************************************************  31

వ. మరియు నగ్గజేంద్రంబు నిరర్గళ విహారంబున


తా!! అడ్డూ అదుపూ లేని విహారంబులో మునిగి యున్న ఆ గజేంద్రుడు.

*******************************************************************************************  32

సీ. కరణీకరోజ్ఘిత| కంకణచ్చట దోగి
సెలయేటి నీలాద్రి| చెలువు దెగడు
హస్తినీహస్త వి| న్యంతపద్మంబుల
వేయిగన్నులవాని| వెరవు సూపు
గలభసముత్కీర్ణ| కళర రజమున
గనకాచలేంద్రంబు| ఘనత దాల్చు
గుంజరీ పరిచిత| కుముదకాండంబుల
ఫణిరాజమండన| ప్రభ వహించు

ఆ. మదకరేణు ముక్త| మౌక్తికశక్తుల
మెఱుగు మొగిలతోడ| మేలమాడు
నెదురులేని గరిమ| నిభరాజ మల్లంబు
వనజ గేహకేళి| వ్రాలునపుడు


తా!! ఎదురులేని గొప్ప తనముతో ఆ మేటి గజేంద్రుడు కొలనియందలి ఆడయేనుగులతో జలక్రీడలు సలుపుతున్నాడు. ఆడ ఏనుగులు నీటిని జల్లుటచే తడిసియున్నపుడు నదుల ంధ్య నూండే నున్నని నల్లని కాటిక కొండ మాదిరిగా వెలిగిపోతున్నాడు. తమ ప్రియురాండ్రు జల్లిన తామర పూరేకులు విడివిడిగా ఆ గజేంద్రుని శరీరమున కంటుకొని యుండుటచే వేయుకన్నులు గల మహేంద్రుని వలెను, ఆ తామరపువ్వుల పుప్పొడి యంటుకొని పసిడివర్ణపు మేరు పర్వతము వలెను, ప్రకాశించుచున్నాడు. తెల్లదామర తూడులు దనపై బడవేయుట వలన మెరుపులతో కుడిన కాంతివంత మబ్బువలెను మెరిసిపోతున్నాడు. (గజేంద్రుని గొప్పదనము సాటిచెప్పుటలో ఉత్ప్రేక్ష, అతిశయోక్త్యా లంకారములు వాడబడ్డాయి.)

*******************************************************************************************  33

వ. మఱియు నా సరోవరలక్ష్మి మత గజేంద్ర వివిధ విహార వ్యాకులిత
నూతనలక్ష్మీ విభవ వై యనంగ విద్యా నిరూఢపల్లవ ప్రబంధ
పరికంపిత శరీరాలంకార యగు కుసుమ కోమలియునుంబోలె
వ్యాకీర్ణ చికుర మత్తమధుకాకరనికరము విగతరవదన కమ
లయు నిజస్థాన చలిత కుచరథాంధ యుగళియు లంపటిత
జఘన పులినతలయునై యుండెనంత


తా!! అదియునుంగాక ఆ సరోవర సంపదంతయు మదించిన మత్తేభముల సురత క్రీడావినోదములచే చెఱుపబడినదై కొత్త కాంతిని సంతరించుకొనియున్నది. ఆ యేనుగులు కామోద్రేకముతో కామినిని రమించునపుడు యాడుదాని శరీర కాంతి తగ్గి తలవెంట్రుకలు చెదరగా, ప్రియుని గాఢాలింగనముచే శరీరములు అంటుకొనిపోయినదాయెను.

*******************************************************************************************  34

సీ. భుగభుగాయిత భూరి| బుద్బుదచ్ఛటలతో
గదలుచు దివికి భం| గంబు లెగయ
భువనభయంకర| పూత్కారరవమున
ఘోర నక్రగ్రాహ| కోటి బెగడ
వాలవిక్షేపదు| ర్వారజంఝానిల
వశమున ఘమఘమా| వర్త మడర
గల్లోలజాల సం| ఘట్టనంబుల దటీ
తరులుమూలంబులై ధరణి గూల

తే. సరసిలోనుండి పొడగని| సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి| హుంకరించి
భాను గంళించి పట్టు స్వ| ర్భానుపగిది
నొక్క మకరేంద్రు డిభరాజు| నొడిసిపట్టె


తా!! గజేంద్రుడట్లు తన ప్రియకాంతల గూడి తన్మయత్వ మోహపారవశ్యమున నున్న సమయమున ఆ అలజడికి ఆ కొలని యందలి నొక మకరేంద్రుడు అంతర్భాగము నుండి మిక్కిలి వేగముగాపైకి వచ్చాడు. ఆ వేగము వల్ల జనించిన గొప్ప యలలతో బుడగల సలిలధ్వనిని విని, యందలి నీటి జంతువులు భయపడి బెదురుచుండగా, తోకవిసురువలన పుట్టిన గొప్ప గాలి, ధ్వనులతో సుడులు ఏర్పడగా, ఆ కెరటాల తాకిడికి తీరమందున్న క్షీణవృక్షములు క్రూకటివ్రేళ్లతో గూలగా, తత్తరపాటుతో, భయముతో, ఱొప్పుతూ, రోజుతూ, ఊపిరి బిగపట్టి గజేంద్రమును జేరి, రాహువు, రవిని మ్రింగబోవునట్లు గజేంద్రుని కాలుని ఒడుపుగా పట్టుకొనిలాగబోయెను.

*******************************************************************************************  35

క. వడి దప్పించి కరీంద్రుడు
నిడుదకరంబెత్తి వ్రేయ| నీరాటంబుం
బొడవడగినట్లు జలముల
బడి కడువడి బట్టె బూర్వ పదయుగళంబున్‌


తా!! ఆ మకరేంద్రుడు గజేంద్రుని కాలు పట్టగానే, గజరాజు వదిలించుకొని తొండముబైకెత్తి మహోన్నతబలోపేతంగా మొసలిని ఒక్కదెబ్బ కొట్టాడు. మొసలి ఆ దెబ్బకు జచ్చినట్లు నీట మునిగి స్థానబలిమిచే మిక్కిలి వేగముతో గజరాజు ముందరి కాళ్లను రెంటిని పట్టుకొనెను.

*******************************************************************************************  36