Pages

Saturday, 18 April 2015

గజేంద్రమోక్షము - 7


మ. పొడగానం బడకుండ డాగు వెలికిన్‌ బోవగ దానడ్డమై,
పొడచూపున్‌ జరణంబుల బెనగొనన్‌ బోరాక రారాక బె,
గ్గడిలన్‌ గూలగ దాచు లేచుతఱి నుద్ఘాటించు లంఘించు బ,
ల్విడి జీరున్‌ దలగున్‌ మలంగు నొడియు| న్వేధించు గ్రోధించుచున్‌


తా!! మకరేంద్రుడు గజేంద్రునికి కనబడకుండ నీటిలో నక్కుచూ పోరాటము సల్పుచున్నాడు. యేనుగు గట్టెక్కబోవుసరికి వెంటనే వచ్చి గజెంద్రుని కదలనీయక కాళ్ళు పట్టుకుని లాగదొడంగెను. గజేంద్రుని మునుగునట్లు జేసి లేచినప్పుడు ఎదురుబడి దొంగదెబ్బ తీయుచు, గజేంద్రునికి దొరకక, నీటిలోనికి జారిపోవుచూ గజేంద్రుని పలువిధముల బాధింపసాగెను. గజేంద్రుని కాళ్లనొడిసిపట్టి నీట పడిపోయేటట్లు చేయుచుండెను.

*******************************************************************************************  47

వ. ఇట్లు విస్మితనక్రచక్రంబై నిర్వక్రవిక్రమంబుననల్పహృ
దయజ్ఞానదీపంబు నతిక్రమించుమహామాయాంధకారంబు
నుంబోలె నంతకంతకు నుత్సాహకలహసన్నాహబహువిధ
జలావగాహం బయిస గ్రాహంబుమహా సాహసంబున


తా: ఈ విధంబుగా జలజంతువులన్నియు ఆశ్చర్యపడునట్లు మొసలి మిక్కిలి శౌర్యపరాక్రమముతో అల్పునిజ్ఞానదీపమును జ్ఞాన మాయా తిమిరమావరించినట్లు స్థానబలిమి కలదియై కడునుత్సాహ సాహసములతో

******************************************************************************************   48

శా. పాదద్వంద్వమునేలమోపి పవనుం| బంధించి పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకు| న్మాఱాకు హత్తించి ని
ష్ఖేద బ్రహ్మపదావలంబనగతిన్‌| గ్రీడించుయోగీంద్రుమ
ర్యాదన్నక్రము విక్రమించె గరిపాదా| క్రాంతనిర్విక్రమై


తా!! మకరేంద్రుడు తన పాదములను ధర యందు బూంచి ఊపిరి బిగబట్టి పంచేంద్రియములను స్వాధీనములో నుంచుకొని, మిక్కిలి బుద్దిచాతుర్యముతో గజరాజు పాదములకడ్డుపడి, ఒడిసిపట్టుకొని యుండెను. అప్పుడది బ్రహ్మాంనందమయమైన బ్రహ్మపదము నొందగోరే యోగీంద్రునివలె ప్రకాశించుచుండెను.

*******************************************************************************************  49

క. వనగజంబు నెగుచు| వనచారి బొడగని
వనగజంబె కాన | వజ్రిగజము
వెల్ల నై సురేంద్రు | వేచి సుధాంధుల
పట్టు బట్టనీక| బయలు వ్రాకె.


తా!! ఇంద్ర గజమైన ఐరావతము యిదంతయీ గమనించి తన జాతివాడైన గజేంద్రునికెంత ముప్పు వాటిల్లిందని విచారించి, అయిష్టముగానే ఇంద్రుని దింపి వెర్రెత్తినదానివలె ఆకాశమున అటునిటు బరుగిడసాగెను అన్యాపదేశము.

*******************************************************************************************  50

ఉ. ఊహ కలంగి జీవనపు| టోలమునన్‌బడి పోరుచున్మహా
మోహలతానిబద్దపద| ము న్విడిపించుకొనంగ లేక సం
దేహము బొందు దేహిక్రియ| దీనదశన్‌ గజముండె భీషణ
-గ్రాహదురంత దంతపరి| ఘట్టితపాదఖురాగ్రశల్యమై.


తా!! మొసలి యొక్క వాడిదంతములచే బంధింపబడిన గజరాజు స్థంభము వంటి తన కాలి ఎముకలు కృశించిపోవుచుండగా నీటి అడుగున పోరుసల్పుచు దన గొప్ప అజ్ఞానతీగలచే కట్టబడిన తన కాలును విడిపించుకొనలేక సంసారతాపత్రయమున బుద్ధిస్థిరతను కోల్పోయి విచారించు ప్రాణివలె గజరాజు ధైన్యము చెందిన వాడై యుండెను.

*******************************************************************************************  51

వ. ఇవ్విధంబున


తా!! ఈ విధముగా

*******************************************************************************************  52

క. అలయక సొలయక వేసట
నొలయక కరి మకరితోడ| నుద్దండత రా
త్రులు సంధ్యలు దివసంబులు
సలిపెన్‌ బోరొక్క వేయి| సంవత్సరముల్‌


తా!! గజరాజు అలయక, సొలయక విసుగు జెందక మొసలితో వేయి సంవత్సరములు రాత్రింబవళ్ళు పోరు సలిపెను.

*******************************************************************************************  53

మ. పృథుశక్తిన్‌గజమాజలగ్రాహముతో| బెక్కేండ్లుపోరాడి సం
శిథిలంబై తనలావు వైరిబలమున్‌| జింతించి మిథ్యామనో
రథ మింకేటికి దీని గెల్వ సరి పో| రం జాలరాదంచు న
వ్యథమైయిట్లను బూర్వపుణ్యఫల ది| వ్యజ్ఞాన సంపత్తితోన్‌


తా!! గజరాజు మిక్కిలి బలముతో, సామర్త్యముతో, స్థైర్యముతో, కొన్ని సంవత్సరములు యుద్ధం జేసి అలసిపోయి స్థానబలిమి గొప్పదని యెంచి శత్రువు సామర్థ్యము నూహించుకుని, కృశించినదై అధైర్యమొంది మొసలితో సమానముగా బోరాడలేక, నిది పూర్వజన్మసుకృతమని తలంచి జ్ఞానము తెచ్చుకొన్నదై ఈ రీతిని తలబోయి జొచ్చెను.

*******************************************************************************************  54

శా. ఏ రూపంబున దీని గెల్తు నిటమీ దే వేల్పు జింతింతు నె
వ్వారిన్‌ జీరుదు నెవ్వ రడ్డమిక ని| వ్వారి ప్రచారోత్తమున్‌
వారింపందగువార లెవ్వ రఖిల| వ్యాపార పారాయణుల్‌
లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరా| లింపన్‌ బ్రపుణ్యాత్మకుల్‌


తా!! ఇకపై ఏ రూపంబున దీనిని గెలువగలను. ఎవరిని వేడికొనగలను. నన్ను రక్షించువారెవరు? నా మొర విని నన్ను కాపాడ గల్గిన వేల్పులెవరు? అట్టి పరోపకార పుణ్యాత్ములైన వారెవ్వరు? అట్టి వారిని కాపాడమని వేడికొనుటకంటే గత్యంతరమికలేదే? ఇపుడు నన్ను కాపాడగల వారెవ్వరు?

*******************************************************************************************  55

శా. నానానేకపయూథము ల్‌వనములో| నన్‌ బెద్దకాలంబు స
న్మానింపన్‌దశలక్షకోటికరిణీ| నాథుండనై యుండి మ
ద్దానాంభఃపరిపుష్టచందనలతాం| తచ్చాయలం దుండ లే
కీనీరాశ శిటేల వచ్చితి భయం| బెట్లోకదే ఈశ్వరా


తా!! అరణ్యమధ్యమున అనేక పదిలక్షలకోట్ల ఆడుయేనుగుల సమూహములచే సన్మానింపబడిన వాడనయ్యునూ, వాటి ఏలికనైయుండిన్నీ, మంచి సువాసనలు వెదజల్లు అందమైన పరిపుష్టి గల్గిన మంచి గంధపుతీగల సమూహ మధ్యమున సహజ ప్రకృతి సౌందర్యమందుండలేక మద గర్వముతో ఈ నీటియందేల జొరబడితిని. ఈ స్థితి యెట్లు తొలగునో గదా!

*******************************************************************************************  56