Pages

Sunday, 19 April 2015

శ్రీ మహాభారతంలో కథలు- వ్యాసమహర్షి జన్మ వృత్తాంతం


పరాశర మునీంద్రుడికి, సత్యవతికి జన్నించినవాడు వ్యాసుడు. సత్యవతి అసలు పేరు కాళి. మత్స్యగంధి అని కూడా అంటారు. బెస్త పిల్ల .

చేది దేశపు రాజు ఒకసారి వేటకని అడవికి వెళ్లాడు. అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. కాశిందీ నదీతీరాన జరిగిందిది. శాపవశాన చేపరూపాన ఆ నదిలో వున్న అద్రిక అనే దేవకన్య ఆ రేతస్సును స్వీకరించింది.చేప గర్భం ధరించింది. కడుపుతో వున్న చేప కదల్లేక మెదల్లేక బెస్త వాడి వలకు చిక్కింది.తీరా దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి కోస్తే ఆ చేప కడుపులో ఇద్దరు పసికందులున్నారు. ఆ ఇద్దరిలో మగ పిల్లవాణ్ణి బెస్త రాజుగారికే ఇచ్చేశాడు. ఆడ పిల్లను తానే అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.ఆ ఆమ్మయికి 'కాళి' అని పేరు పెట్టాడు.కాళి పెరిగి పెద్దదైంది. పెళ్ళీడు పిల్లైంది.

పరాశర మహర్షి ఒక రోజు కాళిందీ నది దగ్గరకు వచ్చి ఆవలి ఒడ్డుకు వెళ్ళేందుకు పడవకోసం చూస్తున్నాడు. ఆ సమయంలో కాళి తండ్రి నది ఒడ్డున అప్పుడే చద్ది మూట విప్పుకొని భోజనానికి కూర్చోవడం వల్ల మహర్షిని ఆవలి ఒడ్డుకు తీసుకెళ్ళమని కూతుర్ని పురమాయించాడు. మత్స్య గంధి సరేనంది. మహర్షి పడవలోకి ఎక్కాడు. పడవ నడుస్తోంది. ఎగిసిపడే అలలు,ఎగిరెగిరిపడే చేప పిల్లలు,పడవ నడిపే వయ్యారి - పరాశరుడికి చిత్తచాపల్యం కలిగించాయి.

కామోద్రేకంతో ఆమెను సమీపించాడు. ముని పుంగవుని కోరికను పసిగట్టి దూరంగా జరగింది కాళి. పరాశరుడు వినలేదు. పడవ చుట్టూ పొగమంచు సృష్టించాడు. కాళి శరీరం నుంచి కస్తురి పరిమళాలు గుప్పుమనేట్టు చేసాడు. నది మధ్యలో ఒక దీవిని సృష్టించాడు. ఇద్దరూ అక్కడికి వెళ్ళి అమర సుఖాలు అనుభవించారు. కాళి గర్భం ధరించింది. పరాశారుడు ఆమెను ఓదారుస్తూ," నీవు గర్భం ధరించినా నీ కన్యత్వానికేమీ దూషణ వుండదు. నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు అంశతో్ జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వవిద్యాపారంగతుడు అయి ముల్లోకాల్లోనూ కీర్తింపబడతాడు. జగద్గురువవుతాడు. ఏక రాశిగా వున్న వేదాలను విభాగం చేసి వాటికి సూత్రభాష్యాలు రచిస్తాడు. మహా తపస్వీ, మహా మహిమాన్వితుడూ అవుతాడు. ఇప్పుడు నీ ఒంటికి అబ్బిన కస్తూరి పరిమళం శాశ్వతమై నువ్వు 'యోజనగంధి' వి అవుతావు " అని దీవించాడు.

మహర్షి అన్నట్టుగానే కాళింది పండంటి పిల్లవాణ్ణి కన్నది. అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు. పెద్దల ఎడల వినయ విధేయతలతో మెలిగాడు. పెద్దయ్యాకా, " తల్లీ! నా గురంచి విచారించకు. తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను. నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా,కష్టం కలిగినా, లేదా చూడాలనిపించినా నన్ను తలచుకో. నేను నీ ముందుకు వచ్చి నిలుస్తాను " అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అతనే కృష్ణ ద్యైపాయనుడయ్యాడు. అతని తల్లే చంద్రవంశానికి చెందిన శంతనుడను మహారాజును పెళ్ళి చేసుకుంది. ఆ విధంగా కురుపాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు. ఇరువర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. పరిపాలనా సంబంధమైన విషయాలలో కురుపాండవులు కృష్ణ ద్వైపాయనుడి సలహాలు తేసుకునేవారు. అయితే ఆయన హస్తినాపురంలో కన్నా అడవులలో తపస్సు చేసుకుంటూ వున్న కాలమే చాలా ఎక్కువ.