Pages

Monday, 20 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- సుందోపసుందులు


హిరణ్యకశివుని వంశంలో నికుంభుడనే రాజుగారికి ఇద్దరు పిల్లలు కలిగారు. వారే సుందోపసుందులు, అల్లరిలో ఒకరికొకరు తీసిపోరు. రాజుగారి పిల్లలవడం చేత మరీ గారాబంగా పెరిగారు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా వుండేవాళ్ళంటే ఏ క్షణంలోనూ, ఏ విషయంలోనూ వారు ఒకరినొకరు విడిచి వుండేవారు కాదు.

వారికి చిన్నప్పుడే ప్రపంచమంతా జయించాలన్న కోరిక కలిగింది. కాని అది కుదరదే! త్రిలోకాల్లో దేవతలు, మునులు, చక్రవర్తులు, యోధులు, యెందరో వుంటారు. వాళ్ళందర్నీ ఓడించడానికి కేవలం భుజబలం వుంటే సరిపోదు. దైవబలం కూడా వుండాలి. అందుకని నార వస్త్రాలు కట్టి జటాజూటాలతో వింధ్యపర్వతం మీద తపస్సు చేశారు.

తలను నేలకు వుంచి, చేతులు గాలిలో నిలిపి అతి కఠోరంగా తపస్సు చేసారు.

ఆ తపస్సు నుంచి పుట్టిన వేడికి దేవతలు భయపడ్డారు. ఎన్నో విఘ్నాలు కలిగించారు. ఎన్నో విధాల నచ్చ చెప్పారు. అయినా సుందోపసుందులు చలించలేదు.

ప్రకృతే వారి తపోదీక్షకు స్తంభించిపోయింది.

వింధ్యపర్వతాలు కదిలాయి.

లోకాలన్నీ ఉక్కిరి బిక్కిరయ్యాయి.

దేవతలు అల్లాడారు. వాళ్ళంతా బ్రహ్మ వద్దకు పరుగెత్తి, "మహానుభావా! రక్షించండి. సుందోపసుందుల తపస్సును ఆపి పుణ్యం కట్టుకోండి" అని ప్రార్ధించారు. వెంటనే సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై "నాయనా! మీ తపస్సుకు మెచ్చాను. మీ కోరికలేమిటో చెప్పండి" అని అడిగాడు.

సాష్టాంగపడ్డారు ఇద్దరూ.

" స్వామీ! ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ క్షణాన్నయినా వెళ్ళగలిగే కాలగమన విద్యనూ, ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం పొందగలిగే కామరూప విద్యనూ, వాటికితోడుగా సకల మాయా ప్రదర్సన శక్తినీ అనుగ్రహించండి. ఎవరి వల్లా మాకు చావు లేకుండా అమరత్వాన్ని కూడా ప్రసాదించండి" అని వేడుకున్నారు.

" ఏమిటీ అమరత్వమా! అది కుదరదు. అయితే ఎవరి వల్లా మీకు చావు రాదు. మీ వల్ల మీరే మరణిస్తారు. ఇక తపస్సు ఆపి ఇళ్ళకు వెళ్లండి" అన్నాడు బ్రహ్మ.

'మా చేతిలో మేము చావటమా-అది జరిగే పని కాదు, అనుకొని వారు సంతోషంతో దండయాత్రలు ప్రారంభించారు. మునుపే రాజుగారి పిల్లలవటం చేత వచ్చిన అతిశయం, ఇప్పుడు కొత్తగా తోడైన బ్రహ్మదేవుని వరాలు-ఇక అడ్డా ఆపా?

ప్రజలు, రాజులు, బ్రహ్మర్షులు వారి ధాటికి తట్టుకోలేకపోయారు. జపతపాలు ఆగిపోయాయి. మజ్ఞయాగాలు నిలిచి పోయాయి. మునుల ఆశ్రమాల మీదకి తోడేళ్ళలా, సింహాల్లా, కామరూపాలలొ విరిచుకుపడేవారు. ప్రపంచమే సుందోపసుందుల ఆగడాలకు అల్లకల్లోలమైంది.

వారి హింసాకండను భరించలేక దేవ గంధర్వ సిద్ధ గణాలు బ్రహ్మను మళ్ళీ ప్రార్ధించాయి.

అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిపించి, " నీ ప్రతిభనంతా వుపయోగించి ఒక అతిలోక సౌందర్యరాశిని సృష్టించాలి" అన్నాడు.

ఆయన తన శక్తినంతా వినియోగించి ఒక సౌందర్యరాశిని సృష్టించాడు. బ్రహ్మ ఆమెకు ప్రాణం పోశాడు. ఆ అందాలభామే తిలో్త్తమ. ఆమె అందానికీ, శరీర లావణ్యానికీ అందరూ అబ్బురపడ్డారు.

బ్రహ్మ ఆ అమ్మాయిని దగ్గరకు పిలిచి, " నువ్వే ఈ ఆపదను తొలగించాలి.నీ మూలంగా సుందోపసుందుల మధ్య విరోధం రావాలి. ఆ కోపంలో ఇద్దరూ ఒకరి నొకరు చంపుకోవాలి. ఎలా ఈ పని జరుపుకొస్తావో నీ ఇష్టం. వాళ్ళిద్దరికీ అన్ని మాయలూ తెలుసు. అంతకు మించిన మాయలు చూపాలి నీవు" అన్నాడు. తిలోత్తమ బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించింది.

వెళ్ళి సుందోపసుందుల దృష్టి పడేలా సంచరించింది.

ఆవిడ్ని చూస్తూనే ఆనందపరవశులయ్యారిద్దరూ.

"ఈమె నా ప్రాణం " అని అన్నగారంటే, "ఈ అతిలోక సౌందర్యవతి నా భార్య. తమ్ముడి భార్య నీకు మరదలవుతుంది. దూరంగా ఉండు" అని ఉపసందుడన్నాడు. కుడిచేతిని ఒకరు పట్టుకుంటే ఆవిడ ఎడమ చేతిని మరొకరు పట్టుకున్నారు.

అంతే-

అంతవరకూ పరస్పర వాత్సల్యంతో వున్న ఆ అన్నదమ్ములుద్దరూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆమె తనకు దక్కాలంటే తనకు దక్కాలని ఘోరంగా పోట్లాడుకున్నారు.

చివరికి ఒకరికొకరు పొడుచుకుని రక్తం కక్కుతూ నేలకూలారు. అది విని ముల్లోకాలూ పండుగ చేసుకున్నాయి.

అన్నదమ్ముల మధ్య కలహానికి మోహం కారణమవుతుందని చెబుతూ నారదమహర్షి ధర్మరాజుకి కధ చెప్పాడు.

అన్నదమ్ములయిదుగురికీ ద్రౌపదీ దేవి భార్య గనుక ఎటువంటి క్లేశం రాకుండా అన్యోన్యానురాగంతో మెలగండని పాండవులకు హితవు చెబుతూ దేవముని యీ కధ చెప్పాడు.