Pages

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- యయాతి


యయాతి మహారాజు పాండవుల పూర్వీకుల్లో ఒకడు. పరాజయం ఎరుగని పరాక్రమశాలి. శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని పెళ్ళి చేసుకున్నాడు. తరువాత వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ పట్ల కూడా మోహం కలిగి దేవయానికి చెప్పకుండా రహస్యంగా పెళ్ళి చేసుకున్నాడు. దేవయానికి ఇది తెలిసింది. తన తండ్రితో మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడికి పట్టరాని కోపం వచ్చింది. " నీకు తక్షణమే ముసలితనం వాటిల్లుగాక" అని యయాతికి శాపం ఇచ్చాడు. నడివయస్సులో అకస్మాత్తుగా ముసలితనం రావడంతో యయాతి మహారాజు గత్యంతరం లేక మామగారి పాదాలపై పడ్డాడు. శుక్రాచార్యుడు జాలిపడ్డాడు. " రాజా! నా శాపాన్ని మళ్ళించలేను. అయితే ఎవరైనా సమ్మతించేవారుంటే వారికి నీ మసలితనం ఇచ్చి వారి పడుచుతనం నీవు తీసుకో" అని ఉపాయం చెప్పాడు శుక్రాచార్యుడు. యయాతికి ఐదుగురు కొడుకులు ఉన్నారు. అందరూ అందమైన వాళ్ళు. క్షత్రియోచితమైన విద్యలో ఆరితేరినవాళ్ళు. యయాతి వాళ్ళను పిలిచి " నాయనలారా! చూశారా నా అవస్థ! మీ తాతగారిచ్చిన శాపం వల్ల నాకు అకాల వార్థక్యం దాపురించింది. మీలో ఎవరైనా సరే నా ముసలితనం తీసుకుని మీ యవ్వనం నాకు బదులిస్తే మరికొంత కాలం నేను పడుచుదనం అనుభవించవచ్చు. జీవిత భోగాలు తృప్తితీరా అనుభవిస్తాను. ఎవరైతే నా ముసలితనం స్వీకరిస్తారో వారికి నా రాజ్యం ఇస్తాను" అన్నాడు. పెద్ద కుమారుదు నావల్ల కాదన్నాడు.

రెండవ కమారిణ్ణి అడిగితే, "నాన్నగారూ! బలాన్నీ, రూపాన్నే కాకుండా తెలివిని కూడా నాశనంచేసే వృద్ధాప్యాన్ని పుచ్చుకోమంటున్నారు. అంతటి నిబ్బరం నాకు లేదు. క్షమించండి" అని మర్యాదగా తప్పుకున్నాడు.

మూడవవాడు నిష్కర్షగా ముందే చేతులు అడ్డుగా తిప్పాడు.

రాజుగారికి చాలా కోపం వచ్చింది. నాలుగవ వాణ్ణి పిలిపించారు. "నాన్నగారూ! నన్ను మన్నించండి. ముసలితనమంటే అసహ్యం నాకు. వార్ధక్యంలో శరీరం ముడతలు పడి , చూపు ఆనక, మాట వినపడక స్వతంత్రం కోల్పోయి దుఃఖ పడాలి. మీ కోసం నేనంత కష్టాన్ని భరించలేను" అని స్పష్టంగా చెప్పాడు.

ఇలా నలుగురు కొడుకులు తన కోరిక కాదనేటప్పటికి యయాతి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు. ఎంతోసేపు విచారించాడు. చివరకు తన మాటకు ఎన్నడూ ఎదురుచెప్పని కడగొట్టు కుమారుణ్ణి పిలిపించాడు.

"నాయనా! ఇక నీవే నన్ను కాపాడాలి. ఈ ముసలితనం , ఈ ముడతలు, ఈ తడబాటు, ఈ నెరసిన వెంట్రుకలు - ఇవన్నీ శుక్రాచార్యులవారి శాపం వల్ల నాకు అకాలంగా వచ్చి పడ్డాయి. ఈ దుస్థితిని నేను భరించలేకుండా వున్నాను. కొంతకాలం నా ముదుమిని నీవు పుచ్చుకుని నీ యవ్వనం నాకిచ్చావంటే సర్వసుఖాలూ అనుభవిస్తాను" అని దీపంగా అర్ధించాడు.

యయాతి కడగొట్టు పిల్లవాడి పేరే పూరుడు. అతనికి తండ్రి యెడల జాలి కలిగింది. " నాన్నగారూ! మీ కోరిక ప్రకారం మీ వార్ధక్యాన్నీ, రాజ్యభారాన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తాను. మీరేమీ దిగులు పెట్టుకోకండి" అన్నాడు.

యయాతికి పట్టరాని ఆనందం కలిగింది. కుమారుణ్ణి కౌగిలించుకుని అభినందించాడు.

అలా పూరుడి యవ్వనాన్ని యయాతి తీసుకున్నాడు. తండ్రి మసలితనం పూరుడు స్వీకరించి , రాజ్యభారం వహించి చాలాకాలం జనరంజకంగా పాలనచేశాడు. గొప్ప కీర్తి పొందాడు. యయాతి కుమారుడిచ్చి న యవ్వనంలో సర్వసుఖాలు అనుభవించాడు కానీ తృప్తి కలుగలేదు. అప్పుడు పూరుడి దగ్గరకు వెళ్ళి "నాయనా! కుమారా! కోరికలు ఎన్నటికీ తీరవు. విషయానభవం వల్ల కాంక్షలు ఇంకా వృద్ధి పొందుతాయేగాని అణగవు. కామినీ కాంచనాలూ, పాడిపంటలూ మనిషి కోరికలను ఎన్నటికీ తృప్తి పరచలేదు. ఈ సంగతి క్రమేపీ తెలిసొచ్చింది నాకు. ఇష్టాయుష్టాలకు అతీతమైన ప్రశాంతస్థితిని పొందాలని వుంది. ఇక నీ యవ్వనం నీవు తీసుకుని చల్లగా రాజ్యం పాలిస్తూ వర్థిల్లు నాయనా" అని అశీర్వదించాడు.

యయాతి తన ముసలితనం తాను తీసుకుని అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేసి , చివరకు స్వర్గం చేరుకున్నాడు.