Pages

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- గరుత్మంతుడి గర్వభంగం

ఇంద్రుడి సారథి అయిన మాతలికి ఒక కూమార్తె ఉంది. పేరు గుణకేశి. యుక్త వయస్సు వచ్చాకా ఆ పిల్లకు తండ్రి పెళ్ళి చేద్దామనుకున్నాడు. కాని ఆమెకు తగిన వరుడు ఎక్కడా దొరకలేదు. చివరికి మాతలి నాగలోకానికి వెళ్ళి సుముఖుడికి తన కూతుర్ని చేసుకోవాలని ఆర్యకుని అర్థించాడు. ఆర్యకుని మనుమడు సుముఖుడు. సుముఖుడి తండ్రి చిరకారి.

"నాయనా! చిరకుణ్ణి కొద్దిరోజుల క్రితమే గరుత్మంతుడు చంపి భక్షించాడు. మరో నెలరోజుల్లో సుముఖుణ్ణి కూడా హతమారుస్తానని చెప్పి వెళ్ళాడు. చెప్పింది చేసి తీరుతాడు వాడు. చావు మూడినవాడికి నీ కుమార్తెనిచ్చి పెళ్ళి చేయడమెందుకు?" అన్నాడు ఆర్యకుడు. అది విని మాతలి బాధపడ్డాడు.

"అయ్యా! సుముఖుణ్ణి నాతో పంపండి. నేను అతణ్ణి ఇంద్రుడి దగ్గరకు తీసుకుపోతాను. ఆనక గరుత్మంతుని వలన ప్రమాదం రాకుండా ఉపాయం ఆలోచిస్తాను" అన్నాడు.

ఆర్యకుడు అంగీకరించాడు.

సుముఖుణ్ణి వెంటపెట్టుకుని మాతలి మొదట ఇంద్రుణ్ణి , ఆ తరువాత విష్ణుమూర్తినీ సందర్శించి సంగతంతా విన్నవించాడు. విష్ణుమూర్తి ఆజ్ఞమేరకు ఇంద్రుడు సుముఖుడికి పూర్ణాయుర్దాయం ప్రసాదించాడు.

గరుత్మంతుడికీ విషయం తెలిసింది.

అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.

ఇంద్రుడి దగ్గరకు వచ్చి "సురేశ్వరా! త్రిలోకాధిపత్యం నీకే వుందని విర్రవీగుతున్నట్టున్నావు. నీ తల్లీ , నా తల్లీ ఒకే తండ్రి బిడ్డలన్న సంగతి మర్చిపోకు.ఇద్దరూ దక్షప్రజాపతి కుమార్తెలే. నీ తండ్రి నా తండ్రి కశ్యపుడే. నీకెంత బలం వుందో నాకూ అంతకుమించి ఉంది. నిత్యం విష్ణుమూర్తిని వీపుమీద ఎక్కించుకుని మోస్తున్నాను. అలాంటిది నువ్వో లెక్కా!" అన్నాడు గర్వంగా.

ఈ విషయం విష్ణుమూర్తికి తెలిసింది. ఆయన గరుత్మంతుణ్ణి పిలిచి చిన్నగా నవ్వి "గరుత్మంతా! తెలివితేటల్లో ఒకరి తలదన్నేవారు మరొకరుంటారు. నేనే బలాఢ్యుడనని ఎవరూ గర్వించకూదదు. నీవు నన్ను మోస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నావు. నిజానికి నన్ను ఎవరూ మోయలేరు. నన్ను నేను మాత్రమే మోయగలను. నీ బలమేమిటో తెలుస్తుంది - నా కుడిచేతిని ఒకసారి మోయి" అంటూ విష్ణుమూర్తి తన దక్షిణహస్తాన్ని గరుత్మంతుడి మూపుపై మోపాడు. గరుడుడు ఆ బరువు మోయలేక కుప్పకూలాడు. కొనవూపిరితో కొట్టుకుంటూ తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణుమూర్తి దయతలచి లేవనెత్తి, "ఇక మీదటెప్పుడూ అనవసరపు డాంబికాలకు పోకు" అని బుద్ధి చెప్పి పంపాడు. ఆ తరువాత మాతలి తన కుమార్తె గుణకేశిని సుముఖుడికిచ్చి పెళ్ళి చేసాడు.

"గరుత్మంతునిలా నీవూ గర్వాంధుడవై పాండవులతో విరోధం తెచ్చుకుని నవ్వులపాలు కావద్దని " కణ్వ మహర్షి దుర్యోధనుడికీ కథ చెప్పాడు. కానీ సుయోధనుడు మహర్షి మాట వినలేదు. అవివేకికి జ్ఞానుల మాటలు అంత తేలికగా తలకెక్కవు.

ప్రతిఫలాపేక్ష లేకుండా హితవు చెప్పేవాడు దొరకడం కష్టం. చెప్పిన హితవచనాలు శ్రద్ధగా విని ఆచరించేవాడు లభ్యం కావడం అంతకంటే దుర్లభం. హితవు త్రోసిపుచ్చక స్వీకరించేవాడూ, ఆచరించేవాడు ఎన్నడూ కష్టాలకు లోనుకాడు.