Pages

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు ---ఉదంకుడు

కురు పాండవ యుద్ధం ముగిశాక ద్వారకకు బయలుదేరాడు కృష్ణుడు.

రథం బయలుదేరింది. కొంచెంసేపట్లో ఉదంకుడి ఆశ్రమాన్ని సమీపించింది. కృష్ణుడు అక్కడ దిగి ఉదంక మహామునికి వినయంగా నమస్కరించి ఆయన ప్రక్కనే దర్భాసనం మీద కూర్చున్నాడు.

"మాధవా! పాండవ కౌరవుల యుద్ధం చక్కబెట్టి వచ్చావా? అనుకున్న పని నెరవేరింది గదా! అయినా నువ్వు తలచుకుంటే కానిదేముందిలే!" అన్నాడు ఉదంకుడు ఎత్తిపొడుపుగా.

"నయానా భయానా చెప్పాను. బ్రతిమాలాను. కానీ, ఆ దుర్యోధనుడు నా మాట వింటేనా? భీష్మ ద్రోణులు కూడా ఎంతో చెప్పారు. ఊహూ! అతగాడికి చెవికెక్కితేనా! గర్వంతో, లోభంతో కళ్ళుమూసుకుపోయి యుద్ధం చేశాడు. బంధుమిత్ర పరివార సమేతంగా మరణించాడు. విధిని ఎవరు దాటగలరు?" అన్నాడు కృష్ణుడు.

ఉదంకుడు కోపం ఆపుకోలేకపోయాడు. "నువ్వు వట్టి మోసగాడవు! చేతనై ఉండి కూడా సంధి చెయ్యకుండా నిష్కారణంగా కౌరవకులాన్ని నాశనం చేశావు. నీకు శాపమిస్తాను" అన్నాడు.

"అయ్యా! నువ్వు మహర్షివి. తొందరపాటు తగదు. కోపం కూడదు. నన్ను శపిస్తే నువ్విన్నాళ్ళనుంచీ సమకూర్చుకున్న తపస్సంపదా, బ్రహ్మచర్యం వృథాగా నశించిపోతాయి. ముందు నేను చెప్పేది విను. తరువాత నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి" అన్నాడు కృష్ణుడు. ఉదంకుడు అంగీకరించాడు.

"ఓ తపస్వీ! బ్రహ్మస్వరూపం ధరించి అన్ని లోకాలనూ నేనే సృష్టిస్తాను. విష్ణురూపం ధరించి రక్షిస్తాను. శివస్వరూపం ధరించి సంహరిస్తాను. ధర్మం నశించి అధర్మం ప్రబలినప్పుడు అవతరించి, దుర్మార్గులను నాశనం చేసి ధర్మస్థాపనం చేస్తాను. అలాంటివాడినై వుండి కూడా అధర్మపరులై కౌరవులను ధర్మపరులైన పాండవులతో కలపాలని చూశాను. ఫలితం లేకపోయింది. కౌరవులు తమ దుర్మార్గం వల్ల ధర్మయుద్ధంలో పాండవుల చేతుల్లో మరణించారు. ఇందులో నువ్వు నన్ను శపించవలసిందేముంది?" అని ప్రశ్నించాడు కృష్ణుడు.

తల వంచుకున్నాడు ఉదంకుడు. "మహాత్మా! నా అనుగ్రహం, తొందరపాటు నీ అమృత వాక్కులు వినడం వల్ల పోయాయి. ప్రభూ! నీ దయకు నేను పాత్రుడనైతే, అనుపమానమైన నీ స్వరూపం నాకు చూపించవా? నా చూపులు సార్థకం చెయ్యవా?" అని నమస్కరించి ప్రార్థించాడు.

కృష్ణుడు ఆ ప్రార్థన ఆలకించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆశ్చర్యంతో చలించిపోయాడు ఉదంకుడు. "బహు పాదాలు, బహు శిరస్సులు, బహు గర్భాలు, బహు భుజాలు, సర్వం నువ్వే అయి కనిపిస్తున్నావు. భయమేస్తోంది. ప్రభూ! ఈ రూపం ఉపసంహరించి ఎప్పటిలా సౌమ్యాకారం ధరించి కనిపించు!" అని అర్థించాడు ఉదంకుడు.

"ఉకందా! నీకేం వరం కావాలో కోరుకో" అన్నాడు వాసుదేవుడు.

"దేవా, ఇది మరుభూమి. ఇక్కడ నీళ్ళు దొరకవు. నాకు నిరంతరం జలం లభించేట్టు అనుగ్రహించు".

"అలాగే! నన్ను తలచుకోగానే జలం లభిస్తుంది నీకు!" అని వాసుదేవుడు ఉదంకుడికి వరమిచ్చాడు.

ఆ తరువాత ఒకసారి ఉదంకుడికి దాహం వేసింది. కృష్ణుడ్ని తలచుకున్నాడు. వెంటనే భుజాన తోలుసంచితో నల్లటి మనిషొకడు ప్రత్యక్షమయ్యాడు. అతడిచుట్టూ వేటకుక్కలున్నాయి. దిగంబరుడు. చేతిలో విల్లూ, బాణాలు ఉన్నాయి.

"ఉదంకా! ఈ నీళ్ళు తాగి నీ దాహం తీర్చుకో" అన్నాడతను.

"చీ! ఆ నీళ్ళు నా కక్కరలేదు" అన్నాడు ఉదంకుడు అసహ్యించుకుంటూ.

"చూడు! నువ్వు దాహంతో బాధపడుతూంటే, నీమీద దయతో వచ్చాను. కాదనకుండా తాగు!" అన్నాడు దిగంబరుడు.

"నువ్వు నాకేం సలహా చెప్పనక్కర్లేదు. దయచెయ్యి" అన్నాడు ఉదంకుడు.

వెంటనే ఆ దిగంబరుడు కక్కతోసహా అంతర్థానమయ్యాడు. ఇంతలో కృష్ణుడక్కడికి రానే వచ్చాడు. "మాధవా! మా మంచి వరం ఇచ్చావులే! ఎంత దాహమైనా నిషాదుడిచ్చిన నీళ్ళు నేను తాగుతానా?" అని నిష్ఠూరంగా అడిగాడు ఉదంకుడు.

"అయ్యో! నీ కోసం నేనుపడ్డ శ్రమంతా వృథా అయింది. నేను ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి నీకోసం అమృతం ఇమ్మని అడిగాను. మానవులకు అమృతమెందుకు, ఇంకోటేదైనా అడగమన్నాడు. నేను ససేమిరా కాదన్నాను. 'నా మీద ఉన్న ప్రేమతోనైనా ఉదంక మహామునికి అమృతం ఇవ్వాలి ' అని ప్రార్థించాను. 'సరే అయితే! నేను మారురూపంలో వెళ్ళి అతనికి అమృతం ఇస్తాను. అతను కనుక సిగ్గుపడో, అసహ్యించుకునో ఆ అమృతం తాగకపోతే మాత్రం నేను దానికి బాధ్యుడ్ని కాను ' అన్నాడు ఇంద్రుడు. నేను సరేనన్నాను. అతడి రూపానికి రోసి నువ్వు ఆ అమృతాన్ని తిరస్కరిచావు. పోనీలే! ఏం చేస్తాం! నేనిచ్చిన వరం వృథా కాకుండా చేస్తాను. నీకు నీరు కావలసివచ్చినప్పుడు మేఘాలు ఈ మరుభూమిలో వచ్చి వర్షిస్తాయి. అవి ఉదంక మేఘాలనే పేరుతో ఇక్కడే సంచరిస్తూ మానవాళికి ఉదకం ప్రసాదిస్తూ నీ కీర్తిని చాటుతూ ఉంటాయి" అని పలికి కృష్ణభగవానుడు అంతర్హితుడయ్యాడు. ఇప్పటికీ ఆ ఉదంక మేఘాలు ఒక్కొక్క పుణ్యతిథిలో ఆ మరుభూముల్లో వర్షిస్తుంటాయి.