Pages

Monday, 20 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- కచుడు - దేవయాని


దేవతలకు గురువు బృహస్పతి . వేదమంత్రాలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి.

రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. జ్ఞానమంతా ఆయన కాచి వడపోశాడు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళందర్నీ శుక్రాచార్యుడు ' మృత సంజీవని ' విద్య వల్ల మళ్ళీ బ్రతికించేవాడు. దానితో మరణించిన రాక్షసులందరూ లేచి కూర్చుని దేవతలతో మళ్ళీ యుద్ధానికి దిగేవారు.

ఇలా లాభం లేదనుకుని దేవతలంతా బృహస్పతి కుమారుడైన కచుడి దగ్గరకు వెళ్ళారు.

" నాయనా! నీవు మెల్లగా శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి ఆయన అనుగ్రహం సంపాదించాలి. ఎలాగైనా సరే ఆయన వద్ద ఉన్న మృత సంజీవనీ విద్యను నేర్చుకుని రావాలి" అని బ్రతిమాలారు.

కచుడు సరేనన్నాడు.

వెంటనే శుక్రాచార్యుని ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళి, " మహాత్మా! నేను అంగీరస మహర్షి మనుమణ్ణి. బృహస్పతి కుమారుణ్ణి. నా పేరు కచుడు . మీ వద్ద శుశ్రూష చేసి విద్య నేర్చుకుందామని వచ్చాను" అన్నాడు.

శుక్రాచార్యుల వారికి కచుడి వినయ విధేయతలు నచ్చాయి. వెంటనే శిష్యుడిగా స్వీకరించారు.

అలా శుక్రుడి అనుగ్రహంతో కచుడు ఆశ్రమంలో ఉంటూ, విద్యాభ్యాసంతో పాటు, గురువుగారి కమార్తె దేవయాని చెప్పిన అన్ని పనులూ చేస్తూ ఆమెను ఆటపాటలతో సంతోష పెడుతూ కాలం గడుపుతున్నాడు.

మృత సంజీవనీ విద్య కోసం కచుడు తమ గురువుగారి వద్ద శిష్యుడుగా చేరాడని రాక్షసులు గ్రహించారు. ఒకనాడు కచుడు అడవిలో గురువుగారి ఆవులను మేపుతూ వుండగా అతణ్ణి పట్టుకుని చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కలకూ, నక్కలకూ వేశారు.

ఎంతసేపటికీ కచుడు ఆశ్రమానికి తిరిగి రాకపోయేసరికి దేవయాని కంగారుపడింది. తండ్రి దగ్గరకు వెళ్ళి," నాన్నగారూ చీకటి పడింది. ఆవులు ఇంటికి వచ్చాయి. కాని, ఇంతవరకూ కచుడు రాలేదు. అతనికేదో ఆపద వచ్చి వుంటుంది. అతన్ని మీరే రక్షించాలి" అంది.

శుక్రాచార్యులవారు మంత్రం జపించి," నాయనా కచా! ఎక్కడికి వెళ్ళావు? వెంటనే ఆశ్రమానికి రా!" అని గట్టిగా పిలిచారు. మంత్రప్రభావంతో కచుడు జంతువుల కడుపులు చీల్చుకుని ఎప్పటిలాగా వచ్చి గురువుగారి ఎదుట నిలబడ్డాడు.

" ఏమయింది?" అని అడిగింది దేవయాని.

" ఆవుల్ని తోలుకు వస్తుంటే రాక్షసులు నా చుట్టూ చేరి ' ఎవరు నువ్వు? ' అని అడిగారు. ' బృహస్పతి కమారుణ్ణి ' అని చెప్పాను. వెంటనే నా మీద పడి నన్ను చంపారు" అని చెప్పాడు కచుడు.

ఇంకోసారి, దేవయాని కోసం పూలు తీసుకుని రావడానికి కచుడు అడవికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ రాక్షసులు అతడ్ని పట్టుకున్నారు. అతన్ని కొట్టి, చంపి శరీరాన్ని పొడి చేసి సముద్రంలో కలిపారు.

కచుడు ఎంతకూ ఇంటికి రాకపోయే సరికి మళ్ళీ దేవయాని తండ్రితో మొరపెట్టుకుంది. మునిపటి లాగే ఆచార్యూలవారు సంజీవనిని ప్రయోగించారు. దాంతో బతికి బయట పడ్డాడు కచుడు.

ఇక లాభం లేదనుకుని ఈసారి రాక్షసులు కచుని శరీరాన్ని కాల్చి, బూడిద చేసి మద్యంలో కలిపి అది తమ గురువుకే తాగమని ఇచ్చారు. ఆ మద్యం శుక్రాచార్యుడు సేవించాడు.

మేతకు వెళ్ళిన ఆవులు తమ దారిన తాము తిరిగి వచ్చాయి. కాని కచుడు రాలేదు. దేవయాని తండ్రిని సమీపించి కంటతడి పెట్టింది.

" అమ్మా! ఇప్పటికి రెండుసార్ల్లు కచుణ్ణి బతికించాను. ఎన్నిసార్ల్లు బతికించినా రాక్షసులు అతనిని హతమార్చాలని పట్టు పట్టినట్లుంది. అయినా ఎవరో మరణిస్తే నువ్వు ఏడవటం ఏమిటి? కాలం ఖర్మం మూడితే ఎవరైనా చావక తప్పదు" అని ఆచార్యుడు కూతుర్ని ఓదార్చాడు.

అయినా సరే, కూతురు మంకు పాట్టు విడువలేదు. కచుడు వచ్చేవరకూ అన్నపానాలు ముట్టనంది. శుక్రాచార్యులవారు గత్యంతరం లేక సంజీవనీ మంత్రం జపించి కచుడ్ని రమ్మని పిలిచాడు. మంత్రబలం వల్ల కచుడికి ప్రాణం వచ్చింది.

" గురుదేవా! అనుగ్రహించండి. నేను తమరి పొట్టలోనే వున్నాను" అన్నాడు. శుక్రాచార్యుల వారికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు గర్భస్ధ శిష్యుడు జరిగిన కధంతా గురువుగారికి విన్నవించాడు.

మహానుభావుడూ, మహాతపశ్శాలి అయిన శుక్రాచార్యుడు తన తప్పు తెలుసుకున్నాడు. సురాపానం మూలంగా తను మోసపోయినట్టు గ్రహించాడు. " ఎంతటి దారుణానికైనా ఒడిగట్టించే ఈ మద్యపానాన్ని నేటినుంచి నిషేధిస్తున్నాను. ఎవరైతే జ్ఞానం లేకుండా మద్యపానం చేస్తారో వారి నుంచి ధర్మం తప్పుకుంటుంది. వాళ్ళను అందరూ అసహ్యించుకుంటారు. ఈసడిస్తారు. ఇది నా ఆజ్ఞ . దీనిని ప్రజలందరూ పాటించాలి. పాటించని వాళ్ళు పతనమౌతారు" అన్నారు శుక్రాచార్యులవారు.

" నాయనా! దేవయాని కోసం నేను నిన్ను బతికించాలి. నిన్ను బతికిస్తే నాకు మరణం తప్పదు. ఇందుకు ఒకటే మార్గం. నేను నీకు ఇప్పుడే సంజీవనీ విద్య ఉపదేశిస్తాను. నీవు అది నేర్చుకున్న తరువాత నా పొట్ట చీల్చుకుని బయటకు రా. తిరిగి నీ విద్య వల్ల నన్ను బతికించు" అన్నాడు.

కచుడు సరే అన్నాడు. చెప్పినట్లే చేశాడు.

తరువాత చాలా కాలం అక్కడే విద్యాభ్యాసం చేసి గురువుగారి వద్ద సెలవు తీసుకుని దేవలోకానికి బయల్దేరి వెళ్ళాడు.