Pages

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- గురువు లేని విద్య

.
ధర్మరాజు, ఆయన తమ్ములు వనవాసం చేస్తున్నప్పుడు లోమశుడు అనే మహర్షి వాళ్లని చూడడానికి వచ్చాడు. కుశలప్రశ్నలు అయిన తరువాత లోమశుడు, "ధర్మరాజా! మీరు తీర్థయాత్రలు చెయ్యండి. మనసు కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేసుకుంటూ అక్కడి స్థల విశేషాలు తెలుసుకుంటూ కాలక్షేపం చెయ్యండి. కాలం ఇట్టే గడిచిపోతుంది" అని సలహా ఇచ్చాడు.

తరువాత పాండవులు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళారు.

అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి గంగానది ఒడ్డున రైభ్యుడనే ఋషి ఆశ్రమం కనిపించింది. ఆ పక్కనే వున్నది భరద్వాజుని ఆశ్రమం.

భరద్వాజుడు, రైభ్యుడు మంచి స్నేహితులు. ఇద్దరు బాగా చదువుకున్నారు. నదీతీరాన పక్కపక్కనే ఆశ్రమాలు ఏర్పరుచుకొని నివసిస్తుండేవారు. రైభ్యుడికి ఇద్దరు కొడుకులు - పరావసు, అర్వావసు.

వాళ్ళిద్దరూ కూడా చక్కగా వేదం చదువుకొని గొప్ప పండితులుగా పేరుపొందారు.

భరద్వాజుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు యవక్రీతుడు. యవక్రీతుడికి రైభ్యుడన్నా, ఆయన కొడుకులన్నా గిట్టేది కాదు.

పరావసు, అర్వావసులను చూసి యవక్రీతుడు అసూయపడేవాడు. వాళ్ళకన్నా తను గొప్పవాడు కావాలని ఇంద్రుడ్ని గూర్చి తపస్సు చేశాడు. నిప్పుతో ఒళ్ళంతా మండించుకున్నాడు. ఇంద్రుడికి జాలి కలిగింది. భూలోకానికి వచ్చి, 'ఎందుకు నాయనా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు?' అని అడిగాడు. 'ఎవరూ చదవని వేదవిద్యలన్నీ నాకు రావాలి. నేను గొప్ప పండితుణ్ణి కావాలి. దానికోసం నేనీ కఠోర తపం చేస్తున్నాను. గురువుగారి దగ్గరకు పోవడం, కొన్నాళ్ళు అయనకు సేవ చేయటం అవేవి నాకు కుదరవు. అవేవీ లేకుండా విద్యలన్నీ క్షణాలమీద పొందటానికి ఈ తపస్సు చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి" అని యవక్రీతుడు వేడుకున్నాడు.

అది విని ఇంద్రుడు నవ్వాడు. "పిచ్చివాడా! నీ తెలివి అపమార్గాన పట్టింది. తక్షణమే వెళ్ళి గురువును ఆశ్రయించు. ఆయన వద్ద శుశ్రూష చేసి వేదవిద్యలన్నీ నేర్చుకో. గురువువద్ద విద్య నేర్చుకుంటేనే ఎవరికైనా చదువు అబ్బుతుంది. అది లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు" అని చెప్పాడు.

కాని యవక్రీతుడికి ఆయన మాటలు నచ్చలేదు. ఇంకా ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రుడు మళ్ళీ వచ్చి, "నాయనా! మూర్ఖంగా ఏ పనీ చెయ్యకూడదు. నీ తండ్రిగారికి వేదాలు తెలుసు. ఆయన నీకు నేర్పుతారు. వెళ్ళి వేదవిద్యలన్నీ నేర్చుకో. ఇలా ఒళ్ళు కాల్చుకోవటం మానుకో" అని చెప్పాడు.

యవక్రీతుడికి కోపం వచ్చి, "నేను కోరిన వరం కనుక మీరు ఇవ్వకపోతే నా శరీరంలోని అవయవాలన్నిటినీ విరిచి ఈ అగ్నిగుండంలో పడేస్తాను" అన్నాడు.

అలా వుండగా ఒకనాడు యవక్రీతుడు గంగానదిలో స్నానం చెయ్యడానికి వెళ్ళాడు. అక్కడ ఓ ముసలి బ్రాహ్మణుడు నది ఒడ్డున కూర్చొని పిడికెడు పిడికెడు ఇసుక తీసి నదిలోకి విసురుతున్నాడు. అది చూసి యవక్రీతుడు "ఏం చేస్తున్నావు తాతా?" అని అడిగాడు.

"గంగానది దాటడానికి వంతెన కడుతున్నా" అన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు.

అది విని యవక్రీతుడు పెద్దగా నవ్వాడు. "వేగంగా పోయే ప్రవాహానికి ఇలా ఇసుకతో అడ్డంగా కట్ట వేయడం కుదరని పని. వేరే మార్గం చూడు" అని సలహా ఇచ్చాడు.

"గురువులేకుండానే, అసలు చదవకుండానే, కష్టపడకుండానే విద్య రవాలని కొందరు ఎలా తపస్సు చేస్తున్నారో అలాగే నేనూ గంగానదికి ఇసుకతో వంతెన కడుతున్నా" అని ముసలి బ్రాహ్మణుడు బదులు చెప్పాడు.

అప్పుడు అర్థమైంది ఆ ముసలి బ్రాహ్మణుడు ఎవరో యవక్రీతుడికి! వెంటనే కాళ్ళమీద పడ్డాడు.

ఇంద్రుడు నవ్వుతూ యవక్రీతుణ్ణి దగ్గరకు తీసుకొని, "నీ తండ్రి దగ్గర వేదవిద్యలు నేర్చుకో. అనతికాలంలోనే నువ్వు గొప్ప విద్వాంసుడివి అవుతావు" అని ఆశీర్వదించాడు.