Pages

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- తపతి


లోకాలన్నింటికీ వెలుగునిచ్చే సూర్యభగవానుడు విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను పెళ్ళి చేసుకున్నాడు. వారికి కాళింది, యముడు అని ఇద్దరు పిల్లలు కలిగారు. రాను రానూ సూర్యుడితో కలిసి బతకటం సంజ్ఞకు కష్టమైంది. ఆయన తేజస్సును ఆమె భరించలేకపోయింది. భర్తకు సేవలు చేసే బాధ్యతను తన పరిచారిక చాయకు అప్పగించి ఆమె తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్ళింది.

సంజ్ఞ రూపంలో చాయ సూర్యుడికి చాలాకాలం సేవలు చేసింది. ఆమెకు సూర్యుడి వల్ల శనీశ్వరుడు, తపతి కలిగారు.

తపతి అందాల బొమ్మ, సుగుణాల ప్రోగు. ఆమెకు యుక్త వయస్సు వచ్చేసరికి మరింత అందంగా తయారైంది. సూర్యుడు కుమార్తెకు పెళ్ళిచేయాలని నిశ్చయించుకున్నాడు. తగిన వరుడికోసం అన్వేషిస్తున్నాడు.

ఒకరోజు సంవరణుడు తపతిని చూసాడు. ఆ సంవరణుడు చంద్రవంశ రాజు ఋక్షుని కుమారుడు. పర్వత ప్రాంతాలలో పగలంతా వేటకై తిరిగి తిరిగి అలసిపోయి సంవరణుడు కమలాలు, కలహారాలతో నిండిన ఒక సరస్సును చేరుకున్నాడు. అక్కడ దేవకన్యలు ఆటపాటల్లో మునిగి వున్నారు. వారందరిలో తపతి మొగలిరేకుల మధ్య మెరుపుతీగలా వుంది. సంవరణుడు శిలాప్రతిమలా తపతినే చూస్తూ నిలబడిపోయాడు. చూసినకొద్దీ ఆమెపట్ల అతనికి అనురాగం అధిగమయింది. ఆమె దగ్గరకు వెళ్ళి "సుందరీ! నిన్ను చూసిన క్షణంలోనే నేను నీకు దాసుడినయ్యాను. నన్ను కనికరించు" అని బతిమాలాడు. అతను అలా అంటూవుండగానే తపతి మాయమైంది. ఆమె కూడా మన్మథాకారుడైన సంవరుణుని మోహించింది. అతన్ని చూసిన క్షణం నుంచి ఆమెకూ మనసు స్వాధీనంలో లేకుండాపోయింది.

రాజధాని ప్రతిష్ఠానగరానికి వెళ్ళిన సంవరణునికి నిద్రాహారాలు లేవు. ప్రజల మంచిచెడ్డలు పట్టించుకోవడం పూర్తిగా మానేసాడు. తపతి తప్ప మరో ధ్యాస లేదు. ఈ విషయం ఋక్షుని కులగురువైన వశిష్ట మహామునికి తెలిసింది.

సూర్యపుత్రి తపతి కోసం అతను తపిస్తున్నాడని మహాముని గ్రహించాడు. "నీ మనోరథం నెరవేరుస్తాను. దిగులు మానుకో" అని సంవరణుడికి చెప్పి వశిష్టుడు యోగబలంతో ఆదిత్య మండలానికి వెళ్ళి వేదమంత్రాలతో సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు.

భాస్కరుడు మహర్షిని సాదరంగా ఆహ్వానించి ఆతిద్యం యిచ్చి "మునివర్యా! మీ రాకకు కారణం ఏమిటి?" అని అడిగాడు.

"ఋక్షుడి కుమారుడు సంవరణుడు నీ కుమార్తె తపతిని చేపట్టాలనుకుంటున్నాడు. అతడు నిర్మల యశస్యుడు. ప్రజారంజకంగా పాలన చేస్తున్నావాడు. పెద్దలు, గురువుల ఎడ విశేష గౌరవం కలిగినవాడు. వేదాలను శ్రద్ధగా నేర్చుకున్నాడు. అన్నిటికీ మించి నాకు ప్రియాతి ప్రియమైన శిష్యుడు. అతనికి నీ కుమార్తెను ఇమ్మని అడగడానికి వచ్చాను" అన్నాడు వశిష్ఠ మహర్షి .

సూర్యుడు సంతోషంతో సమ్మతించి తన కుమార్తె తపతిని వశిష్టుడి వెంట సంవరణుడి దగ్గరకు పంపాడు. ప్రతిష్ఠానపురంలో వారిద్దరి వివాహం వశిష్టుడి ఆధ్వర్యంలో అతి వైభవంగా జరిగింది.

సంవరణుడు తపతిని పెళ్ళి చేసుకున్నాక రాజ్యపాలనంతా మంత్రులకు అప్పగించి నదీపర్వత ప్రాంతాలలో భార్యతో ఇష్టభోగాలు అనుభవిస్తున్నాడు. అలా పన్నెండేళ్ళు గడిచాయి. రాజు యజ్ఞ యాగాది ప్రజాహిత క్రతువులు చయ్యకుండా విషయలోలుడై వున్నందున అతని రాజ్యంలో అనావృష్టి ప్రబలింది. తిండి, బట్ట కరువై ప్రజలు దేశాంతరం వెళ్ళవలసిన దుస్థితి కలిగింది.

అప్పుడు వశిష్టుడు సంవరణుని సతీసమేతంగా నగరానికి తీసుకువచ్చి పుణ్యస్నానాలు చేయించి శాంతి క్రతువులు నిర్వహింప చేశాడు. ఇంద్రుడు సంతోషించి వర్షం కురిపించాడు. దేశం మళ్ళీ సుభిక్షమైంది. సంవరణుడు అప్పటినుంచి యజ్ఞయాగాది కర్మలు చేస్తూ చాలాకాలం చక్కగా పరిపాలన చేసాడు. ఆ దంపతులకు కురు వంశానికి మూలపురుషుడైన 'కురువు' జన్మించాడు.

భూమ్యాకాశాలకు తన ప్రచండ కిరణాలతో తాపం కలుగచేసే సూర్యభగవానుడి కుమార్తె కావడం వలన కురువు తల్లికి తపతి అని పేరు వచ్చింది. తపతి వంశోద్ధారకులు కాబట్టి కురుసంతానాన్ని 'తాపత్యులు ' అని కుడా అంటారు.

వింధ్య పర్వతాలకు పశ్చిమంగా ప్రవహించి ప్రజల పాపాలు పోగొట్టమని భాస్కరుడు తన కుమార్తెను దీవించాడట. తండ్రి ఆశీస్సును అనుసరించి తపతీదేవి నదీమతల్లిగా మారి నర్మదానదిలో లీనమై ప్రవహిస్తోంది.

గంగానదీ తీరాన అర్జునుడితో చెలిమి చేసిన చిత్రరథుడు అనే గంధర్వుడు పార్థుణ్ణి 'తాపత్యా' అని సంబోధిస్తాడు. కిరీటి కోరిక మేరకు తన పిలుపు వెనుక గల తపతి వృత్తాంతాన్ని వివరిస్తాడు.

చిత్రరథుడి అసలుపేరు అంగారపర్ణుడు. అడవులలో రేయింబవళ్ళు ప్రయాణం చేస్తూ ఒక అర్థరాత్రి వేళ గంగానదిని సమీపించిన పాండవుల అడుగుల చప్పుడు విని సఖులతో క్రీడిస్తున్న అంగారపర్ణుడు కోపోద్రిక్తుడై కయ్యానికి కాలుదువ్వాడు. అర్జునుడు అతన్ని విరథుడ్ని చేసి నేలమీదకు లాగి దండించాడు. అంగారపర్ణుడు కుప్పకూలాడు. అతని భార్య కుంభీనసి వచ్చి పతిభిక్ష పెట్టమని ధర్మరాజుకు ప్రణమిల్లింది. అన్న చెప్పిన మీదట విజయుడు గంధర్వుని విడిచి పెట్టాడు. కృతజ్ఞతాసూచకంగా అంగారపర్ణుడు 'చాక్షుసి' అనే గంధర్వ విద్యను నవ్యసాచికి బోధించాడు. అర్జునుడి ఆగ్నేయాస్త్ర ప్రభావంతో దగ్ధమైన తన రథానికి మారుగా 'చిత్రరథం' అనే మరో రథాన్ని సృష్టించుకున్నాడు గనుక ఆనాటినుంచి అంగారపర్ణుడు చిత్రరథుడయ్యాడు.