Pages

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- ఋష్యశృంగుడు


పూర్వం ఒకప్పుడు అంగదేశంలో తీవ్రమైన కరువు కాటకాలొచ్చాయి. " ఈ కష్ట కాలంలో కరువుల బాధ నుండి ప్రజలను ఎలా కాపాడడం?" అని ఆ దేశపు రాజు రోమపాదుడు పురోహితులతో చర్చించాడు.

"ఇంత వరకు స్త్రీని చూడకుండా సంపూర్ణ బ్రహ్మచర్యం అవలంబిస్తూ ఉన్న ఋష్యశృంగుణ్ణి రాజధానికి పిలిపించండి. మహా తపశ్శాలి అయిన ఆ మహానుభావుడు మన నగరంలో కాలు మోపగానే వానలు కురుస్తాయి" అన్నారు పురోహితులు.

విభాండక మహాముని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు చిన్నతనం నుంచీ ఒక్క తన తండ్రిని తప్ప మరొక మనిషిని చూడలేదు. స్త్రీలు, పురుషులు పేరిట సృష్టిలో ఒక విభజన ఉన్నదని కూడా తెలీదు. ఆ విధంగా శుద్ధ బ్రహ్మచారిగా పెరిగాడు.

విభాండక మహాముని ఆశ్రమం నుంచి ఋష్యశృంగుడ్ని ఏ విధంగా రప్పించాలనేది రోమపాదుడికి సమస్య అయింది. మంత్రులతో ఆలోచన చేసిన పిమ్మట రాజనగరంలో ఉన్న సుందరాంగుల్ని కొందరిని పిలిపించి, " మీరు విభాండక ముని ఆశ్రమానికి పోయి ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ఋషి కుమారుణ్ణి ఏదో ఒక విధంగా మన రాజధానికి తీసుకురావాలి" అని ఆజ్ఞాపించాడు. సరే అని ఆ కాంతలు ముని ఆశ్రమానికి బయల్దేరి వెళ్ళారు. వారు వెళ్ళిన సమయానికి విభాండక ముని ఆశ్రమంలో లేడు. ఇదే మంచి అవకాశమని వారందరిలోకీ అద్భుత సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక విలాసవతి ఆశ్రమంలో వున్న ఋషి కమారుడి దగ్గరకు వెళ్ళింది. " మునివరా! క్షేమమా? మీకు కావలసిన కందమూలాలు లభ్యమవుతున్నాయా? మీ తపస్సు నిరాఘాటంగా కొనసాగుతోందా? వేదాధ్యయనం సక్రమంగా కొనసాగుతోందా? తండ్రిగారు ఎలా ఉన్నారు?" అని ప్రశ్నలు వేసింది.

అటువంటి సుందరాకారంలో ఉన్న మనిషిని గాని, అటువంటి మధురస్వరం కాని పాపం ఋష్యశృంగుడు అంతకుమునుపు కనలేదు, వినలేదు. మెరుపులా మెరిసిన ఆ సుందరిని చూడగానే ఋషి కుమారుడి మనస్సులో కలవరం మొదలైంది. అతనికి స్త్రీ పురుష భేదం తెలీదు కనుక ఆ వచ్చింది మునికుమారుడే అనుకున్నాడు. ఆర్ఝ్యపాద్యాదులు ఇచ్చి , " మీ ఆశ్రమం ఎక్కడ? మీ వ్రత నియమాలేమిటి?" అని అడిగాడు.

" మా ఆశ్రమం ఇక్కడికి మూడామడల దూరంలో వుంది" అంటూ ఆమె తాను తెచ్చిన భక్ష్యాలూ, పండ్లూ స్వయంగా తినిపించింది. సువాసనలు వెదజల్లే పూలహారాలు మెళ్ళో వేసింది. అలా కొంతసేపు గడిపి , విభాండక మహాముని వచ్చేవేళకు "అగ్నిహోత్రానికి వేళ అయింది" అని సాకు చెప్పి తప్పించుకుంది.

విభాండకుడు వచ్చేసరికి ఆశ్రమం అంతా చెల్లాచెదురుగా వుంది. పూలూ, పండ్లతొనలూ చిందర వందరగా పడి ఉన్నాయి. ఇదంతా పరికించి " అబ్బాయీ! నేను లేని సమయంలో నీ దగ్గరకెవరైనా వచ్చారా? ఎందుకలా అన్యమనస్కంగా కనిపిస్తున్నావు?" అని అడిగాడు.

" నాన్నగారూ! మీరు లేని సమయంలో అద్భుతరూపంలో వున్న ఒక మహనీయుడు ఇక్కడకు వచ్చాడు. ఆ మాట , ఆ ఆకారం నా మనస్సున నాటుకుపోయాయి. ఆ మూర్తిని చూడకుండా ఉండలేను. అతడితో స్నేహం చేయాలని ఉంది" అని చెప్పడు.

విభాండకుడికి విషయం తెలిసిపోయింది.

తమ తపస్సును భంగం చెయ్యడానికి ఎవరో రాక్షసులు వచ్చారనుకుని " నేను లేనప్పుడు ఎవరినీ ఆశ్రమానికి రానివ్వకు!" అని గట్టిగా చెప్పాడు.

ఒకనాడు మళ్ళీ విభాండకుడు లేని సమయం చూసి ఆ సుందరి మెల్లగా ఋష్యశృంగుడ్ని సమీపించింది. ఆమెను చూడగానే భరింపరాని మోహంతో ఋషికుమారుడు ఆమె దగ్గరకు పరుగెత్తాడు. ఆ జవ్వని మాటలతో ఋష్యశృంగుణ్ణి మైమరపిస్తూ మెల్లగా అడవి దాటించి తన సఖులను కలిసింది. వారంతా కలిసి ఋష్యశృంగుడ్ని అంగదేశానికి తీసుకుపోయారు.

ఋష్యశృంగుడు అంగదేశంలో ఆడుగు పెట్టగానే వానలు కురుశాయి. ప్రాణకోటి సేదతీరింది. నేల పచ్చబారింది. రోమపాదుడు సంతోషించి తన కమార్తె శాంతను ఋష్యశృంగుడికిచ్చి పెళ్ళి చేశాడు.

అన్నీ అనుకున్న ప్రకారం నెరవేరినప్పటికీ , విభాండక మహాముని ఆగ్రహిస్తాడని భయపడ్డారు రాజుగారు. అందుకని మునిని శాంతపరచటం కోసం రాజధానికి వచ్చే మార్గాలలో చక్కని కర్రి ఆవులనూ, ఎద్దులనూ నిలిపి పరిజనాన్ని కాపు ఉంచాడు." ఈ ఆవులూ, ఎడ్లూ, మేకలూ, భూములూ మీ కుమారుడివి. మేము మీ సేవకులం" అని వినయంగా మాట్లాడమని భటులను హెచ్చరించాడు.

అనుకున్నట్టు కొడుకును వెతుక్కుంటూ మహాముని రానేవచ్చాడు. రాజాజ్ఞ ప్రకారం పరిచారకులు మునీంద్రునికి స్వాగతం ఇచ్చి చేయవలసిన సపర్యలన్నీ చేశారు. కోపం చాలా వరకూ చల్లార్చి ఆయనను పట్టణంలో ప్రవేశపెట్టారు. రాజాంతఃపురంలో సకల ఐశ్వర్యాలు అనుభవిస్తూన్న కొడుకుని, పక్కనే వినయంగా తలవంచుకుని నిలబడ్డ కోడల్నీ చూసిన విభాండక మునికి ఆనందం కలిగింది. " నాయనా! ఋష్యశృంగా! ఈ రాజుకు ప్రియమైనదంతా చెయ్యి. ఒక కుమారుడు కలిగిన తరువాత మీరు అరణ్యాలకు రావచ్చు" అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తండ్రి ఆనతి ప్రకారం ఋష్యశృంగుడు సంతానవంతుడై , ఆ వెనుక వానప్రస్థాన్ని స్వీకరించాడు.