Pages

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు


మహాభారతము లోని కథ

నహుష మహారాజు ప్రియంవద యొక్క పుత్రుడు యయాతి. అతడు ఎంతో కాలము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూరువునికి రాజ్యభారమొసగి వైరాగ్యముతో తపోవనాలకు తపస్సుకై వెళ్ళిపోయాడు. వేదవేదాంగ పాఱంగులైన పండితులను తోడుగా తీసుకుని కందమూలాదులను భుజిస్తూ కఠిన నియమ వ్రతాలతో తపస్సు సాగించాడు. యయాతి ఆ తపోవనాలలో ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. హవిస్సులతో దేవతలను తర్పణలతో పితృదేవతలను సంతోషపెట్టాడు. కామ క్రోధాది అరిషడ్వర్గాలను జయించి సహస్ర దివ్యవర్షములు తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు. ముప్పది ఏండ్లు నిరాహారిగా ఒక్క ఏడాది వాయుభక్షణ చేసి తరువాత పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు. అటు తరువాత ఒక్క ఏడాది సముద్రమధ్యములో ఒంటికాలుమీద నిలబడి ఏకాగ్రతతో తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేసి తన అనంత పుణ్యనిధి ప్రభావంవల్ల దివ్యవిమానములో దేవలోకానికి వెళ్ళాడు.

అక్కడ దేవర్షుల పూజలందుకొని బ్రహ్మలోకం చేరాడు. అక్కడ అనేక కల్పములు ఉండి బ్రహ్మర్షుల చేత పూజలందుకొన్నాడు! ఆ తరువాత ఇంద్రలోకాని వచ్చాడు. ధర్మాత్ముడు మహాతపశ్శక్తి సంపన్నుడు అయిన యయాతి వచ్చాడని తెలిసి దేవేంద్రుడు స్వయముగా వచ్చి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించాడు. మహావిభవోపేతుడైన ఇంద్రుడు ఆ యయాతిని యథావిధి పూజించి ఇలా అన్నాడు “ఏమి తపస్సు చేశావయ్య మహానుభావా? నువ్వు సామాన్యుడవు కావు! శతసహస్ర వర్షముల తపస్సు సామాన్యులకు సాధ్యమా?”.

సాక్షాత్ దేవేంద్రుడంతటివాడు ఇలా పొగిడేసరికి యయాతి ప్రారబ్ధవశాత్తు ఇలా పారుష్య వాక్యాలు అన్నాడు “ఓ అమరేంద్రా! సుర దైత్య యక్ష రాక్షస నర ఖేచర సిద్ధ మునిగణముల తపస్సులు నా తపస్సుకు సాటిరావు”. “ఔరా! ఇంత గొప్పవాడయ్యికూడా గర్వమును వీడలేదు కదా!” అని అనుకొని ఇంద్రుడు యయాతితో “మహనీయులైన మహర్షుల తపస్సులను గర్వముతో కించపఱచినావు. లోకశ్రేయస్సుకై తమ జీవితాలను ధారపోసిన ఆ మహనీయులనెన్నడూ అవమానించరాదు. ఓ యయాతి! ఈ ఒక్క మాటతో నీవు సంపాదించుకొన్న తపశ్శక్తి అంతా అంతరించిపోయింది. ఇక నీకు ఈ లోకములో ఉండటానికి అర్హతలేదు. అధోలోకానికి పో” అని శపించాడు.

తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపముతో శరణువేడి యయాతి “ఓ దేవేంద్రా! ఏ క్షణాన నేను పూజ్యులైన మహర్షులను అవమానించానో ఆ క్షణమే నా శక్తి అంతా కరిగిపోయింది. నన్ను అధోలోకాలకు పంపకు. నాకు సత్సంగత్యం లేకుండా చేయకు. సత్ భువనములో సత్పురుషుల సాంగత్యములో నన్ను ఉండనివ్వు” అని ప్రార్థించాడు. పశ్చాత్తాపముతో కుమిలిపోతున్న యయాతిని కరుణించి దేవేంద్రుడు యయాతికి సద్భువనములో నివసించుటకు అనుజ్ఞ ఇచ్చాడు.

సద్భువనములో ఉండి ఆ యయాతి అచిరకాలములోనే అనంత తపశ్శక్తిని మళ్ళీ సంపాదించాడు. అహంకారమును పూర్తిగా విడిచి మహాతేజోమయుడయ్యాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ యయాతి దౌహిత్రులైన అష్టకుడు ప్రతర్దనుడు వసుమంతుడు ఔసీనరుడు మరియు శిబి సద్భువనమునకు వచ్చిరి. అనంతపుణ్యసంపదతో వెలిగిపోతున్న యయాతిని పూజించి “స్వామి! మీరెవరు” అని అడిగారు. యయాతి తన కథను చెప్పి “నాయనలారా! ఎంత కొంచెమైనా గర్వము ఎన్నడు ఉండరాదు. గర్వముతో నేను పారుష్యవాక్యములు మాట్లాడి ఉత్తములైన మహర్షులను అవమానించినాను. మీరెన్నడు అట్టి తప్పుచేయవద్దు. వాక్పారుష్యము విషము కన్నా అగ్ని కన్నా భయంకరమైనది” అని హితవు చెప్పాడు. యాయాతిని తమ తాతగారిగా గుర్తించి నమస్కరించి ఆయనవద్ద ఎన్నో రహస్యములైన ధర్మోపదేశాలు పొందారు అష్టకాదులు.