Pages

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- జనమేజయుడు


సూర్యవంశ ప్రభువుల్లో పరీక్షిత్తు మహారాజు గొప్పవాడు. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. ఆయనకు వేటంటే చాలా ఇష్టం. ఒకసారి అడవికి వేటకు వెళ్ళాడు. జంతువులను వేటాడి అలసిపోయాడు. బాగా దప్పికయింది. మంచినీటి మడుగుకోసం వెతుకుతూంటే శమీక మహర్షి అశ్రమం కనిపించింది. లోపలికి వెళ్ళి " దాహంగా ఉంది. తాగేందుకు మంచినీళ్ళు కావాలి" అని అడిగాడు. మహర్షి ధ్యానసమాధిలో ఉండడం వలన ఆశ్రమం లోపలికి ఎవరు వచ్చింది కూడా ఆయనకు తెలీలేదు. అందుకని సమాధానమివ్వలేదు.

శమీకుడి మౌనాన్ని పరీక్షిత్తు తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ మహర్షి కింత అహంకారమా అనుకుని చచ్చిన పాము నొకదాన్ని ఆయన మెడలో వేశాడు. అది తెలిసి కోపించిన శమీకుని కొడుకు శృంగి " తపోనిష్ఠలో ఉన్న నా తండ్రిపైకి ఎవరైతే పామును వేశారో వాళ్ళు సర్పరాజు తక్షకుడి కాటుతో ఏడు రోజుల్లోగా మరణిస్తారు" అని తీవ్రంగా శపించాడు.

శృంగి దేవీభక్తుడు. అతని మాటకు తిరుగులేకుండా పోయింది.

తక్షకుడి కాటుతో పరీక్షిత్తు మరణించాడు. అప్పటికి మహారజు కుమారుడు జనమేజయుడు చిన్నవాడు. మంత్రులే మహరాజుకు అంతిమసంస్కారం చేశారు. రోజులు గడుస్తున్నాయి. జనమేజయుడికి యుక్తవయస్సు వచ్చింది. మంచి ముహుర్తాన రాజ్యపాలన స్వీకరించాడు. అనతికాలంలోనే సమర్థుడైన రాజుగా పేరు పొందాడు. కాశీరాజు సువర్ణవర్మకు జనమేజయుణ్ణి గురించి విన్నప్పటినుంచీ అతన్ని తన అల్లుడుగా చేసుకోవాలని కోరికగా ఉండేది.

సువర్ణవర్మ కుమార్తె వపుష్టకు కూడా జనమేజయుడే భర్త కావాలని ఉండేది. అనుకున్నట్టే జరిగింది.

జనమేజయుడికీ, వపుష్టకీ ముల్లోకాలూ మురిసిపోయేలా వైభవంగా పెళ్ళి జరిగింది.

ఒకసారి జనమేజయుడు కొలువుతీరి వుండగా ఉత్తాంక మహర్షి వచ్చాడు. జనమేజయుడు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి, పద్మసింహాసనంలో ఆయనను కూర్చోబెట్టి, బంగారుపళ్ళెంలో అయన కాళ్ళు కడిగి మధుపర్కం సమర్పించి సత్కరించాడు.

రాజుగారి ఆదరోపచారాలతో ఉత్తాంకుడు సంతృప్తి చెందాడు.

అ తరువాత వాళ్ళమధ్య చాలాసేపు కుశలప్రశ్నలు జరిగాయి. మాటల మధ్యలో పరీక్షిత్తుమహారాజు ఎలా మరణించిందీ చెప్పాడు ఉత్తాంకుడు.

రాజు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.

సర్పాలన్నిటినీ సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించాడు.

"పాములు ఎక్కడ కనబడితే అక్కడే మట్టుపెట్టిండి" అని అజ్ఞ జారీ చేశాడు.

అంతటితో ఆగక ఋత్విక్కులందర్నీ సమావేశపరిచి పాముల మీద కక్ష తీర్చుకునే విధం తెలియచెప్పండని అడిగాడు. సర్పయాగం చెయ్యమని వాళ్ళంతా సలహా యిచ్చారు. క్షణాలమీద యగానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి.

ఉత్తాంక, చండభార్గవ, ఉద్దాలక, ఆత్రేయ, శ్వేతకేతు, నారద, దేవల, దేవశర్మ, మౌద్గల్య మహర్షులు యాగానికి ఆద్వర్యం వహించారు.

సర్పయాగం ప్రారంభమైంది. నల్లటి వస్త్రాలు ధరించి మంత్రగానం చేస్తున్న మునులు పాముల పాలిట యమదూతల్లా ఉన్నారు.

యజ్ఞగుండంలో ఆజ్యం పోస్తున్నప్పుడల్లా మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.

తాపసుల మంత్రోచ్చారణకు పాములు నిలవలేకపోతున్నాయి. ఎగిరొచ్చి ఒకదాని వెంట ఒకటి మంటల్లో పడుతున్నాయి. అన్నీ అగ్నికి ఆహుతవుతున్నాయి. తక్షకుడు అగ్నికి భయపడి ఇంద్రుణ్ణి అశ్రయించాడు. ఇంద్రుడు అతనికి అభయమిచ్చాడు.

ఈ సంగతి ఋత్విక్కులకు తెలీక అసలైన శత్రువు తక్షకుడు చావునుంచి తప్పించుకుంటున్నాడని యాగాన్ని ఉధృతం చేశారు. దానితో తక్షకుడికి ఒళ్ళంతా మంటలు లేచాయి. ఇక చావు తప్పేట్టు లేదనుకున్నాడు.

తన చెల్లెలు జరత్కారుప్రియను పిలిచి ఈ ఆపద నుంచి గట్టెక్కే ఉపాయమేదో ఆలోచించమన్నాడు. తక్షకుడి చెల్లెలు నాగేశ్వరి జరత్కారుమహర్షిని పెళ్ళాడినందువల్ల జరత్కారుప్రియ అని కూడా ఆమెను పిలుస్తారు. ఆమె ఆ భాద్యతను తన కొడుకు ఆస్తీకుడికి అప్పగించింది. అతను యాగం జరిగేచోటికి బయలుదేరాడు. తక్షకుడి జాడ తెలీక ఈలోగా ఉత్తాంకుడు కోపోద్రిక్తుడై తనకున్న దివ్యశక్తులతో లోకాలన్నీ గాలించాడు. తక్షకుడు అమరావతీ పట్టణంలో ఇంద్రుడితోపాటు సగం సింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడు. అది చూసి ఉత్తాంక మహర్షికి మరీ కోపం వచ్చింది. 'ఇంద్రుడు నిన్ను రక్షించేవాడా' అనుకుని ఇంద్రుడూ, ఇంద్రసింహాసనమూ, తక్షకుడూ అందరూ యాగగుండంలో మాడి మసైపోవాలని ఉత్తాంకుడు దర్భలు చేతబట్టుకుని మంత్రాలు పఠించాడు.

ఇంద్రసింహాసనం కదిలింది. ఇంద్రుడూ, తక్షకుడూ నిలువెల్లా వణికిపోయారు. అదే సమయానికి ఆస్తీకుడు యాగశాలను చేరుకున్నాడు.

యాగశాలలోకి ప్రవేశించిన ఆస్తీకుడికి జనమేజయుడు ఉచితరీతిన మర్యాదలు చేసి, "కార్యార్థులై వచ్చినట్టున్నారు. నావల్ల కాదగిన సహాయమేమిటో చెప్పండి. తప్పకుండా చేస్తాను" అన్నాడు వినయంగా.

"సర్పయాగాన్ని తక్షణమే నిలుపుచెయ్యాలి". జనమేజయుడు నిశ్చేశ్టుడయ్యాడు. అయినా ఆడినమాట తప్పడానికి వీల్లేదు. తనవల్ల కాదగిన సాయమేదైనా సరే చేస్తానన్నాడు. చేసి తీరవల్సిందే.

"సర్పయాగం ఆగిపోయింది".

యాగంలో మృతిచెందిన పాములన్నిటికీ ముక్తి లభించి జన్మరాహిత్యం కలిగేలా దీవించాడు ఆస్తీకుడు. "జీవహింసకు మించిన పాపం లేదు. మనస్సులో చీకట్లు ముసిరిన వాడే హత్యలు చేస్తాడు. కక్షాకార్పణ్యాలు నిండిన మనస్సులోకి వెలుగు చొరబడదు. బుద్ధినీ, అంతరంగాన్నీ విశాలం చేసుకో" అని ఆస్తీకుడు జనమేజయుడికి ఉపదేశించాడు.

జనమేజయుడికి జ్ఞానోదయమైంది.

జనమేజయుడు సర్పయాగం నిలుపుచేసిన తరువాత అశ్వమేధయాగం చేశాడు. వేదవ్యాసుడు ఆ యాగానికి హాజరై జనమేజయుడికి జీవన్మరణ రహస్యాలను బోధించాడు. "నీ తండ్రిని నీకు చూపిస్తానుండమ"ని స్వర్గంలో ఉన్న పరీక్షిత్తుని కిందకు దిగిరమ్మని మహర్షి ఎలుగెత్తి పిలిచాడు.

అంతే!!

పరీక్షిత్తు మహారాజు దివ్యదేహంతో ప్రకాశిస్తూ జనమేజయుడి ముందు ప్రత్యక్షమయ్యాడు.

జనమేజయుడి ఆనందానికి అవధుల్లేవు. వినయంగా వంగి తండ్రి పాదాలను తాకాడు. తండ్రి బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. వెనువెంటనే అంతర్హితుడయ్యాడు.

వ్యాసమహర్షి మహిమకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదీ జనమేజయుడి కథ.

ఈ జనమేజయుడికే వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయనుడు మహాభారత కథను వినిపించాడు.

కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసాక దాదాపు ముప్ఫయి ఆరేళ్ళు పాండవులు రాజ్యపాలన చేశారు. అనంతరం పరీక్షిత్తుకి రాజ్యభారం అప్పగించి పాండవులు అరణ్యాలకు తపస్సు చేసుకునేందుకు వెళ్ళారు. పరీక్షిత్తు సుమారు అరవై సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు. ఆ తరువాత జనమేజయుడు పరిపాలించాడు.