Pages

Friday, 29 May 2015

తిరుప్పావై 12వ రోజు పాశురము


12వ రోజు - లక్ష్మణుడి కర్మ విదానం

ఆండాళ్ తిరువడిగలేశరణం

పాశురము

కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

భగవద్గీత రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మద్యవర్తిగా ఉండే దివ్యజ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో, అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితికి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్షణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడిలోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు.

"ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట: స్తిత ప్రజ్ఞ: తదోచ్యతే | 
ప్రజా:తి యదా కామాన్ సర్వాన్ మనో గతాన్ || "

వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని నాకు ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు. మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు.

"దుఃఖేషు అనుద్విజ్ఞమనాః సుఖేఃషు విగతస్పృహ:
వీత రాగ భయ క్రోద: స్తితదీ: ముణిరుచ్యతే"

ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కాని మనస్సు వాటియందు ఉంచకుండా సాధన చేస్తాడు. ఇది రెండో స్థితి. కొంత కాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలటి గోప బాలిక అలాంటి స్థితి కల్గిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్.

"ఇళంకత్తెరుమై" లేత దూడలు కల్గిన గేదెల "కనైత్త్" అరుపు వినిపిస్తోంది. ఎందుకంటే వాటిని పట్టించుకోనే నాథుడే లేడు. వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమగ్నమై ఉన్నారు. "కన్ఱుక్కిరంగి" దూడ విషయంలో జాలి తలచి తనంతట తానే "నినైత్తు" దూడ వచ్చిందని భావించి, "ములై వరియే" పొదుగుల గుండ "నిన్ఱు పాల్ శోర" ఏక ధారలుగా పాలు ఇస్తున్నాయి. "ననైత్త్-ఇల్లమ్" ఇల్లంతా తడిసి పోయి , "శేఱాక్కుమ్" అంతా బురద అయ్యింది.

ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్టానం చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే.

"నచ్చెల్వన్ తంగాయ్" ఏం సంపదలు కల్గిన వాడి చెల్లెలా!. ఆండాళ్ లోపలున్న గోప బాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది, జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవత్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి, లోపల మనలోని హృదయం ద్రవించేట్టుచేసి మనం కూడా భగవంతుణ్ణి అనుభవించేట్టు చేస్తుంది. "పనిత్తలై వీర" మంచుతో పైన తడుస్తున్నాం, ఏం స్థితి వచ్చిందమ్మా మాకు!! మూడు ప్రవాహాలుగా మేం కొట్టుకుపోతున్నాం. క్రిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, మరి మధ్యలో మాహృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణగుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం. ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది, మరి "నిన్ వాశల్ కడై పత్తి" అమ్మా నీ గుమ్మపు పైకప్పుని పట్టుకొని వ్రేలాడుతున్నాం .

అయితే లోపలున్న గోపబాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది, అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు "శినత్తినాల్" కోపంతో "తెన్ ఇలంగై క్కోమానై" అందమైన లంకానగరానికి రాజైన రావణాసురుణ్ణి "చ్చెత్తమ్" సంహరించి, "మనత్తుక్కినియానై" అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం "ప్పాడవుమ్" పాడుతున్నా "నీ వాయ్ తిఱవాయ్" నీవు నోరు తెరవవా! "ఇనిత్తాన్ ఎరుందిరాయ్" ఇకనైనా నోరు తెరిచి లేవమ్మా. "ఈదెన్న పేర్ ఉఱక్కమ్" ఇది ఎలాంటి నిద్రమ్మా, "అనైత్తిల్లత్తారుం అఱింద్" లోకమంతా తెలిసి పోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం