Pages

Friday, 29 May 2015

తిరుప్పావై 27వ రోజు పాశురము

27వ రోజు - పంచసంస్కారం ఆపై మోక్ష అనుభవం

ఆండాళ్ తిరువడిగలే శరణం

పాశురము

కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై 
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే 
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు 
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార 
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్

లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం క్రింద మార్చుకోవటానికి వాడుకుంటారు, దాన్ని కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంటారు, మరి కొందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు. ఏఒక్కరో నూటికి “కశ్చత్ మామ్వేహి తత్వతః” రెండో అధ్యాయంలో తానే చెప్పి వాపోయినట్లుగా, ఆతత్వాన్ని వినియోగించుకొని ఆతత్వాన్ని సాక్షాత్కరించుకొని మన ఉజ్జీవనకోసం వచ్చిన రూపం ఇదీ అని విశ్వసించడం సామాన్యమైన విషయం కాదు. మనస్సు ఎంతో పరిపక్వం అయితే తప్ప లభించే స్థితి కాదు కూడా. ఆ స్థితి మనకు లభించాలి అంటే మనకు కూడా కొంత తెలుసును అనే అహంభావం తొలగాలి. నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి గొల్ల పిల్లల మాదిరిగా. కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనే లేదు. వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు. కనుక సాధనము, సాద్యము, జ్ఞానము, జ్ఞేయము, నడిపేది సర్వం శ్రీకృష్ణుడే అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్ల పిల్లలు. అందుకే వారికి పరమాత్మ సర్వాత్మనా లొంగే ప్రవర్తించాడు, వారికి ఏ ఆటంకాలు వచ్చినా తొలగించాడు. ఇది లోకంలో ఉండే జీవుల్లలో ఎవరు తననే సర్వమూ అని భావించి, తన ఆజ్ఞని శిరోధార్యంగ స్వీకరించి ఎవరు తన మార్గంలో పయనిస్తారో అలాంటి వారి కోసం విగ్రహరూపంలో ఉండే తానే ఏమైనా చేయగలను అని నిరూపించటమే ఆండాళ్ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం. తాను ఒక అర్చామూర్తిని విశ్వసించింది, ఫలితాన్ని తను పొందింది. భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే, మరొక చోటికి ఎగరటానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం. విభవానికి మనం పోలేం, లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం, పరమపదం మనకు ఊహకికూడా అందనటువంటిది, కనిపించేరూపం భగవంతుడిది అర్చారూపం మాత్రమే. విగ్రహంలో భగవంతుడు కాదు మన సాంప్రదాయం, విగ్రహమే భగవంతుడు అని మన ఆగమాలు నిరూపించే సిద్దాంతం. దాన్ని నమ్మిన ఆండాళ్ దాన్నే మనకు ఆదేశించింది, దాన్నే ఉపదేశించింది. శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు, నేను నీకు కూడా ఎందుకు అందను నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర నిరూపించటానికి ఈనాడు మన వద్ద అర్చామూర్తియై ఉన్నాడు. కావల్సింది మనలో ఉండే విశ్వాసం.

శ్రీకృష్ణుడు ఒకనాడు దివ్య అనుభవం అనేది ఎట్లా ఉండాలో చూపించాలని అనుకున్నాడు. అందుకే సద్దులు ఆరగించుట అనే అద్భుతమైన లీలను తన చుట్టు ఉండే గొల్ల పిల్లలకి చూపి వాళ్ళని ఆనందంతోటి ఉన్మస్తక స్థితిలోకి తీసుకుపోయాడు. అయితే దాన్ని విశ్వసించటం చతుర్వేద అధ్యేతను నేను అనుకున్న చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు. చివరికి వారికి పాటం నేర్పి జ్ఞానోదయం కలిగించాల్సి వచ్చేంత వరకు. శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలందరికి చెప్పాడు, రేపటి నాడు మనం అంతా వనభోజనాలతో విందు చేసుకుందాం, ఎవరెవరి ఇళ్ళలోంచి వారికి వారికి తోచినవి ఏవేవో తెచ్చుకోండి అని చెప్పాడు. అందరూ తెచ్చుకున్నారు, తాను తెచ్చుకున్నాడు. ఆందరిని చుట్టూ కూర్చోబెట్టాడు, ఒక్కొక్కరి వస్తువులని రుచిచూడటం ప్రారంభించాడు, అందంగా వారు తయారుచేసిన వైనాన్ని పొగడుతూ తాను ఆరగిస్తూ వాళ్ళకి ఆరగింపు చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళకి అందిస్తూ, తాను ఆనందం పొందుతున్నాడు శ్రీకృష్ణుడు. అయితే ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గరి నుండి తెచ్చుకున్నవి గంజి నీళ్ళు అవడంతో, కృష్ణుడికి ఎలా ఇవ్వడం, కృష్ణుడు తన దగ్గరికి వచ్చేలోపు తాగేయ్యాలని గబగబా త్రాగటం మొదలు పెట్టాడట. అయితే కృష్ణుడు తనపై ప్రేమతో తెచ్చిన ఆ గొల్లపిల్లవాడి సంబంధం కల్గిన పదార్థం తనకు దొరకకుండా పోతుందేమోనని దిగులు చెంది, గబగబా వెళ్ళి వాడి సెలవుల నుండి కారుతున్న గంజిని తాగటం ప్రారంభించాడు. దీన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మకి ఏం అర్థం కాలేదు. వేదాధ్యయణం చేసినవాడాయే నిప్పుని కూడా కడిగి తీసుకొనే ఆచారవంతుడు, తనకు ఈ విషయం నచ్చలేదు. జగత్ కారణ తత్వం ఇలా ఎంగిలి మంగళమా చేసేది అని అనుకున్నాడట బ్రహ్మ. అయితే, ఈ పిల్లవాడు ఏదో ఇంధ్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలెనని బ్రహ్మగారు అనుకున్నారు, గోవులను గోపబాలురను దాచాడం, తరువాత బ్రహ్మ లోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా కృష్ణుడు చెయ్యటం, ఆపై బ్రహ్మకు బుధ్ధి రావడం జరిగాయి. ఆనాడు ఆ పిల్లలకందరికి సద్దులు ఆరగించే అనుభవాన్ని కృష్ణుడు అందించాడు, మోక్షానందం ఏమిటో చూపించాడు.

అయితే మోక్షం అనగా ఏమి ?

మోక్షం అనగా ఆనందించుట, దీనిపై రక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడో అని ప్రశ్న వేస్తూ, “బ్రహ్మవిత్ ఆప్నోతి పరం” అని చెప్పాయి. ఆంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంను పొందును.

అయితే ఆ పరం ఎలా ఉండును ? అని త్తైత్రీయ ఉపనిషత్తు వర్ణించింది ఇలా “ఆప్నోతి” అంటే పొందటం, లేక తినటం లేక అస్నుత అని చెప్పింది. “సోహాస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాభి పశ్చితేభిః" . సహ - ఈ ముక్త జీవుడు అస్నుతే- ఆరగించును. దేనిని? సర్వాన్ కామాన్ - దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని. మరి జీవుడు ఏమి కోరుకుంటాడు ? భగవంతునిలోని కళ్యాణ గుణాలను కోరును. దీన్నే వేదం ఇలా చెప్పింది. "తస్మిన్ యదంతః తదుపాసితవ్యం" అంటే తస్మిన్ - ఆ పరమాత్మ యందు, అంతః - యత్ - లోపల ఏదైతే కళ్యాణ గుణ సంపద ఉన్నదో, తదుపాసితవ్యం- ఆ ధనాన్ని కోరదగును అని చెప్పింది. సర్వాన్ కామాన్ - అన్ని కళ్యాణ గుణములను మరి ఎట్లా అనుభవించును? బ్రహ్మణాభి - పరమాత్మతో, సహ-కలిసి పశ్చితేభిః- అనుభవించును. అయితే సంస్కృత వ్యాకరణంలో "తో కలసి" అని చెప్పేప్పుడు భోగ్య సహచర్యం మరియూ భోతృ సహచర్యం అని రెండు ఉంటాయి. రాజుగారితో మంత్రి కలిసి వచ్చెను అన్నప్పుడు రాజుగారికే ప్రాధాన్యత ఉంటుంది. భోతృ సహచర్యం అంటారు. అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఎప్పటికీ ఉంటాడు, గుణాలను విడదీసి అనుభవించటం అనేది జరగదు. ఇక జీవుడు భగవంతుడిలో ఏకం అవడం అనేది జరగదు. ఉపనిషత్తులు చెబుతూ "తమః పరేదేవే ఏకీ భవతి" ఏకీ భావమే పర్యవసానం తప్ప, "ఏకం భవతి" అని చెప్పట్లేదు, ఇది గుర్తుంచుకోవాలి. "ఏకీ భవతి" అంటే ఒకటివలె అగును అని వ్యాకరణం చెబుతుంది. మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు, జీవుడు పరమాత్మను చేరును. చేరి ఏమగును? ఎక్కడో మూలన పడి ఉండునా, అలా పడి ఉంటే దాన్ని కైవల్యం అంటారు. మరి ఏమగును? అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణములతో అనుభవించును. మరి గుణములతో అనుభవించటం అంటే ఏంటి? ఇది అర్థం అవడం కష్టం. గుణములను చూడలేం, లెక్క పెట్టలేం. బ్రహ్మం అంటే తెలియదు, గుణం అంటే తెలియదు, ఇక అనుభవించటం అంతకన్నా తెలియదు. దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకే వేదవ్యాస భగవానుడు "శ్రీకృష్ణభగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్నే మోక్ష అనుభవం అని చెప్పాడు" ఒకడు అనేకమందితో కలసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తినెను. ఇదే కదా కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది.

వేదం మోక్షాన్ని అన్నం తినడం అనే దానితో పోల్చి చెబుతుంది. మోక్షంకి వెళ్ళాక "అహం అన్నం అహం అన్నం అహమన్నాదో అహమన్నాదో" అంటూ సాగుతుంది. అయితే ఉపనిషత్తులు అన్నం అంటే "అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే ఇతి" అద్యతే - క్రమంలో తింటే తృప్తినిస్తుంది, అత్తిచ భూతాని - క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది, అంటే శరీరం పాడైపోతుంది అని అర్థం. అందుకే క్రమంలో తినే దాన్నే అన్నం అంటాం. అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం - నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే భగవంతుడు లేదు అహం అన్నం - నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే జీవుడు అహమన్నాదో - నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట, ఆపై భగవంతుడుకూడా అహమన్నాదో - నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట. అయితే అనుభవం పొందేదెవడు, అనుభవించేదెవడు ఇటా అటా, ఆ ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఏవరు అనేది గుర్తించ వీలు కానట్లు సామానత్వం ఏర్పడుతుంది.

అయితే జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మనా సముడగును ఆయన వంటి రూపం,గుణం,ఆనందం, అనుభవం పొందును. బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాసభగవానుడు రెండు విషయాలు తప్ప సముడగును అని చెప్పాడు. అది శ్రీయ పతిత్వం, జగత్ కారణత్వం. ఇది వీడు కోరడు, వాడు ఇవ్వడు. శ్రీ మనకు అమ్మ ఇక జగత్ సృష్టీ స్థితీ లయాలు పెద్ద భాద్యత వాడే ఉంచుకుంటాడు. బ్రహ్మ సూత్రాల్లో "భోగ్య మాత్ర సామ్య లింగాః"అయితే అనుభవం మాత్రం సమానం, జీవుడికీ భగవంతుడికీ తేడా ఉండదు. ఇక ఈ అనందం ఒక్కోజీవికి ఒకలా ఉండదు, అందరికీ సమానం. ఆ అనందం పరమాత్మ ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. వేదం అదే చెప్పింది. శ్రీకృష్ణుడు ఆనాడు గొల్ల పిల్లలతో అదే ఆనందం అనుభవించాడు, వాళ్ళకీ చూపించాడు. గోదాదేవి సద్దులు ఆరగించడం ఏం ప్రారభ్దం కనుక ఎంచక్కా మనం పరమాన్నాన్నే ఆరగిద్దాం అని చెప్పింది.

అందుకే గోదాదేవి "పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార కూడి ఇరుందు కుళిరుంద్" కలిసి అందరం పరమాన్నాన్ని తినవలెనని చెబుతుంది. మరి ఎలాంటి పరమాన్నం అంటే జీవుడుంటాడు దేవుడుంటాడు, ఇరువురిలో సమానత్వం ఉంటుంది. ఇరువురిలోనూ ప్రీతి ఉంటుంది, ఎవరు ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారు తెలియనంతగా, మరి ఈ ప్రీతి ఎట్లా ఏర్పడింది? అంటే వాడి కళ్యాణగుణాల వల్ల ఏర్పడింది. ప్రీతి పైన నిండి ఉంది, వారిరువురి మద్య కలిసి వీడనంత స్నేహం, అది ప్రీతిలో అంతటా కల్సి ఉంది. జీవుడూ పరమాత్మ కల్సి ఉన్నారు సుమా అని గుర్తించాలే తప్ప విడదీసి చూడలేం. ఉపనిషత్తులు చెప్పిన ఈ సారాన్నే మనం పరమాన్నం లేక పాయసంలో చూడొచ్చు. ఆండాళ్ ఇదే పాయసాన్ని కోరుతుంది. "పాల్ శోఱు" పాలు కల్సిన అన్నం "మూడనెయ్ పెయ్దు"అందులో నెయ్యి పూర్తిగా తేలుతూ ఉండాలి, దాంట్లో తీపి పాలల్లో, నెయ్యిలో, భియ్యపు కణాల్లో కల్సి ఉండాలి. వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇదే.

ఏమిటీ పరమాన్నం? ఈ బియ్యపు కణాలే జీవుడు, దానికి ఉండే పొట్టే శరీరం. ఇది భగవంతుడు జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకీ శరీరం లభించింది. దాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు. దాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టుని తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు, కామాలు, క్రోదాలు, లాభాలు, అలాభాలు, జయాలు, అపజయాలు, ఐశ్వర్యాలు, అనైశ్వర్యాలు, జ్ఞానం, అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వీడేట్టు చేస్తాయి. ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది. ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లే, జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతాయి.

"శ్రీషం ప్రపద్య ఆత్మవాన్ ప్రారభ్దం పరి బుజ్య 
కర్మ శకలం ప్రక్షీణ కర్మాంతరః జ్ఞాసా దేవ 
నిరంకుశేష్వర దయా నిర్లూణవ మాయాన్వయః హార్థా 
అనుగ్రహ లబ్దం మధ్య దమని ద్వా రాత్ బహిర్ నిర్గతః ముక్తః"

ఉపనిషత్తులు జీవుడు ఎలా సాగునోనని చెబుతూ, మనకు లభించిన కర్మ అనుభవంచేత తనయందు ఫల కర్తుత్వాన్ని త్యాగం చేస్తూ వాటి యందు పట్టు లేకుండా సాగించే జీవన యాత్రలో కర్మలు అన్నీ తొలగినట్లయితే ఈ హృదయంలో పరమాత్మ చూపిన మార్గంలోంచి బ్రహ్మరద్రం గుండా బయటికి ముక్తుడగును.

ఇలా పన్నెండు మార్గాలు అర్చి దిన పూర్వపక్ష శడు దర్మాస అబ్దవాత్ అంశుమత్ తో విద్యుత్ ఇంద్ర ధాత్రు ఇలా పన్నెండు లోకాలను దాటుతూ విరజాస్నాతుడవుతాడు. విరజలో జీవుడిని కడుగుతాడు. జీవుడిపై ఉండే సూక్ష్మ శరీరం తొలగి, దాన్యం పై ఉండే పొరను తీసినట్లుగానే. రజస్ సంపర్కం పూర్తిగా తొలగేట్టు చేస్తాడు పరమాత్మ. అప్పుడు జీవుడు పరమపదం చేరగల్గుతాడు. పరమాత్మ రూపు పొందగల్గుతాడు. సారూప్యం ఏర్పడుతుంది. అక్కడున్న ముక్త జీవులు వీణ్ణి పరమాత్మ వద్దకు తీసుకుపోతారు. సాన్నిప్యం ఏర్పడుతుంది. అక్కడ పరమాత్మ-అమ్మ ఒడిలో వివిద రకాల సేవలు అందిస్తూ, అనందం పొందుతాడు. సాలోక్యం ఏర్పడుతుంది. ఇలా చివరిస్థితి సాయిజ్యం ఏర్పడుతుంది. యుక్ అంటే కల్సి ఉండేది. జీవుడికి జ్ఞానం, పరమాత్మకు కళ్యాణగుణాలు, వీటిలో ఇరువురూ కల్సి ఉండడమే సాయుజ్యం, దీన్నే మోక్షం అంటారు.

మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు. భగవంతుడి కళ్యాణగుణాలు పాలవంటివి, స్వచ్చమైనవి. పాలు పశువుల నుండి వస్తాయి, మనం ఉపనిషత్తులని పశువులని అనుకోవచ్చు. ఈ కళ్యాణగుణాలనే పాలలో జీవుడు ఉడకాలి. భగవంతుని సేవచేయాలనే రుచి వీడికుండాలి, తన కళ్యాణగుణాలను ఇవ్వాలని రుచి ఆయనకుండాలి. ఈ రుచి అనేది అంతటా కల్సి ఉండాలి, తియ్యదనం వలె. ఇందులో జీవుడూ భగవంతుడూ కల్సి ఉన్నారా లేదా అన్నట్లుగా కల్సి ఉంటారు. పరమపదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం. పరమాన్నం దీనికి ప్రతీక. ఆండాళ్ దీన్నే కోరుతుంది.

పరమాత్మ కున్న పేరు నారాయణ, అది ఒక పెద్ద సాగరం లాంటిది, అందులోంచి తేలిన ఒక నామమే గోవింద నామం. భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం “గోవింద” నామం. అందుకే మన వాళ్ళు ఏదైన పని చేసే ముందు శ్రీ గోవింద గోవింద గోవింద అంటూ సంకల్పం చేసుకొని కార్యంలోకి ఉజ్యమిస్తారు. ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకం. ఏడు రోజులు గోవర్దన పర్వతాన్ని ఎత్తి పట్టి గో గోప గోపీ జన సంరక్షణ చేసి, ఇంద్రుడిచే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు. కష్టపడి సంపాదించిన నామం అవడంచే ఆ నామంతో పిలవడం ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఈరోజు నుండి వరుసగా మూడు రోజులు గోవిందనామం ఉచ్చరించి అనుగ్రహం పొందుతారు.

"గోవిందా" గోగోపగోపీజన సంరక్షకా "శీర్" నీకున్న కళ్యాణ గుణాలు ఎట్లా ఉన్నాయంటే, "కూడారై" కూడని వారిని, నీ దరికి రాని వారిని "వెల్లుమ్" జయించి నీ దరికి రప్పించుకుంటావు. కూడని వారంటే ఈ లోకంలో మూడు రకాలుగా ఉంటారు. ద్వేషంతో కొందరు, ఏం పట్టక ఉదాసీనులు కొందరు, ప్రేమ అధికమై తాము దరికి చేరితే స్వామికి ఎక్కడ మచ్చ అంటుతుందో అని కొందరు. కూడని వారిని తన భాణాలతో దరికి లాక్కుంటాడు. ఇక ప్రేమించి దూరం అయ్యేవాళ్ళను తన అనునయంతో దరికి చేర్చుకుంటాడు. నమ్మాళ్వార్ అలానే, స్వామీ నే దరికి రానే రాను, నాలాంటి అల్పుడు నీ వద్దకు వస్తే ఆ కాంతి అనే స్వేత వస్త్రంకు మచ్చ, అంటూ దూరం పోతుంటే, స్వామి నమ్మాళ్వార్ ని నిలిపి "వళవేళ్ ఒలగిన్"అనే తిరువాయిముళి అనే దివ్యప్రబంధంలో ఇలా అంటాడు స్వామి. నమ్మాళ్వార్ అనగనగా ఒక గోకులం, నేనే శ్రమించి గోవులని కాచా, పాలు పెరుగు వెన్న భాగావచ్చాయి, కానీ నాకందకుండా వాళ్ళంతా దాచుకుంటున్నారయ్యా. తప్పెవరిదయ్యా అంటే నమ్మాళ్వార్ వారిదేనయ్యా అని చెప్పాడు. మరి నేను కష్టపడి సంపాదించింది దాచటం తప్పా కాదా అంటే, తప్పేనయ్యా అని నమ్మాళ్వార్ చెప్పారు. నీవు ఒక కుండ, దానిలో జీవుడి జ్ఞానమే పాలు, పెరిగిన ప్రేమే పెరుగు, మరి ఇదంతా నేను పండించింది కదా, మరి నాకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నావే తప్పెవరిది అంటే పాపం నమ్మాళ్వార్ స్వామికి లొంగిపోవాల్సొవచ్చింది. గొప్పవాడై ఏ యోగ్యతలేని వారి వద్ద అరమరికలు చూపక ఉండే ఆ సౌశీల్యం అనే గుణంతో తను ప్రేమించిన వాళ్ళని దరికి తీసుకుంటాడు. ఇక ఉదాసీనులని తన అందం, ప్రసాదం చూపి దరికి చేర్చుకుంటాడు. ఆలయాల్లో జరిగే తిరువీది ఉత్సవాలు ఉదాసీనులని కటాక్షించటానికే.

ఇంత వరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా, ఇన్నాళ్ళకు నీ సన్నిధి చేరామయ్యా! నీమాట పలకటానికి ఇష్టపడని ఈ లోకం, "ఉన్ఱనై ప్పాడి" నీ నామాన్నే పాడేట్టుగా మమ్మల్ని మార్చు కున్నావు. "పఱైకొండు"నీ పాటపాడి నీవిస్తానన్న వ్రత పరికరాలు స్వీకరించి "యామ్ పెరుసమ్మానమ్" మేం గొప్ప సత్కారం పొందాలని అనుకుంటున్నాం. మేం చేసే వ్రతం మాకు ఏదో లాభం, సత్కారం లభించటానికి కాదు, ఇవన్నీ నీవు ఇప్పించినవి కదా, అది నీకే వైభవం. చేతుకు వేసే కంకణం వ్యక్తికే ఆనందం కానీ చేతుకు కాదు కదా! "నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక" లోకం అంతా కీర్తించేలా సత్కారం కావాలి. విభీషనుడికి , సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయటం వల్ల లోకం రాముణ్ణే కదా కీర్తించింది. ఇక ఒక్కో పరికరాలను అడగటం ప్రారంభించారు. గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు. వాటిని సూచిస్తోందా అన్నట్టుగా గోదా పంచ సంస్కార పక్రియను చెబుతుంది. "శూడగమే" చేతికి ఒక కంకణం కావాలి, "తోళ్ వళైయే" భుజానికి ధరించే ఆభరణం, "తోడే", చెవికి ధరించే ఒక ఆభరణం, "శెవి పువ్వే" చెవి పైకి పరిమలం కోసం ధరించే మరొక ఆభరణం, "పాడగమే" పాదాలకు ధరించే ఒక ఆభరణం. ఇవన్నీ కోరుతుంది గోదా. ఆచార్య ఆశ్రయణం చేసినప్పుడు చేతికో కంకణం, భుజానికి శంఖ చక్రాలు, చెవికి అష్టాక్షరీ మహా మంత్రం, పరిమలాన్నిచ్చే ద్వయ మంత్రం, పాదాలా అన్నట్టుగ చరమ శ్లోకం అందిస్తారు మన ఆచార్యులు. "యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్" మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో, అవన్నీ ఇవ్వు. "ఆడైయడుప్పోం" నూతన వస్త్రాలు కావాలి. జీవుడు భగవంతుణ్ణి చేరాటానికి లభించిన వస్త్రం శరీరం, ఇది పాంచబౌతిక శరీరం, పరమపదానికి వెళ్ళే ముందు, విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది. "అతన్ పిన్నే" అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావల్సింది "పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార" పరమాన్నం, అదే పరమ పదం. "కూడి ఇరుందు" అందరు కల్సి గోష్టిగా తినడానికి, "కుళిరుంద్" ఈ కలయికతో మన ఈ సంసార తాపం అంతా తొలగాలి.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం