Pages

Saturday, 8 August 2015

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః 1( అథ త్రయోదశోధ్యాయః, భగవద్గీత) -శ్రీ భగవద్గీత


అర్జున ఉవాచ:-

ప్రకృతిం పురుషం చైవ
క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ,
ఏతద్వేదితుమిచ్ఛామి
జ్ఞానం జ్ఞేయం చ కేశవ.


అర్జునుడు చెప్పెను - ఓ కృష్ణా! ప్రకృతిని, పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞనమును, జ్ఞేయమును - వీనినన్నిటిని గూర్చి నేను తెలిసికొనగోరుచున్నాను.

******************************************************************************************* 1

శ్రీ భగవానువాచ:-

ఇదం శరీరం కౌంతేయ
క్షేత్ర మిత్యభిధీయతేః,
ఏతద్యో వేత్తి తం ప్రాహుః
క్షేత్రజ్ఞ ఇతి తద్విదః.


శ్రీ భగవానుడు చెప్పెను - కుంతీ పుత్రుడవగు ఓ అర్జునా! ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది. దీనిని తెలిసికొనువాడు, క్షేత్రజ్ఞుడని క్షేత్రక్షేత్రజ్ఞుల నెఱిగినవారు చెప్పుదురు.

******************************************************************************************* 2

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి
సర్వక్షేత్రేషు భారత,
క్షేత్రక్షేత్రజ్ఞ యోర్జ్ఞానం
యత్తజ్జ్ఞానం మతం మమ.


అర్జునా! సమస్త క్షేత్రము లందును (శరీరము లందును) నన్ను క్షేత్రజ్ఞునిగ గూడ నెఱుగుము. క్షేత్రక్షేత్రజ్ఞులను గూర్చిన జ్ఞానమేదికలదో, అదియే వాస్తవమగు జ్ఞానమని నా యభిప్రాయము.

******************************************************************************************* 3

తతే త్రం యచ్చ యాదృక్చ
యద్వికారి యతశ్చ యత్‌,
స చ యో యత్ప్రభావశ్చ
తత్సమాసేన మే శృణు.


ఆ క్షేత్రమేదియో, ఎటువంటిదో, ఎట్టి వికారములుకలదో, దేనినుండి యేరీతిగ నుత్పన్నమైనదో, ఆ క్షేత్రజ్ఞుడును ఎవడో, ఎట్టి ప్రభావముకలవాడో ఆ విషయములన్నింటిని సంక్షేపముగ నా వలన వినుము.

******************************************************************************************* 4

ఋషిభిర్బహుధా గీతం
ఛందోభిర్వివిధైః పృథక్‌,
బ్రహ్మసూత్రపదైశ్చైవ
హేతుమద్భిర్వినిశ్చితైః.


(ఆ క్షేత్రక్షేత్రజ్ఞ జ్ఞానము) ఋషులచే అనేక ప్రకారములుగా నానావిధములైన వేదముల ద్వారా వేరు వేరుగా ప్రతిపాదింపబడినది. మఱియు హేతువులతో (యుక్తులతో) గూడి బాగుగ నిశ్చయింపబడినట్టి బ్రహ్మసూత్రవాక్యములచేత గూడ నయ్యది చెప్పబడి యున్నది.

******************************************************************************************* 5

మహాభూతాన్యహజ్కారో
బుద్ధిరవ్యక్త మేవ చ
ఇంద్రియాణి దశైకం చ
పఞ్చ చేంత్రియగోచరాః.

ఇచ్ఛా ద్వేషస్సుఖం దుఃఖం
సజ్ఘాతశ్చేతనా ధృతిః,
ఏతతే త్రం సమాసేన
సవికారముదాహృతమ్‌.‌


పంచభూతములు అహంకారము, బుద్ధి, మూలప్రకృతి, పదునొకండు ఇంద్రియములు (దశేంద్రియములు+మనస్సు), ఐదు ఇంద్రియ విషయములు (శబ్ద స్పర్శాదులు), కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల సముదాయము, తెలివి (వృత్తిజ్ఞానము), ధైర్యము అను వీని సముదాయమై వికారసహితమైనట్టి క్షేత్రము సంక్షేపముగా చెప్పబడినది.

******************************************************************************************* 6,7

అమానిత్వమదంభిత్వ
మహింసా క్షాంతిరార్జవమ్‌,
ఆచార్యోపాసనం శౌచం
స్థైర్యమాత్మవినిగ్రహః

ఇంద్రియార్థేషు వైరాగ్య
మనహంకార ఏవ చ
జన్మమృత్యుజరావ్యాధి
దుఃఖదోషానుదర్శనమ్‌.

అసక్తిరనభిష్వజ్గః
పుత్రదార గృహాదిషు,
నిత్యం చ సమచిత్తత్వ
మిష్టానిష్టోపపత్తిషు.

మయి చానన్యయోగేన
భక్తి రవ్యభిచారణీ,
వివిక్త దేశ సేవిత్వ
మరతిర్జనసంసది.

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం
తత్త్వజ్ఞానార్థ దర్శనమ్‌,
ఏతజ్జ్ఞా నమితి ప్రోక్త
మజ్ఞానం యదతోన్యథా.


తన్ను తాను పొగడుకొనుకుండుట, డంబములేకుండుట, (మనోవాక్కాయములచే) పరప్రాణులను బాధీంపకుండుట, ఓర్పుగలిగియుండుట, ఋజుత్వము (శుద్ధి) గలిగియుండుట, సన్మార్గమున (మోక్షమార్గమున) స్థిరముగా నిలబడుట, మనస్సును బాగుగా నిగ్రహించుట, ఇంద్రియ విషయములగు శబ్దస్పర్శాదులందు విరక్తిగలిగియుండుట, అహంకారములేకుండుట, పుట్టుక, చావు, ముసలితనము, రోగము - అనువానివలన కల్గు దుఃఖమును, దోషమును మాటిమాటికి స్మరించుట, కొడుకులు ( సంతానము), భార్య, ఇల్లు మున్నగువానియందు ఆసక్తి లేకుండుట. మఱియు వానియందు తగులుము లేకుండుట (వారికి కలుగు సుఖదుఃఖములు తనకే కలిగినట్లు అభిమానింపకుండుట), ఇష్టానిష్టములు (శుభాశుభములు) సంప్రాప్తించినపు డెల్లపుడును సమబుద్ధి గలిగియుండుట. నాయందు (భగవంతునియందు) అనన్యమైన (నిశ్చల) భక్తిగలిగియుండుట, ఏకాంత ప్రదేశమును (ప్రతిబంధములేనిచోటును) ఆశ్రయించుట, జనసమూహమునందు ప్రీతిలేకుండుట, ఆధ్యాత్మజ్ఞనము (ఆత్మనిష్ఠ) నిరంతరము గలిగియుండుట, తత్త్వ జ్ఞానముయొక్క గొప్ప ప్రయోజనమును తెలిసికొనుట అను నిదియంతయు జ్ఞానమని చెప్పబడును. దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానము (అని తెలియదగినది).

*******************************************************************************************  8,9,10,11,12