Pages

Thursday, 6 August 2015

అక్షరపరబ్రహ్మయోగః 3 (అథ అష్టమోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత

భూతగ్రామస్స ఏవాయం
భూత్వాభూత్వా ప్రలీయతే,
రాత్ర్యాగమే వశః పార్థ
ప్రభవత్యహరాగమే.


ఓ అర్జునా! ఆ యీ (పూర్వకల్పమందలి) ప్రాణి సమూహమే కర్మపరాధీనమై పుట్టిపుట్టి (బ్రహ్మదేవుని) రాత్రి యొక్క ప్రారంభమున (మరల) విలయ మొందుచున్నది. తిరిగి (బ్రహ్మదేవుని) పగటి యొక్క ప్రారంభమున పుట్టుచున్నది.

******************************************************************************************* 19

పరస్తస్మాత్తు భావోన్యో
వ్యక్తో వ్యక్తాత్సనాతనః,
యస్స సర్వేషు భూతేషు
నశ్యత్సు న వినశ్యతి.


ఏ పరమాత్మ వస్తువు ఆ అవ్యక్తము ( ప్రకృతి) కంటె వేరైనదియు, ఉత్తమమైనదియు, ఇంద్రియములకు వ్యక్తముకానిదియు, పురాతనమైనదియుయగునో, అయ్యది సమస్త ప్రాణికోట్లు నశించినను నశించకయే యుండును.

******************************************************************************************* 20

అవ్యక్తోక్షర ఇత్యుక్త
స్తమాహుః పరమాం గతిమ్‌,
యం ప్రాప్య న నివర్తంతే
తద్ధామ పరమం మమ.


ఏ పరమాత్మ (ఇంద్రియములకు) అగోచరుడనియు, నాశరహితుడనియు చెప్పబడెనో, ఆతనినే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా (వేదవేత్తలు) చెప్పుచున్నారు. దేనిని పొందినచో, మరల (వెనుకకు తిరిగి ఈ సంసారమున) జన్మింపరో, అదియే నాయొక్క శ్రేష్ఠమైన స్థానము (స్వరూపము) అయియున్నది .

*******************************************************************************************  21

పురుషః స పరః పార్థ
భక్త్యా లభ్యస్త్వనన్యయా,
యస్యాంతః స్థాని భూతాని
యేన సర్వమిదం తతమ్‌.


ఓ అర్జునా! ఎవనియందీ ప్రాణికోట్లన్నియు నివసించుచున్నవో, ఎవనిచే ఈ సమస్త జగత్తును వ్యాపింపబడియున్నదో, అట్టి పరమపురుషుడు (పరమాత్మ) అనన్యమగు (అచంచలమగు) భక్తిచేతనే పొందబడగలడు.

*******************************************************************************************  22

యత్ర కాలే త్వనావృత్తి
మావృత్తిం చైవ యోగినః,
ప్రయాతా యాంతితం కాలం
వక్ష్యామి భరతర్షభ.


భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఏ కాలమందు (లేక ఏ మార్గమందు శరీరమును విడిచి) వెడలిన యోగులు మరల తిరిగి రారో (జన్మమునొందరో) ఏ కాలమందు వెడలిన యోగులు మరల తిరిగి వచ్చుదురో (జన్మించెదరో). ఆయాకాల విశేషములను చెప్పుచున్నాను. (వినుము).

*******************************************************************************************  23

అగ్నిర్జ్యోతిరహశ్శుక్ల
ష్షణ్మాసా ఉత్తరాయణమ్‌,
తత్ర ప్రయాతా గచ్ఛంతి
బ్రహ్మ బ్రహ్మవిదో జనాః.


అగ్ని, ప్రకాశము, పగలు, శుక్లపక్షము, ఆఱునెలలుగ ఉత్తరాయణము ఏమార్గమందుగలవో, ఆ మార్గమందు వెడలిన బ్రహ్మవేత్తలగు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు.

*******************************************************************************************  24

ధూమో రాత్రి స్తథా కృష్ణ
ష్షణ్మాసా దక్షిణాయనమ్‌,
తత్ర చాంద్రమసం జ్యోతి
ర్యోగీ ప్రాప్య నివర్తతే.


పొగ, రాత్రి, కృష్ణపక్షము, ఆఱు నెలలుగ దక్షిణాయనము ఏ మార్గమున గలవో, ఆ మార్గమున (వెడలిన) సకామకర్మయోగి చంద్రసంబంధమైన ప్రకాశమునుబొంది మఱల వెనుకకు వచ్చుచున్నాడు (తిరిగి జన్మించుచున్నాడు).

*******************************************************************************************  25

శుక్లకృష్ణే గతీహ్యేతే
జగతః శాశ్వతే మతే,
ఏకయా యాత్యనావృత్తి
మన్యయా వర్తతే పునః.


ఈ శుక్లకృష్ణ మార్గములు రెండును జగత్తునందు శాశ్వతముగ నుండునవిగ తలంపబడుచున్నవి. అందు మొదటిదానిచే జన్మరాహిత్యమును, రెండవదానిచే మరల జన్మమును యోగి పొందుచున్నాడు.

*******************************************************************************************  26

నైతే సృతీ పార్థ జాన
న్యోగీ ముహ్యతి కశ్చన,
తస్మాత్సర్వేషు కాలేషు
యోగయుక్తో భవార్జున.


ఓ అర్జునా! ఈ రెండుమార్గములను ఎఱుగునట్టి యోగి యెవడును ఇక మోహమును బొందడు కాబట్టి నీ వెల్లకాలమందును (దైవ) యోగయుక్తడవు కమ్ము.

*******************************************************************************************  27

వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్‌,
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్‌.


యోగియైనవాడు దీనిని ( ఈ అధ్యాయమున చెప్పబడిన అక్షరపరబ్రహ్మతత్త్వము మున్నగు వానిని) ఎఱిగి వేదములందును, యజ్ఞములందును, దానములందును, తపస్సులందును, ఏ పుణ్యఫలము చెప్పబడియున్నదో, దానినంతను అతిక్రమించుచున్నాడు. (దానిని మించిన పుణ్యఫలమును బొందుచున్నాడు). మఱియు అనాదియగు సర్వోత్తమ (బ్రహ్మ) స్థానమును బొందుచున్నాడు.

*******************************************************************************************  28


ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, అక్షరపరబ్రహ్మయోగోనామ అష్టమోధ్యాయః