Pages

Thursday, 6 August 2015

విభూతి యోగః 3 (అథ దశమోధ్యాయః) -శ్రీ భగవద్గీత

శ్రీ భగవానువాచ :-

హంత తే కథయిష్యామి
దివ్యా హ్యాత్మవిభూతయః,
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ.
నాస్త్యంతో విస్తరస్యమే.


శ్రీ భగవంతుడు చెప్పెను. కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఇప్పుడు దివ్యములైన నాయొక్క విభూతులను ప్రాధాన్యత ననుసరించి ( ముఖ్యములైన వానిని) నీకు చెప్పెదను. ఏలయనగా - నాయొక్క విభూతి విస్తారమునకు అంతములేదు.

******************************************************************************************* 19

అహమాత్మా గుడాకేశ
సర్వభూతాశయస్థితః,
అహమాదిశ్చ మధ్యం చ
భూతానామంత ఏవ చ.


ఓ అర్జునా! సమస్త ప్రాణులయొక్క హృదయమునందున్న ప్రత్యగాత్మను నేనే అయియున్నాను. మఱియు ప్రాణులయొక్క ఆది మధ్యాంతములున్ను (సృష్టి స్థితి లయములున్ను) నేనే అయియున్నాను.

******************************************************************************************* 20

ఆదిత్యానామహం విష్ణు
ర్జ్యోతిషాం రవిరంశుమాన్‌
మరీచిర్మరుతామస్మి,
నక్షత్రాణామహం శశీ.


నేను ఆదిత్యులలో విష్ణువనువాడను, ప్రకాశింపజేయువానిలో కిరణములుగల సూర్యుడను, మరుత్తులను దేవతలలో మరీచియనువాడను, నక్షత్రములలో చంద్రుడను అయియున్నాను.

*******************************************************************************************  21

వేదానాం సామవేదోస్మి
దేవానామస్మివాసవః,
ఇంద్రియాణాం మనశ్చాస్మి
భూతానామస్మి చేతనా.


నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును (తెలివి) అయియున్నాను.

*******************************************************************************************  22

రుద్రాణాం శంకరశ్చాస్మి
విత్తేశో యక్షరక్షసామ్‌,
వసూనాం పావకశ్చాస్మి
మేరుశ్శిఖరిణామహమ్‌.


నేను రుద్రులలో శంకరుడనువాడను, యక్షులలోను, రాక్షసులలోను కుబేరుడను, వసువులలో అగ్నియు, పర్వతములలో మేరువును అయియున్నాను.

*******************************************************************************************  23

పురోధసాం చ ముఖ్యం మాం
విద్ధి పార్థ బృహస్పతిమ్‌,
సేనానీనామహం స్కంద
స్సరసామస్మి సాగరః.


ఓ అర్జునా! పురోహితులలో శ్రేష్ఠుడగు బృహస్పతినిగా నన్నెఱుగుము! మరియు నేను సేనానాయకులలో కుమారస్వామియు, సరస్సులలో సముద్రమును అయియున్నాను.

*******************************************************************************************  24

మహర్షీణాం భృగురహం
గిరామ స్మ్యేకమక్షరమ్‌,
యజ్ఞానాం జపయజ్ఞోస్మి
స్థావరాణాం హిమాలయః.


నేను మహర్షులలో భృగుమహర్షిని, వాక్కులలో ఏకాక్షరమగు ప్రణవమును (ఓం కారమును), యజ్ఞములలో జపయజ్ఞమును, స్థిరపదార్థములలో హిమాలయ పర్వతమును అయియున్నాను.

*******************************************************************************************  25

అశ్వత్థః సర్వవృక్షాణాం
దేవర్షీణాం చ నారదః,
గంధర్వాణాం చిత్రరథః
సిద్ధానాం కపిలో మునిః‌.


నేను చెట్లన్నిటి యందును రావిచెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిల మునీంద్రుడను అయియున్నాను.

*******************************************************************************************  26

ఉచ్చైశ్శ్రవసమశ్వనాం
విద్ధి మామమృతోద్భవమ్‌,
ఐరావతం గజేంద్రాణాం
నరాణాం చ నరాధిపమ్‌.


గుఱ్ఱములలో అమృతముతోబాటు పుట్టిన ఉచ్చైశ్శ్రవనమను గుఱ్ఱమునుగను, గొప్ప యేనుగులలో ఐరావతమను యేనుగునుగను, మనుష్యులలో రాజునుగను నన్ను తెలిసికొనుము.

*******************************************************************************************  27