Pages

Wednesday, 5 August 2015

సాంఖ్య యోగః 4 (అథ ద్వితీయోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత


అవ్యక్తాదీని భూతాని 
వ్యక్త మధ్యాని భారత! 
అవ్యక్త నిధనాన్యేవ 
తత్ర కా పరిదేవనా.


ఓ అర్జునా! ప్రాణికోట్లన్నియు పుట్టుకకు పూర్వము కనబడకయు పుట్టినపిదప (దేహముతోగూడి) కనబడుచును, మరణించిన పిదప మరల కనబడకయు నుండుచున్నవి. అట్టివాని విషయమై శోకింపనేల? (మొదట కనబడక మరల కనబడి, తిరిగి అంతరించిపోవు భ్రాంతిరూపములైన ఈ దేహములకొరకై దుఃఖింపనేల యని భావము. లేక, ఆదియందు ఏ అవ్యక్తరూపము కలిగియున్నదో, అట్టి అవ్యక్తరూపమునే తిరిగి అంత్యమున ధరించుచుండ నిక దానికై శోకింపనేల? అనియు చెప్పవచ్చును).

*******************************************************************************************  28

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన 
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః, 
ఆశ్చర్యవచ్చైన మన్యశ్శృణోతి 
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్‌.


ఈ ఆత్మను ఒకానొకడు ఆశ్చర్యమైన దానినివలె చూచుచున్నాడు. మరియొకడు ఆశ్చర్యమైన దానినివలె (దీనిని చూచి) చెప్పుచున్నాడు. అట్లే వేరొకడు ఆశ్చర్యమైన దానినివలె దీనినిగూర్చి వినుచున్నాడు. అట్లు వినియు, చూచియు, చెప్పియుగూడ ఒకడును దీనిని సరిగా తెలిసికొనుటలేదు. (సాక్షాత్తుగా అనుభవింపగల్గువా రరుదని భావము).

*******************************************************************************************  29

దేహీ నిత్యమవధ్యోయం 
దేహే సర్వస్య భారత! 
తస్మాత్సర్వాణి భూతాని 
న త్వం శోచితు మర్హసి.


అర్జునా! సమస్త ప్రాణికోట్లయొక్కయు దేహములందు వసించియున్న ఈ ఆత్మ యెన్నడును చంపబడడు. కావున ఏ ప్రాణినిగూర్చియు నీవు శోకింపదగదు.

*******************************************************************************************  30

స్వధర్మమపి చావేక్ష్య 
న వికంపితు మర్హసి, 
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోన్యత్‌ 
క్షత్రియస్య న విద్యతే.


మరిఱు ఓ అర్జునా! స్వకీయమగు క్షత్రియ ధర్మమును విచారించుకొనినను యుద్ధమునకు వెనుదీయుట నీకు సరియైనది కాదు. ఏలయనిన క్షత్రియునకు ధర్మయుద్ధముకంటె శ్రేయస్కరమైనది మరియొకటి లేదుకదా!

*******************************************************************************************  31

యదృచ్ఛయా చోపపన్నం 
స్వర్గద్వార మపావృతమ్‌, 
సుఖినః క్షత్రియాః పార్థ! 
లభంతే యుద్ధ మీదృశమ్‌.


ఓ అర్జునా! అప్రయత్నముగనే లభించునట్టిదియు, తెరువబడిన స్వర్గద్వారము వంటిదియు (స్వర్గమును గలుగజేయునదియు) నగు ఇట్టి యుద్ధమును ఏ క్షత్రియులు పొందుదురో వారు నిక్కముగ సుఖవంతులే యగుదురు.

*******************************************************************************************  32

అథ చేత్త్వమిమం ధర్మ్యం 
సంగ్రామం న కరిష్యసి,
తత స్స్వధర్మం కీర్తించ 
హిత్వా పాప మవాప్స్యసి.


ఇక నీవు ధర్మయుక్తమగు ఈ యుద్ధమును చేయకుందువేని, దానిచే నీవు స్వధర్మమును నిరసించిన వాడవై, కీర్తిని బోగొట్టుకొని, పాపమును బొందగలవు.

*******************************************************************************************  33

అకీర్తిం చాపి భూతాని 
కథయిష్యంతి తేవ్యయామ్‌,
సంభావితస్య చాకీర్తి 
ర్మరణాదతిరిచ్యతే.


మఱియు లోకులు నీయొక్క అపకీర్తిని చిరకాలము వరకు చెప్పుకొనుచుందురు. గౌరవముగ బ్రతికినవానికి అపకీర్తి చావుకంటెను అధికమైనది.

*******************************************************************************************  34

భయాద్రణా దుపరతం 
మంస్యంతే త్వాం మహారథాః,
యేషాం చ త్వం బహుమతో 
భూత్వాయాస్యసి లాఘవమ్‌.


మఱియు ఇంతవరకు ఏ మహారథులందు నీవు ఘనముగా భావింపబడుచుంటివో, వారెల్లరు నిన్నిపుడు చులకనజేసి భయముచే యుద్ధమునుండి మరలినవాని నిగ నిన్ను దలంతురు.

*******************************************************************************************  35

అవాచ్యవాదాంశ్చ బహూన్‌ 
వదిష్యంతి తవాహితాః, 
నిందంతస్తవ సామర్థ్యం 
తతో దుఃఖతరం ను కిమ్‌.


(ఇంతియేకాక అత్తఱి) శత్రువులు నీయొక్క సామర్థ్యమును దూషించుచు పెక్కుదుర్భషణములను గూడ పలుకగలరు. దానినిమించిన దుఃఖమేమి కలదు?

*******************************************************************************************  36