Pages

Saturday, 8 August 2015

మోక్షసన్న్యాసయోగ: 6 (అథ అష్టాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

యతః ప్రవృత్తిర్భూతానాం
యేన సర్వమిదం తతమ్‌,
స్వకర్మణా తమభ్యర్చ్య
సిద్ధిం విందతి మానవః.



ఎవనివలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము (ప్రవృత్తి) కలుగుచున్నదో, ఎవనిచేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడియున్నదో, ఆతనిని (అట్టి పరమాత్మను) మనుజుడు స్వకీయ కర్మముచే నారాధించి జ్ఞానయోగ్యతారూపసిద్ధిని పొందుచున్నాడు.

******************************************************************************************* 46

శ్రేయాన్‌ స్వధర్మో విగుణః
పరధర్మాత్స్వనుష్ఠితాత్‌,
స్వభావనియతం కర్మ
కుర్వన్నాప్నోతి కిల్బిషమ్‌.



తనయొక్క ధర్మము (తన అవివేకముచే) గుణము లేనిదిగ కనబడినను (లేక, అసంపూర్ణముగ అనుష్ఠింపబడినను) చక్కగా అనుష్ఠింపబడిన ఇతరుల ధర్మము కంటె శ్రేష్ఠమైనదేయగును. స్వభావముచే ఏర్పడిన (తన ధర్మమునకు తగిన) కర్మమును చేయుచున్నయెడల మనుజుడు పాపమును పొందనేరడు .

******************************************************************************************* 47

సహజం కర్మ కౌంతేయ
సదోషమపి న త్యజేత్‌,
సర్వారంభా హి దోషేణ
ధూమేనాగ్ని రివావృతాః.



ఓ అర్జునా! స్వభావసిద్ధమగు కర్మము దోషయుక్తమైనను (దృశ్యరూపమైనను, లేక త్రిగుణాత్మకమైనను) దానిని వదలరాదు. పొగచేత అగ్ని కప్పబడునట్లు సమస్త కర్మములు (త్రిగుణములయొక్క) దోషముచేత కప్పబడియున్నవికదా!

******************************************************************************************* 48

అసక్త బుద్ధిస్సర్వత్ర
జితాత్మా విగతస్పృహః,
నైష్కర్మ్యసిద్ధిం పరమాం
సన్న్యాసేనాధిగచ్ఛతి.



సమస్త విషయములందును తగులుబాటు నొందని (అసక్తమగు) బుద్ధిగలవాడును, మనస్సును జయించిన వాడును, కోరికలు లేనివాడునగు మనుజుడు సంగత్యాగముచే (జ్ఞానమార్గముచే) సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మస్థితిని పొందుచున్నాడు.

******************************************************************************************* 49

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ
తథాప్నోతి నిబోధమే,
సమాసేనైవ కౌంతేయ
నిష్ఠా జ్ఞానస్య యా పరా.



ఓ అర్జునా! కర్మసిద్ధిని (నిష్కామకర్మలచే చిత్తశుద్ధిని) బడసినవాడు పరమాత్మ నే ప్రకారము పొందగలడో ఆ విధమును మఱియు జ్ఞానముయొక్క శ్రేష్ఠమైన నిష్ఠ (లేక పర్వయసానము) ఏది కలదో దానినిన్ని (జ్ఞాననిష్ఠను, లేక జ్ఞానపరాకాష్ఠను) సంక్షేపముగ నావలన దెలిసికొనుము.

******************************************************************************************* 50

బుద్ధ్యా విశుద్దయా యుక్తో
ధృత్యాత్మానం నియమ్య చ,
శబ్దాదీన్విషయాంస్త్యక్త్వా
రాగద్వేషౌ వ్యుదస్య చ.



వివిక్త సేవీ లఘ్వాశీ
యతవాక్కాయ మానసః,
ధ్యానయోగపరో నిత్యం
వైరాగ్యం సముపాశ్రితః.



అహంకారం బలం దర్పం
కామం క్రోధం పరిగ్రహమ్‌
విముచ్య నిర్మమశ్శాంతో
బ్రహ్మభూయాయ కల్పతే.



అతినిర్మలమైన బుద్ధితో గూడినవాడును, ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడును, శబ్ద స్పర్శాది విషయములను విడిచిపెట్టువాడును, రాగద్వేషములను పరిత్యజించువాడును, ఏకాంత స్థలమునందు నివసించువాడును, మితాహారమును సేవించువాడును, వాక్కును, శరీరమును, మనస్సును స్వాధీనము చేసికొనినవాడును, ఎల్లప్పుడును ధ్యానయోగతత్పరుడై యుండువాడును, వైరాగ్యమును లెస్సగ నవలంబించినవాడును, అహంకారమును, బలమును (కామక్రోధాది సంయుక్తమగు బలమును లేక మొండిపట్టును), డంబమును, కామమును (విషయాసక్తిని), క్రోధమును, వస్తుసంగ్రహణమును బాగుగ వదలివైచువాడును, మమకారము లేనివాడును, శాంతుడును అయియుండువాడు బ్రహ్మస్వరూపము నొందుటకు (బ్రహ్మైక్యమునకు, మోక్షమునకు) సమర్థుడగుచున్నాడు.

******************************************************************************************* 51,52,53

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా
న శోచతి న కాంక్షతి,
సమస్సర్వేషు భూతేషు
మద్భక్తిం లభతే పరామ్‌.



బ్రహ్మరూపమును (బ్రహ్మైక్యమును) బొందిన వాడు (జీవన్ముక్తుడు), నిర్మలమైన (ప్రశాంతమైన) మనస్సు గలవాడునగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖించడు. దేనిని కోరడు; సమస్త ప్రాణులందును సమబుద్ధిగలవాడై (వానిని తనవలెనే చూచుకొనుచు) నాయందలి ఉత్తమభక్తి పొందుచున్నాడు.

******************************************************************************************* 54