Pages

Wednesday, 5 August 2015

గీతా మాహాత్మ్యము 2

పాఠేసమర్థస్సంపూర్ణే
తదర్ధం పాఠ మాచరేత్‌,
తదా గోదానజం పుణ్యం
లభతే నాత్ర సంశయః.

గీతను మొత్తము చదువలేనివారు అందలి సగము భాగమైనను పఠించవలెను. దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును. ఇవ్విషయమున సందేహములేదు.

******************************************************************************************* 1

త్రిభాగం పఠమానస్తు
గంగాస్నానఫలం లభేత్‌,
షడంశం జపమానస్తు
సోమయాగఫలం లభేత్‌.

గీత యొక్క మూడవ భాగము(1/3) (ఆఱు అధ్యాయములు) పారాయణ మొనర్చువారికి గంగాస్నానము వలన కలుగు ఫలము చేకూరును. ఆఱవ భాగము (1/6)(మూడధ్యాయములు) పఠించువారికి సోమయాగఫలము లభించును .

******************************************************************************************* 2

ఏకాధ్యాయం తు యోనిత్యం
పఠతే భక్తి సంయుతః,
రుద్రలోక మవాప్నోతి
గణోభూత్వా వసేచ్చిరమ్‌

ఎవడు గీతయందలి ఒక్క అధ్యాయమును భక్తితో గూడి నిత్యము పఠించుచుండునో, అతడు రుద్ర లోకమునుపొంది అచ్చట రుద్రగణములలో నొకడై చిరకాలము వసించును.

******************************************************************************************* 3

అధ్యాయ శ్లోకపాదం వా
నిత్యం యః పఠతే నరః,
స యాతి నరతాం యావ
న్మనుకాలం వసుంధరే.

ఓ భూదేవీ! ఎవడు ఒక అధ్యాయమందలి నాల్గవ భాగమును నిత్యము పారాయణము చేయునో, అతడు ఒక మన్వంతర కాలము (ఉత్కృష్టమగు) మానవ జన్మను బొందును.

******************************************************************************************* 4

గీతాయాః శ్లోక దశకం
సప్త పంచ చతుష్టయమ్‌,
ద్వౌత్రీనేకం తదర్ధం వా
శ్లోకానాం యః పఠేన్నరః.

చంద్రలోక మవాప్నోతి
వర్షాణా మయుతం ధ్రువమ్‌,
గీతాపాఠసమాయుక్తో
మృతో మానుషతాం వ్రజేత్‌.

గీతయందలి పది స్లోకములుకాని, లేక ఏడుకాని, ఐదుకాని, నాలుగుకాని, మూడుకాని, రెండుకాని, ఒకటికాని లేక కనీసము అర్ధశ్లోకమును గాని ఎవడు పఠించునో అతడు చంద్రలోకమునుబొంది అచట పదివేల సంవత్సరములు సుఖముగనుండును. ఇందు సంశయము లేదు. మరియు గీతను పఠించుచు ఎవడు మరణించునో, అతడు ఉత్తమమగు మానవజన్మమును బడయగల్గును.

******************************************************************************************* 5,6

గీతాభ్యాసం పునఃకృత్వా
లభతే ముక్తి ముత్తమామ్‌,
గీతేత్యుచ్చారసంయుక్తో
మ్రియమాణో గతిం లభేత్‌.

అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించుచు ఉత్తమమగు మోక్షముపొందును. 'గీతా - గీతా' అని ఉచ్చరించుచు ప్రాణములను విడుచువాడు సద్గతిని బడయును.

******************************************************************************************* 7

గీతార్థ శ్రవణాసక్తో
మహాపాపయుతోపి వా,
వైకుంఠం సమవాప్నోతి
విష్ణునా సహ మోదతే.

మహాపాపాత్ముడైనను గీతార్థమును వినుటయందాసక్తి కలవాడైనచో వైకుంఠమును బొంది అచట విష్ణువుతో సహా ఆనంద మనుభవించుచుండును.

******************************************************************************************* 8

గీతార్థం ధ్యాయతే నిత్యం
కృత్వా కర్మాణి భూరిశః,
జీవన్ముక్తస్స విజ్ఞేయో
దేహాంతే పరమం పదమ్‌.

ఎవడు గీతార్థమును చింతన చేయుచుండునో, అతడు అనేక కర్మల నాచరించినను, జీవన్ముక్తుడేయని చెప్పబడును. మరియు దేహపతనాంతర మతడు పరమాత్మపదమును (విదేహకైవల్యమును) బొందెను..

******************************************************************************************* 9

గీతామాశ్రిత్య బహవో
భూభుజో జనకాదయః,
నిర్ధూతకల్మషా లోకే
గీతాయాతాః పరమం పదమ్‌.

ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులగు రాజులనేకులు పాపరహితులై పరమాత్మపదమును బొందగలిగిరి..

******************************************************************************************* 10