Pages

Thursday, 10 September 2015

వేమన శతకము 11


చందమెఱిగి మాటఁ జక్కగాఁ చెప్పిన
నెవ్వఁడైన మాఱిఁకేళ పలుకు?
చందమెఱిఁగి యుండు సందర్భమెఱుఁగుము
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||మాట యొక్క సందర్భాసందర్భాలు, అర్థాలు తెలిసి చక్కగా మాట్లాడినచో ఎవ్వరును ఎదురు చెప్పరు. అందుచే నేర్పుతో చక్కగా మృదుమధురంగా మాట్లాడుట నేర్చుకోవలెను. చక్కగా మాట్లాడుట గూడ యొక కళయే గదా!

*******************************************************************************************  101

జననమరణములకు సర్వస్వతంత్రుఁడు కాఁడు
మొదటఁగర్తకాఁడు తుదనుకాఁడు
నడుమఁగర్తననుట నగుబాటుకాదొకొ
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మనుష్యుడు తాను పుట్టుటకుగాని, గిట్టుటకుగాని కర్తగాడు, నడుమమాత్రము కర్త ఎట్లగును. మూర్ఖుడు సర్వమునకు తానే కర్తయని విర్రవీగుచుండును.

*******************************************************************************************  102

తల్లియున్నయపుడె తనదు గారాబము
లామె పోవఁదన్ను నరయరెవరు
మంచికాలమపుడె మర్యాదనార్జింపు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||తల్లి బ్రతికి ఉన్నపుడే మనకు ముద్దు, ముచ్చటలు, గారాబాలు జరుగుతాయి. తల్లిపోయిన తర్వాత ఎవ్వరునూ మనలనుచూడరు. అలాగే మనకాలము బాగుగా యున్నపుడే గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలి.

*******************************************************************************************  103

నీటిలోని వ్రాత నిలువక యున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| నీటిలో వ్రాసిన వ్రాత ఎందుకునూ కొఱగాదు. ఉపయోగము లేనిది. అలాగే మూర్ఖుని స్వభావము మాటిమాటికి మారుతూనే యుంటుంది. మంచి, చెడ్డయని ఆలోచింపదు.

*******************************************************************************************  104

మంచివారు లేరు మహిమీద వెదకిన
కష్టులెందఱైనఁ గలరు భువిని
పసిఁడి లేదుగాని పదడెంతలేదయా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఈ లోకములో ఎంత వెదికినా మంచివారు కనబడరు. కాని చెడ్డవారు చాలా మంది లభ్యమవుతారు. బంగారం దొరకదేమో గాని, బూడిదకు లోటేమిటి?.

*******************************************************************************************  105

జాతులందు మిగుల జాతి యేదెక్కువో?
యెఱుకలేక తిరుగనేమి ఫలమొ?
యెఱుక కలుగువాడె యెచ్చైన కులజుడు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| జాతులలో ఇది యెక్కువ, ఇది తక్కువయని లేదు, జ్ఞములేని కులమును వెదుకుట నిష్ప్రయోజనము. జ్ఞానరహితుడెందులకూ కొఱగాడు. జ్ఞానవంతుడే గొప్ప కులమువాడు, అనగా జ్ఞానమే అన్ని కులములలోనూ గొప్పదని భావము .

*******************************************************************************************  106

కనఁగసొమ్ములెన్నో కనకంబదొక్కటి
పసులవన్నెలెన్నో పాలొకటియె
పుష్పజాతులెన్నో పూజయొక్కటె సుమీ
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||ఆభరణములు ఎన్ని వున్నా బంగారము మాత్రమొక్కటే! పశువులు ఎన్ని రంగులు, ఎన్ని జాతులలోయున్నా అవి ఇచ్చే పాలరంగు ఒక్కటే! పుష్ప జాతులెన్నియున్నను పూజ మాత్రము ఒక్కటే! పండితులు వేరైనా వారు జెప్పే జ్ఞానము మాత్రము యొక్కటే!

*******************************************************************************************  107

పాలలోనఁ బులుసు లీలతోఁ గలిసిన
విఱిగి తునుకలగును విరివిగాను
తెలియు మనములోన దివ్యతత్త్వము తేట
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||మనకు చెడుసహవాసము వలన చెడుకలుగును, మంచి స్నేహము వలన మంచి అబ్బును. పాలల్లో పులుసు పడితే అది ముక్కలుముక్కలుగా విరిగిపోతుంది. మనోవివేకము కలగాలంటే జ్ఞానసముపార్జన చేయలి. జ్ఞానము వల్ల మనస్సు వికసించును.

*******************************************************************************************  108

మాటలాడవచ్చు మనసుదెల్పఁగలేడు
తెలుపవచ్చుఁ దన్ను తెలియలేడు
సురియబట్టవచ్చు శూరుడుకాలేడు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| సులభంగా యితరులతో మాట్లాడవచ్చునుకాని మనస్సు తెలుసుకొనుట కష్టము. ఇతరులకు సులభంగా, ఉదారంగా సలహాలివ్వగలము కాని స్వయంగా పాటించడం చాలా కష్టమైన పని. ఎవరైనను కత్తి పట్టవచ్చునేమో కాని శూరులు కాలేరు గదా! గొప్ప విద్వాంసునిగా నటించగలడేమో కాని మూర్ఖుడు జ్ఞాని కాగలడా? (కాలేడుయని అర్థము).

*******************************************************************************************  109

తఱచు కల్లలాడు ధరణీశులిండ్లలో
వేళవేళ లక్ష్మి వెడలి పోవు
నోటికుండలోన నుండునా నీరంబు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| అసత్యములాడినచో రాజులైనా సరే వారియిండ్లలో సంపద నశించిపోతుంది. చిల్లికుండలో నీరు నిలువదు గదా! కనుక అసత్యములాడరాదు.

*******************************************************************************************  110