Pages

Thursday, 10 September 2015

వేమన శతకము 14

నిజములాడునతడు నిర్మలుఁడైయుండు
నిజమునాడునతడు నీతిపరుడు
నిజము పల్కకున్న నీచచండాలుడు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||నిజము జెప్పువాడె నిజమైన ఆత్మశుద్ధికలవాడు. వాడే అసలైన నీతిపరుడు. నిజము పల్కనివాడు నీచచండాలుడే. కాని జాతిచే నీచచండాలుడు కాడు.

*******************************************************************************************  131

సాధనంబు లేక సమకూడదేదియు
బోధలేని విద్య పొందదెపుడు
పాదుకొల్పిమదిని భావించి చూడరా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| అభ్యాసము కూసువిద్య. అలాగే సాధనమున పనులు సమకూరును. గురుబోధలేని విద్య లాభించదు. మనస్సునందు దేవుని నిల్పి ధ్యానించువాడే యోగ్యుడు.

*******************************************************************************************  132

అడుగకర్థమిచ్చునతడు బ్రహ్మజ్ఞాని
అడుగనర్థమిచ్చునతఁడు త్యాగి
అడుగనీయలేని యతడు పెనులోభి
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| అడుగకుండ ధనసహాయము చేయువాడు బ్రహ్మజ్ఞాని. అడిగినయంతనే ఇచ్చువాడు త్యాగియనబడును. అడిగిననూ యివ్వనివాడు పిసినారియని భావము.

*******************************************************************************************  133

పతకమందు నొప్పు పలురత్నముల పెంపు
బంగరందు కూర్ప బరువు గనును
గాని యితరలోహమైన హీనముగాదె
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| బంగారు పతకములలో పొదిగినపుడు రత్నముల విలువ తెలియును. అంతియే కాని యితర లోహములలో పొదిగినపుడు తెలియదు. హీనముగానుండును. అలాగే దుర్జన సజ్జనుల మైత్రి కూడ యిట్లేయుండును.

*******************************************************************************************  134

ఇంద్రియముల చేత నెగ్గొందు చుండెడు
వెఱ్ఱిమనుజుడెల్ల వెదకు శివుని
ఇంద్రియముల రోసి యీశుని జూడరా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఇంద్రియ నిగ్రహము లేక మూర్ఖుడు భగవంతుని వెదుకును. ఇంద్రియ నిగ్రహము కలవాడు భగవంతుని దర్శించును. భగవంతుడు మనలో కూడా కలడని తెలిసికొన్నవాడే జ్ఞాని.

*******************************************************************************************  135

ఉన్నదానిని గను మూపిరి బిగగుట్టి
కన్నుమూసి యేమి కానలేవు,
విన్నదన్నదెఱుక విజ్ఞానమని నమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మనలో నున్న దైవాత్మను ముందుగా తెలుసుకొనుటకు ప్రయత్నించాలి. అంతియేకాని వ్యర్థముగా కన్నులు మూసుకొన్నంత మాత్రాన మనకేమి కనుబడదు. జ్ఞానచక్షువులతో వీక్షించినపుడే ఆత్మను తెలిసికొనగలము. విజ్ఞానమే అన్నింటికి మూలాధారమని తెలియుము.

*******************************************************************************************  136

శ్రవణపుటములున్న సార్థక్యమేమిరా
వినగవలయుఁబెద్ద లనెడి వన్ని
వినఁగ వినఁగ నీకె విశదములౌసుమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| పెద్దలు చెప్పినమాటలు వినటం వలన మన చెవులకు గౌరవమబ్బును. జ్ఞానులు చెప్పింది జాగ్రత్తగా వినినపుడె మనము కూడా జ్ఞానులమవుదుము. కావున చెవులున్నందుకు మంచిని వినుట నలవర్చుకోవాలి.

*******************************************************************************************  137

చదువు చదువనేల? సన్యాసి కానేల?
షణ్మతములజిక్కి చావనేల?
అతను భజన చేసి యాత్మలోఁదెలియుడి
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| చదువులన్నీ జదివి వేదాంతియై సన్యాసిగా శ్రమపడుట కంటె నిరాకార భగవంతుని సేవించి ఆత్మజ్ఞానియై ముక్తిపొందుట మేలు.

*******************************************************************************************  138

మాల మేలు గుణము మంచిది కల్గిన
మాల కూడు గుడుచు మనుజు కంటె
గుణము మేలుకాని కులమేమి మేలురా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మాలవానిలో మంచి గుణమున్ననూ గొప్పవాడె! గుణము మంచిది కావలెగాని కులముతో బనియేమి? మాలకూడు తిన్న మనుజుని కంటెను ఉత్తముడైన మాలవాడె గొప్పవాడు.

*******************************************************************************************  139

విన్న సుద్ది కొంత విననిసుద్దులు కొన్ని
వింత సుద్దులెన్నో వినఁగఁ జెప్పు
దాను గన్నయట్లే దాంభికుడెప్పుడు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| డాంబికుడు తాను విన్నవి, విననివి,వింతయైనవి యెన్నో నీతులు చెబుతాడు. కాని నిజముగా అతనికేమీ తెలియదు. తెలిసినట్లే నీతులు వల్లిస్తాడు.

*******************************************************************************************  140