Pages

Thursday, 10 September 2015

వేమన శతకము 5

గొడ్డుటావుఁ బితుకఁ గుండఁ గొంపోయినఁ
బండ్లు రాల దన్నుఁ బాల నీదు
లోభి వాని నడుగ లాభంబులేదయా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| అసలే అది వట్టిపోయిన ఆవు, దాని పాలు పితుకుటకై ఒక బుద్ధిమంతుడు పెద్ద కుండ పుచ్చుకుని బయలుదేరెను. ఆ కుండనిండ పాలిచ్చునని వాని యాశ. కాని పితుకుటకై కూర్చుండగానే పాలనియ్యలేదు సరిగదా! పండ్లు రాలునట్లు తన్నెను. ఇట్లే లోభివానిని (పిసినారిని) అడిగి ఏదో సంపాదించుకొందమని ప్రయత్నించినచో పైసలు దక్కకపోగా పరాభవము మిగులును.

*******************************************************************************************  41

మేక కుతుక బట్టి మెడచన్ను గుడువగా
ఆకలేల మాను నాశగాక
లోభివాని నడుగ లాభంబులేదయా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మేక కంఠమును బట్టుకొని మెడక్రింద వ్రేలాడుచున్న చన్ను బట్టి కుడుచుకొన్నను పాలేమి వచ్చును? వట్టి ఆశయే గాని ఆకలేమి తీరును? అట్లే పిసినారి వానిని పదేపదే అడిగినను లాభమేమున్నది? వాడిచ్చునా? పెట్టునా? వట్టి శ్రమయేమిగులును.

*******************************************************************************************  42

పెట్టిపోయలేని వట్టినరులు భూమిఁ
బుట్టనేమి వారు గిట్టనేమి?
పుట్టలోనఁ జెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఎవ్వరికిని అన్నము పెట్టలేరు, త్రాగుటకు మంచినీరైన ఇవ్వరు. అట్టి వ్యర్థులైన మనుష్యులు భూమిమీద పుట్టినందు వలన నేమి ప్రయోజనము? చచ్చినంతమాత్రమున భూమి కేమి నష్టము? పుట్టలలో చెదలు పుట్టుచున్నవి చచ్చుచున్నవి. వాని వలన ఎవ్వరికేమి ప్రయోజనమున్నది?

*******************************************************************************************  43

ఆశచేత మనుజు లాయువు గల నాళ్ళు
తిరుగు చుండ్రు భ్రమను ద్రిప్పలేక,
మురికి కుండ యందు ముసరు నీగలభంగి
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మనుష్యులు ఈ శరీరము శాశ్వతమను భ్రాంతిచేత కోరికలకు లోనై, అవి తీరుటకై మురికి కుండ మీద ముసరు ఈగలవలె బ్రతికియున్నన్ని నాళ్ళను తాపత్రయపడు చుందురు. దానివలన ఏ కొంచెమో తృప్తి కలిగినను బ్రతుకునకు పరమార్థము కలుగదు.

*******************************************************************************************  44

నీళ్ళలోన మీను నెర మాంస మాశించి
గాలమందుఁ జిక్కు కరణి భువిని
ఆశఁ దగిలి నరుడు నాలాగు చెడిపోవు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| నీళ్ళలోని చేప ఎరగా బెట్టిన మాంసపు ముక్కపై ఆశపడి గాలమునకు తగులుకొనును. అట్లే భోగము లాశించి మానవు డాశల గాలమునకు జిక్కుకొని అందులోనే జీవితమును వెళ్ళబుచ్చును. కాని జీవితమునకు పరమార్థమైన భగవధ్యానము నందు బుద్ధి నిలుపడు. అనగా అశాశ్వతములైన భోగముల కాశంచి శాశ్వతమైన మోక్షసుఖములపై దృష్టి నిలుపక బ్రతుకు వ్యర్థము చేసికొనునని భావము.

*******************************************************************************************  45

ఆశపాపజాతి యన్నింటి కంటెను
ఆసచేత యతులు మోసపోరె?
చూచి విడచు వారె శుద్ధాత్ములెందైన
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| లోకములో అన్నింటికంటెను ఆశ చాల చెడ్డది. ఆ యాశతోనే పూర్వము మునులెందరో భ్రష్టులై తపములు గూడ పాడుచేసికొనిరి. అట్లు కాక అన్నియు చూచుచు గూడ వానియందు వాంఛలేక నిర్లిప్తులై పరిత్యజించువారే మహాత్ములు. "త్యాగేనైకే అమృతత్వ మానశుః" అని శ్రుతి. పరిత్యాగము చేతనే మోక్షము నొందగలరని దీని యర్థము.

*******************************************************************************************  46

అన్నిదానములను నన్నదానమె గొప్ప
కన్న తల్లికంటె ఘనము లేదు
ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| అన్నిదానములకంటెను అన్నదానము గొప్పది. ఏది పెట్టినను నరుని తృప్తి పరచలేము. కాని అన్నము పెట్టి "తృప్తోస్మి" అనిపించగలము. కన్న తల్లికంటె గొప్పది ఏదియు భూమిమీద లేదు. ధర్మరాజును యక్షుడు "భూమి కన్నను బరువైన దేది?" అని యడుగగా అతడు "నవమాసములు మోసి, ప్రసవవేదన పడి, మనకు ధర్మాచరణమునకు యోగ్యమైన దేహమునిచ్చిన తల్లికెంటెను బరువైనది పృథిలో లే" దని సమాధానమిచ్చెను. అందుకే "న మాతుః పరదైవతమ్‌" అని సూక్తి. అనగా తల్లిని మించిన గొప్ప దైవము వేరే లేదని యర్థము. ఇంక గురువు: తల్లి దేహమునిచ్చును. గురువు విజ్ఞానమును , వివేకమును ఇచ్చును. ఇవి మానవుడైన వాని కత్యవసరము.అందుచేతనే "గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్పరం బ్రహ్మ" అని గురువే పరదైవతముగా చెప్పబడెను". నగురో రధికం, న గురో రథికం, (గురువు కంటే అధికుడు లేడు) .

*******************************************************************************************  47

ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి
గోచి బిగియగట్టి గుట్టు దెలిసి,
నిలిచి నట్టివాడె నెఱయోగి యెందైన
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఆశలన్నింటిని త్రెంచుకొని, కామక్రొధములనెడి అగ్నిని చల్లార్చుకొని, ( అనగా వానిని తలయెత్తనీయక) ఇంద్రియ నిగ్రహము గలిగి బ్రహ్మచర్యము నవలంబించి, యీ దేహ ప్రాణములకు కారణభూతుడైన పరమాత్మరహస్యమును దెలిసికొని స్థిరచిత్తముతో నిలిచినవాడే పరిపూర్ణుడైన యోగి. చిత్తమునకు చాంచల్యము సహజము. దానిని నిగ్రహించిన వాడే పరమయోగి. " యోగశ్చిత్త వృత్తి నిరోధ" అని పతంజలి యోగశాశ్త్రము.

*******************************************************************************************  48

కనకమృగము భువినిఁ గద్దు లేదనకయె
తరుణివిడిచి చనియె దాశరథియుఁ
దెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| బంగారు లేడి యన్నది భూమిపై ఉండునా ఉండదా యను విచారణము చేయకుండ రాముడు సీత కోరిక తీర్చుటకై ఆమెను విడిచి లేడివెంట బడిపోయి కష్టాలు తెచ్చికొనెను. భూతభవిష్యద్వర్తమాణములు దేవునికి తెలియునందురుగదా! ఆ తెలివి లేని రాముడు దేవుడెట్లయ్యెను? (ఇది లోకమునకు సామాన్యముగా కలుగు ప్రశ్న. తత్త్వము విచారించినవో ఆ సంఘటన మంతయు ఆ దేవుని సంకల్పమే. దేవీభాగవతములో, "త్రిమూర్తులు కూడ ఆ మహాదేవి యాజ్ఞకు లోబడి సంచరించువారే. ఆమె మాయచేత మోహితులే. అందుకే విష్ణువు అవతారమెత్తవలసి వచ్చినది" అని చెప్పబడినది. ఆమె మాయచేతనే రాముని కా లేడిని జూడగానే తేవలెనని కోర్కె పుట్టినది. అంతమాత్రమున రాముడు జ్ఞానము లేనివాడనుటకు వీలులేదు.)

*******************************************************************************************  49

చచ్చిపడిన పశువు చర్మంభు కండలు
పట్టి పెరికి తినును బరగ గ్రద్ద
గ్రద్ద వంటివాడు గజపతి కాడొకో!
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| చచ్చిపడియున్న పశువు యొక్క చర్మమును పీకుకొని, మాంసము దినుటకు గ్రద్ద సిద్ధపడును. అట్లే దుర్మార్గుడైన గజపతిరాజు కూడ ప్రజలను పీకుకొని తినుచున్నాడని భావము.

*******************************************************************************************  50