Pages

Thursday, 10 September 2015

వేమన శతకము 8

ఎన్నిచోట్లఁ దిరిగి యేపాటు పడినను
అంటనీయక శని వెంటఁ దిరుగు
భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఎన్నిచోట్ల తిరిగినను, ఎన్ని శ్రములు పడినను, ఏలినాటి శని పట్టినప్పుడు మనకేమియు లాభించకుండ చేసి ఆ శని మన వెంటనే తిరుగుచుండును. దేశములు మారవచ్చునుగాని సుఖదుఃఖముల ననుభవించు మనుష్యులు మారరుగదా! అందుచే ఆ శనిదేవుడు కలిగించు సుఖములో దుఁఖములో వారు అనుభవించియే తీరవలెను.

*******************************************************************************************  71

కర్మ మెప్పుడైనఁ గడచిపోవగరాదు
ధర్మరాజుఁదెచ్చి తగని చోటఁ
గంకు భట్టుఁజేసెఁగట కటా దైవంబు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మనుజుడు తాను చేసికొన్న కర్మముల ఫలము నెప్పుడైనను అనుభవించి తీరవలసినదే. అది తప్పించుకొనుటకు శక్యముకాదు. ధర్మరాజును దెచ్చి అతని కర్మఫలమనుభవించుటకై దైవము అతని కంటె అల్పుడైన విరాటరాజు దగ్గర సేవచేయుటకు కంకుభట్టుగా నిలిపినాడు గదా!.

*******************************************************************************************  72

అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచెమైన నదియుఁగొదువ కాదు
కొండ యద్దమందుఁ గొంచెమై యుండదా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| సమయము, సందర్భము తనకు అనుకూలముగా లేనిచోట తన గొప్పతనమును చాటుకొనుటకు ప్రయత్నించి నగుబాటు నొందకూడదు. కొంచెము తగ్గి ప్రవర్తించినంత మాత్రముచేత చిన్నతనము రాదు. పెద్దదైన కొండ అద్దమునందు చిన్నదిగానే కనిపించును. అంతమాత్రము చేత దాని ఘనత మాసిపోవునా?

*******************************************************************************************  73

ఇమ్ము దప్పువేళ నెమ్మెలన్నియు మాని
కాలమొక్కరీతి గడుపవలయు
విజయుడిమ్ము దప్పి విరటుని గొలువడా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| సమయము అనుకులముగా లేనప్పుడెంత వారైనను ఆడంబరములు ప్రదర్శించక ఏదో ఒక రీతిగా కాలము గడుపవలెను. లేనిచో కష్టములు పరిహాసములు ఎదురగును. అర్జునుడంత మహాపరాక్రమవంతుడు కూడ కాలము కలిసిరాక విరటుని కొలువులో పేడిరూపముతో బ్రతుకలేదా?

*******************************************************************************************  74

చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్క కుక్క కఱచి బాధ పెట్టు
బలిమి లేనివేళ పంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఆకలితోగాని, రోగముతోగాని సింహము బలహీనమై పడియున్నచో ఒక బక్క చిక్కిన పనికిమాలిన ఊరకుక్క కూడా దానిని కఱచి బాధించును. అది లోకములోని తీరు. ఆర్థికముగాగాని, మరొక విధముగాగాని బలహీనుడైన సమయములో పౌరుషము కోసము పోయి చేతులు కాల్చుకొనుట అవివేకము. తన పౌరుషము చెల్లదని గ్రహించి ఊరుకున్న వాడు బుద్ధిమంతుడని భావము.

*******************************************************************************************  75

లక్ష్మియేలినట్టి లంకాపతి పురమ్ము
పిల్లకోతి పౌజు కొల్లఁబెట్టె
చేటు గాలమయినఁ జెరుప నల్పులెచాలు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఒకనాడు లక్ష్మికి (సంపదలకు) నివాసమైన రావణాసురుని లంకాపురమును అల్పములైన కోతి మూకలు కొల్లగొట్టి నాశనము చేసెను. చేటు కాలము దాపురించినప్పుడు నాశనము చేయుటకు అల్పజనులు చాలు. పెద్ద బలవంతులు అక్కరలేదు.

*******************************************************************************************  76

మొదట నాశపెట్టి తుది లేదు పొమ్మను
పరమలోభులైన పాపులకును
ఉసురు తప్ప కంటు నుండేలు దెబ్బగా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మొదట ఎంతో ఇచ్చెదనని యాశపెట్టి చివరికి మొండిచేయి చూపు పిసినిగొట్టు పాపాత్మునకు, నిరాశపడిన వారి శాపము తప్పక తగులును. ఆ తగులుట కూడ ఉండేలు బద్దనుండి వెలువడిన రాయి యెంతవేగముగా గట్టిగా తగులునో అట్లు ఆ శాపము తగులును. అందుచేత దానమిచ్చు ఉద్దేశ్యము లేనపుడు ముందు వాగ్దానము చేయకూడదు.

*******************************************************************************************  77

ఇచ్చువాని యొద్ద నీని వాడుండెనా
చచ్చుఁగాని యీవి సాగనీడు
కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఎప్పుడును ఎవ్వరికిని దానమిచ్చుటే యెరుగని మహాలోభులుందురు. వారు దానమిచ్చినచో ప్రాణము పోయినట్లు భావింతురు. అట్టివారు ఒక దాత దగ్గర నున్నచో ఆ దాతను గూడ దానమియ్యనీయక అడ్డుపడుదురు. గచ్చపొద విస్తరించి ముండ్లతో అడుగు పెట్టలేనిదిగానుండును. అదియొక కల్పవృక్షము క్రింద నున్నచో, తానెవ్వరికిని పనికిరాదు; కల్పవృక్షమును గూడ ఎవ్వరికిని ఉపయోగపడనియ్యదు. (గచ్చకాయ విషమందురు).

*******************************************************************************************  78

అరయ నాస్తి యనక యడ్డుమాటాడక
తట్టుపడక మదిని దన్నుకొనక
తనది గాదనుకొని తాఁబెట్టునదె పెట్టు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| యాచకుడు తన్ను అడుగవచ్చినపుడు లేదనకుండ, తొట్రుపడకుండ ఇత్తునా? మానుదునాయని మనసులో గుంజాటన పడకుండ, ఇచ్చెడి వస్తువుమీద మమకారము విడిచి దానమిచ్చినచో ఆ దానము కోటిగుణితమగును.

*******************************************************************************************  79

ధనముఁగూడఁబెట్టి దానంబు చేయక
తానుఁదినక లెస్స దాచుకొనును
తేనె నీగ కూర్చి తెరువరి కియ్యదా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఎవ్వరికిని దానధర్మములు చేయక, పోనీ, తానైనను అనుభవించక పదిముళ్ళు వేసి దాచుకొన్నచో అది ఇతరుల పాలగును. అనగా రాజైనను టాక్సుల రూపమున తీసికొనిపోవును. లేదా ఏ దొంగైనను దోచుకొనిపోవుదురు. తేనెటీగలు చాల కష్టపడి పువ్వుపువ్వునకును తిరిగి తేనెను సంపాదించి తాము తినకుండా దాచుకొనును. దాని నెవ్వడో దారిని బోవువాడు చూచి తేనె టీగల నదలించి తేనెను కొల్లగొట్టుకొని పోవునుగదా!.

*******************************************************************************************  80