హోలీవిశేషాలు… (Holly Special)
ఎరుపు కోపానికి చిహ్నం. ఆకుపచ్చ అసూయకు సంకేతం. పసుపు ఆనందానికి గుర్తు.
గులాబీ రంగు ప్రేమకు చిహ్నం. నీలం విస్తృతికి గుర్తు. తెలుపు శాంతికి, కాషాయం
త్యాగానికి, ఊదారంగు జ్ఞానానికి సంకేతం. ప్రతి మనిషీ ఓ ఇంద్ర ధనుస్సు. ప్రకృతి నిరంతరం
ఎలా మార్పులకు లోనవుతుందో మనిషి భావోద్వేగాలు కూడా అలాగే నిరంతరం
మారుతూ ఉంటాయి. మంచి భావాలు నిండిన వ్యక్తి మంచి రంగులు నింపుకొన్న
రంగవల్లికలా తేజోపుంజమై వెలుగొందుతాడు.
ప్రకృతి ఆరాధన లేని హిందువుల పండగలు ఉండవంటే అతిశయోక్తి కాదేమో! ప్రకృతి
ఆరాధనను మేళవించి జరుపుకొనే పండగలలో హోలీది ప్రత్యేక స్థానం. యువతీ
యువకులందరూ హుషారుగా పాటలు పాడుకుంటూ ఆనంద నృత్యం చేస్తూ వసంతానికి
స్వాగతం పలుకుతూ ఈ ఉత్సవాన్ని జరుపుకొంటారు. ఏదో ఒక ప్రాంతానికి, ప్రదేశానికి
పరిమితం కాకుండా దేశమంతటా ఆనంద నృత్యంలా సాగే సంప్రదాయ కేళి… హోళి
పండగ.
చలికి, పొగమంచుకు వీడ్కోలు చెప్పి, వెచ్చదనాన్నిచ్చే వసంతానికి స్వాగతం పలికే పండగే
ఈ హోలీ ఉత్సవం. మొఘల్ పరిపాలనా కాలంలో హోలీ పండగ హిందువులు, ముస్లింల
మత సమైక్యతకు సంకేతంగా జరుపుకొనేవాళ్లని చరిత్రకారులు చెబుతున్నారు. ఏటా
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని జరుపుకొంటాం. ఫాల్గుణ పూర్ణిమని
‘హోళికాపూర్ణిమ’ అనీ, ‘మహా ఫాల్గుణి’ అని వ్యవహరిస్తారు. 14 మన్వంతరాల్లో ఒకటైన
బ్రహ్మ సావర్ణి మన్వంతరం ఈ రోజే ప్రారంభమయిందని పురాణాలు చెబుతున్నాయి.