Pages

Sunday, 24 March 2013

సంస్కృతి, సంప్రదాయం, సంస్కారం అనే మూడు మహోన్నతమైన పదాలు. నా వివరణ…. (samskruthi,sampradayam,samskaram)

సంస్కృతి, సంప్రదాయం, సంస్కారం అనే మూడు మహోన్నతమైన పదాలు. భారతీయ మానవ జీవన వికాసానికి, అభ్యున్నతికి, శుభప్రదమైన, సుఖవంతమైన, ఆదర్శప్రాయమైన నాగరికతకు, జీవం, జీవం కలిగించే ప్రాణాధారమైన పట్టుగొమ్మలు. ఆలోచనాత్మకమైన అనుసరణే, అనుకరణే సంస్కార చిరునామాలని విజ్ఞులు సెలవిస్తారు. సంస్కృతి ఒక జాతి ఉన్నతిని నిర్దేశిస్తే.. సంప్రదాయం ఆచార వ్యవహారాలను, దిశాదశలను అనుసరించేలా చేస్తాయి. సంస్కారం వ్యక్తిగతమైన ఉన్నత భావాలను, మహోన్నత లక్షణాలను ఆవహింపచేస్తూ తద్వారా కుటుంబ పురోభివృద్ధికీ, సమాజ పురోగతికి పరమ పవిత్రమైన, అధిరోహింపవలసిన సోపానాలను సమకూరుస్తాయి.
సంస్కారం. సంస్కరింపబడుట అనే అర్థాన్ని యిస్తున్నప్పటికీ, రుూ శబ్దాన్ని అనేకమంది అనేక అర్థాలలో ఉపయోగిస్తున్నారు. మానవుని శారీరక, మానసిక కౌటుంబీయ, సామాజిక సమగ్రత వికాసాన్ని కలిగించే ప్రక్రియనే ‘సంస్కారం’ చెప్పవచ్చు. ఒక వ్యక్తికి అద్భుతమైన, అమేయమైన, అలౌకికమైన, అనిర్వచనీయమైన, గుణగణాలను శక్తులను సంపాదించి పెట్టేదే సంస్కారం. ఫలితంగా మలిన భావాలు, వికృతిక విచారాలు, దోష గుణాలు, కళంక ప్రవర్తన అంతరించి ప్రకాశవంతమైన అమలిన ఆనందాన్ని కలిగిస్తుంది. ధార్మిక, సామాజిక, రాజ్య దేశ పురోభివృద్ధికి, ఐక్యతకు నిస్సందేహంగా కారణభూతవౌతుందని చెప్పవచ్చు.
వ్యక్తి యొక్క శ్రేయస్సు, వికాసం, అభివృద్ధి కలిగించుట సంస్కార ప్రధానోద్దేశం. తద్వారా కుటుంబ కళ్యాణం, తద్వారా సమాజాభివృద్ధి తద్వారా బంధుమిత్ర సపరివారములలో సహవాస, సంతోష, సామరస్య భావనలు వెల్లివిరిసి నిత్యకళ్యాణ, పచ్చతోరణ భావన అనుభవేక వేద్యవౌతుంది. మంచి భావాన్ని, మంచి ఆలోచనలను మంచి నడవడికను, మంచి ప్రవర్తనను ఆవహింపజేసి, సుస్థిరపరచి, ఆచరింపజేసే ప్రక్రియ సంస్కారవౌతుంది. సార్వకాలీన, సార్వజనీనతను, వసుధైకకుటుంబ భావనను, జాతీయ సమైక్యతా సదాలోచనను ప్రోది చేసేది సంస్కారము మాత్రమే! సంస్కారములను గురించి వేద సూక్తములలో, ధర్మసూత్రములలో, గృహ్య సూత్రములలో, బ్రాహ్మణికములలో పురాణాలలో వివరించబడి భారతీయ సంస్కృతిని, సంస్కార భావనా పరిమళాలను ఏనాడో ప్రపంచానికి పంచి పెట్టి ప్రసిద్ధమయ్యాయి. సంస్కారములను లాక్షణికులు నిర్వచిస్తూ, త్రివిధ, పంచ, షట్ సంస్కారములని, దశవిధ, షోడశ సంస్కారములను వివరించారు. వేగము, భావన, స్థితిస్థాపకములను మూడు మానసికమైన ‘త్రివిధ’ సంస్కారములన్నారు. తాపము, పుండ్రము, నామము, మంత్రము, వైష్ణవేష్టిలను పంచ సంస్కారములని ప్రవచించారు. అగ్నిహోత్రమున తాపనము, పవిత్రీకరణము, అభిధ్యాపనము, ఉత్పవనము, సంప్లవము, సమిధలను షట్ సంస్కారములని సెలవిచ్చారు.
‘సత్సంగత్వే నిస్సంగత్వం’- పూవులతోకూడిన నారకు కూడా వాసన అబ్బినట్లు.. సజ్జన సహవాసము, మంచి వారి సాన్నిహిత్యము వలన మంచి సంస్కారములు అలవడుతాయి. తల్లి మొట్టమొదటి జన్మ సంస్కార ప్రదాత అయితే.. నామకరణం అన్నప్రాశనం, కేశఖండనం, అక్షరాభ్యాసం ఉపయనయనం చేయించే తండ్రి రెండవ సంస్కార ప్రదాత అవుతారు. సంస్కార బీజములు పాదుకొలిపిన తల్లిదండ్రుల తరువాత చదువు సంధ్యలు నేర్పించే గురువు తృతీయ సంస్కార ప్రదాత అని చెప్పవచ్చు. అప్పటికే పెరిగి పెద్దదైన సంస్కార వృక్షానికి సుగంధ భరితమైన కుసుమాలను, మధురాతి మధుర ఫలాలను కాయించేవారు హితులు, సన్నిహితులు, స్నేహితులు! ఇలా సంక్రమించిన సంస్కారాలు ఎన్నటికీ వనె్న తరగని ఆస్తిపాస్తులు. ఇవి తరము నుండి మరొక తరమునకు తరతరాలుగా సంక్రమించితే ప్రతీ తల్లి ఒడి, వీధి ఒడి, గ్రామానికి గుడి సంస్కార కేంద్రాలుగా మారిపోతే రుూ సమాజమే నందనవనవౌతుంది.