Pages

Monday, 1 April 2013

కార్యదీక్షా పరుడే హిందువు


హిందువన్న మాట వినడంతోనే నీలో ఎక్కడ లేని శక్తి 

ఆవిర్భవించి నిన్ను సర్వ సమర్ధుడ్ని చెయ్యాలి. అప్పుడే 

నీవు నిజమైన హిందువు. 

ఏ దేశానికి చెందిన హిందువైనా, ఏ భాష 

మాట్లాడేవాడైనా నీకు బహి:ప్రాణం కావాలి.  అప్పుడే 

నీవు నిజమైన హిందువు.



ఏ హిందువు కష్టస్థితి అయినా నీ హృదయాన్ని కరిగించి, నీ కన్న కొడుకే కష్టంలో ఉన్నట్లు నీ చేత భావింప చెయ్యాలి. అప్పుడే నీవు నిజమైన హిందువు.

అంతేకాదు, హిందువుల కోసం ఆ మహాత్ముడు గురుగోవిందసింగు వలె ఎటువంటి కష్టాన్నైనా భరించగలగాలి. హిందూ ధర్మ సంరక్షణ కోసం తన నెత్తురు ధారపోసి, యుద్ధ భూమిలో కన్నబిడ్డల చావును కళ్ళారా చూసి, ఎవరి కోసం తానీ త్యాగం చేశాడో వాళ్ళే తన్ను విసర్జించి వెయ్యగా, దెబ్బతిన్న సింహమై ఆ మహానుభావుడు, తన ఎడల కృతఘ్నులై, తన్ను పరిత్యజించిన తన వాళ్ళను పల్లెత్తు మాటైనా అనకుండా, ప్రశాంతంగా కార్యరంగం నుండి ఉపసంహరించుకుని దక్షిణానికి వెళ్ళిపోయి అక్కడే చనిపోయాడు. ఆ ఉత్తమోత్తమ సహనశీలమే నీకు లక్ష్యం కావాలి. అప్పుడే నీవు నిజమైన హిందువు. 

దేశ సేవా కాంక్ష ఉన్న ప్రతి వ్యక్తీ గురుగోవిందసింగు కావాలి. సోదర దేశీయులలో సహస్రాధిక దోషాలు ఉండవచ్చు. అయినా వాళ్ళు హిందువులన్న సంగతి మరచిపోకూడదు. వాళ్ళు నిన్ను నానా యాతనలూ పెట్టినా సరే, వాళ్ళే నీకు ముందు పూజింపదగిన దేవతలు. ఎవరెన్ని శాపాలు పెట్టినా నీవు వారిని ప్రేమతో ఆశీర్వదించగలగాలి. వాళ్ళు నిన్ను తరిమివేస్తే ఆ మహా నాయకుడు గోవిందసింగు వలె మౌనంతో మరణించడానికి కూడా సిద్ధపడాలి. అట్టి కార్యదీక్షా, సహనశక్తీ ఉన్నవాడే, హిందువు అనిపించుకోవడానికి అర్హుడు.  ఆ ఔన్నత్యాన్ని అందుకోవడమే మనకెల్లప్పుడూ లక్ష్యమై ఉండాలి.  

పరస్పర వైమనస్యాలు పారద్రోలి ఈ మహత్తర ప్రేమ ప్రవాహాన్ని సర్వదిశలా వ్యాప్తం చేద్దాము.

కార్యకర్తలారా.. 

ధీమంతులై, ధైర్యవంతులై సముద్రాలు ఈదడానికి సిద్ధపడుతూ, మృత్యుగహ్వరంలోకి దూకే సాహసం గల, ఉత్సాహవంతులైన యువకులు కావాలి. అట్టివాళ్ళు వందల కొలదీ కావాలి. ఆ లక్ష్య సిద్ధికి మీ శక్తినంతా ఉపయోగించండి. అసంఖ్యాకంగా యువకుల నాకర్షించి ఉత్తేజపరిచి మన పవిత్రీకరణ యంత్రంలో పెట్టండి. పవిత్ర హృదయాలతో పట్టుదల వహించి, వేరు వేరు చోట్ల కేంద్రాలు స్థాపించి కార్యసాధకులను సమకూర్చండి.