Pages

Sunday, 28 April 2013

యోగానికి అష్టాంగాలు (ఎనిమిది సాధనాలు) ఉన్నాయి.


యోగం అనే మాటకు ఆసన, ప్రాణాయామాలు అనే కొత్త అర్థం మాత్రమే ఈనాడు స్థిరపడిపోయింది. యోగానికి అష్టాంగాలు (ఎనిమిది సాధనాలు) ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి.       

యోగం అనే మాటకు కలయిక అని అర్థం. ‘జీవాత్మ పరమాత్మతో కలిసే ప్రక్రియనే యోగం అంటారు’ అని యాజ్ఞవల్క్యుడు మొదలైన మహర్షులు తెలిపారు. జీవాత్మ తనకున్న జీవలక్షణాన్ని వదిలిపెట్టి పరమాత్మలో ఐక్యం చెందే మహోన్నతిస్థితి యోగం.
యోగసాధన అత్యున్నతమైనదని మహర్షులు చెప్పారు. ఎన్నో వికారాలతో కూడిన మనసును సాధన ద్వారా లొంగదీసి, చిత్తమాలిన్యాలను తొలగించి, ఆత్మానందం పొందడమే యోగం. అయితే యోగం అనే మాటకు ఆసన, ప్రాణాయామాలు అనే కొత్త అర్థం మాత్రమే ఈనాడు స్థిరపడిపోయింది. యోగానికి అష్టాంగాలు (ఎనిమిది సాధనాలు) ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఈ యోగాంగాలు పతంజలి, యాజ్ఞవల్క్యుడు, ఘేరండ, శివసంహితలు చెప్పాయి. ఇవి నేర్చుకోవడంలో లేదా సాధన చేయడంలో గొప్ప ప్రయోజనం ఉంది. 

మానవుడు శరీరం ద్వారా యోగసాధన చేసి భగవంతుణ్ని పొందాలి. ఆత్మ పరమాత్మోపాసన చేయాలన్నా శరీరమే దానికి సాధనం. శరీర సాధన చేయాలంటే ఆ శరీరాన్ని స్థిరం చేసి, దాన్ని ఆశ్ర యించి ఉన్న మనసును నిశ్చలం చేయాలంటే దానికి మొదట సాధన కావాలి. అందుకే యోగసాధన కన్నా ముందు అష్టాంగయోగం ప్రవేశపెట్టారు ఋషులు. యమ నియమాలు మనిషికి... వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను, సత్ప్రవర్తనను కలుగచేస్తాయి. ఆసన, ప్రాణాయామాలు శరీరాన్ని సాధన కోసం లొంగదీస్తాయి. ప్రాణాయామం ప్రాణశక్తిని ఇచ్చి, లోపల ఉన్న శారీరక మాలిన్యాలను బయటకు పంపిస్తుంది. తద్వారా నాడీ శుద్ధి, శరీర శుద్ధి జరిగి తరవాత చేసే సాధనకు మనసును, చిత్తాన్ని స్వాధీనపరచి, సిద్ధం చేస్తుంది.
ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అంగాలు వ్యక్తి ఆత్మోన్నతికి కావలసిన లక్షణాలను అందిస్తాయి. అయితే ఈ అష్టాంగసాధన తరవాత చేసే సాధన, ఈ సాధన పరమప్రయోజనాన్ని వదిలిపెట్టి కేవలం ఆరోగ్యం కోసం ఆసన, ప్రాణాయామాలను సాధన చేస్తూ, దానికే యోగా అన్న పేరును పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఋష్యాశ్రమాలో, యోగాపీఠాల్లో ఉచితంగా నేర్చుకోవాల్సిన యోగం వ్యాపార వస్తువుగా మారడం ఆశ్చర్యం.