Pages

Sunday, 2 June 2013

శేషత్వమే ఆత్మ యొక్క స్వరూపం




ఓంకారం అంటే అకారం కొరకే మకారం. ఇది మనం ఎక్కడ ఉన్నా, ఏ కాలం అయినా మనం ఓంకారాన్ని తెలుసుకొని ఉంటే జీవుడు జీవుస్తున్నాడు అని అర్థం. లేకుంటే జీవం కోల్పోయాడు అని అర్థం. కోల్పోవడం అంటే ఉండీ గుర్తించకపోవడమే. ఎవడైతే నేను వాడికి చెందినవాడను అని గుర్తింపు లేకుంటా ఉంటాడో, తనకు తానే అని అనుకుంటాడో వాడి అంత పెద్ద దొంగ మరొకడు ఉండడు. దీన్నే ఆత్మాపహారం అని అంటారు. ఆత్మాపహారం  అంటే తనను తానే దొంగిలించుకొనడం. మనం వాడికి చెందిఉండి కూడా చెందిలేము అని అనుకోవడమే, అంటే చెందినవాడికి చెందకుండా చేయడమే దొంగతనం అంటే. ఆత్మ అనేది విలువైనది, అంత విలువైనదాన్ని దొంగతనం చేయడం పెద్ద నేరం. 'కింతేన నకృతం పాపం చోరేన ఆత్మాపహారిణ' అని మహాభారతంలో శకుంతల చెబుతుంది. ఆత్మాపహారం కంటే మరొక చౌర్యం లేనే లేదు అనేది నిర్ణయం.
ఈ ఆత్మ అనేది పరమాత్మకు చెందితేనే ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది.

దాస భూతాః స్వతః సర్వేహి ఆత్మానః పరమాత్మణః
నాన్యదా లక్ష్యణం తేషాం బద్దే మోక్షే తదైవచ
జీవుల్లు పరమాత్మకు దాసులైతేనే ఉనికిని కలిగినవారు అవుతారు. లేక పోతే వాడు ఉన్నట్టు లెక్క కానే కాదు. ఇది ఏదో తెచ్చి పెట్టుకొని చెప్పినది కాదు 'స్వతః' సహజంగానే జీవుల్లు దాసభూతులు. ఏదో కొందరే దాసులు కాదు, 'సర్వేహి' అందరూ దాస భూతులే. కేవలం కర్మ సంపకర్కం వల్ల దాసభూతులమా ? అంటే ఇక్కడున్నా, మోక్షం పొందినా దాసులమే. ఇది మన సహజ లక్షణం. మన శిరస్సును ఆయన వద్ద వంచవల్సిందే.


లోకంలో ఎందరో నేనే పరమాత్మని అన్నవారంతా తిండి, గాలిపై ఆధారపడే బ్రతుకుతున్నారు. తిండి తినక, గాలి పీల్చక ఉండగలిగితే సరే. భగవంతుడికి గాలి పీల్చాలి అని, తిండి తినాలి అని నియమం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ కాలిందీ మడుగులో సర్పంతో ఎన్నో గంటలు పోరాడాడు. ఎంత జల స్థంభన నేర్చినా కొంత సమయం తర్వాత బయటకు రావల్సిందే. ధుర్యోదనుడు కొన్ని రోజులవరకు మాత్రమే ఉండగలిగేవాడు. అది పక్కన పెట్టినా, భగవంతుడు అని చెప్పుకొనే వారు శరీరంపై ఆధారపడి ఉన్నారు. భగవంతుడికి అట్లా శరీరం పై ఆధారపడవల్సిన అవసరం లేదు. కృష్ణ చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. ఆయనెప్పుడూ తన శరీరంపై ఆధారపడలేదు. ఒక నాడు కారు చిచ్చు అంటుకొని గోవులు, గోప బాలురు భయపడుతుంటే ఒక్కసారి ఆ నిప్పునంతా మింగాడు. ఆయనకు నిప్పుకి, సముద్రానికి తేడా లేదు. ఇది గుర్తించాలి.


మనం గుర్తించాల్సింది, మనం చెందింది కేవలం పరమాత్మకే, ఇది తప్ప వేరే ఉనికి అంటూ మనకు లేదు. దీన్నే శేషం అని చెబుతారు. మనం అంతా 'అ' అనే అక్షరం చెప్పే వాడికి శేషం. మనం శేషం అని చెప్పాం అంటే మనలో శేషత్వం అనేది మన ధర్మం. శేషత్వమే ఆత్మ యొక్క స్వరూపం. 'స్వత్వం ఆత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం' అని సంహితలు ఈ మాటని స్థిరపరుస్తున్నాయి. అత్మని వస్తువు అని చెబుతారు, సంస్కృతంలో స్వం అని చెబుతారు, అంటే సొత్తు అని అర్థం. దాని ధర్మం స్వత్వం. ఆ సొత్తు కలవాడిని స్వామి అని అచెబుతారు, అందుకే ఆయన ధర్మం స్వామిత్వం. ఈ ఇరువురి మధ్య ఉన్న సంబంధం స్వ-స్వామి సంబంధం. ఇది ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది. మనం మరిచాం తప్ప, మనం మరచినా ఉంటుంది. ఈ సంబంధం తెగనిది. అందుకే ఆండాళ్ తల్లి 'కఱవైగళ్' పాశురంలో స్వామితో చెబుతుంది. "ఉందన్నో డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు" నీకూ మాకూ ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలగేది కాదు. సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం. మేం వద్దు అనుకునా, నీవు వద్దు అనుకున్నా, ఇద్దరం వద్దు అనుకున్నా, ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు. అట్లానే అకారానికి మకారానికి ఉన్న సంబంధం. ఇదే స్వ-స్వామి సంబంధం. ఉకారం ఇదే అర్థాన్ని స్థిరపరుస్తుంది. ఇదే ఓంకారం యొక్క సారం. దీన్ని మరింత వివరించడానికి మిగతా మంత్రం అంతా వచ్చింది. అకారాన్ని చెప్పడానికి నారాయణ పదం వచ్చింది. ఉకారాన్ని వివరించడానికి 'ఆయ' అనే చతుర్థీ విభక్తి వచ్చింది. మకారాన్ని చెప్పడానికి నమః మరియూ నార అనే పదాలు ఏర్పడ్డవి. ఇందులో ఉండే నారాయణ పదం ఎట్లా ఉంటుందో చెప్పడానికి ద్వయ మంత్రం వచ్చింది. ఇందులో ఉండే నమః పదాన్ని చెప్పడానికి చరమ శ్లోకం ఏర్పడింది. ఓంకారం ఒక్కటి మనం తెలుసుకుంటే అన్ని మనవద్ద ఉన్నట్లే.