నేటి కాలంలో వినయ భూషణులు మచ్చుకైనా కనిపించడంలేదు. నేనూ-నాదనే అహంకారంతో ఆధునిక మానవుడు తన పరిధులను అతిక్రమిస్తున్నాడు. అందుకే సమస్యల వలయంలో చిక్కుకుని బయటపడలేక ఇబ్బందులకు లోనవుతున్నాడు.
వినయవిధేయతలు, చదువు, సంస్కారాలూ ఒకరు నేర్పితే వచ్చేవి కావు. అవి జన్మతః రావలసిందే. పోనీ అలా కాకున్నా చూసైనా నేర్చుకోం. ఎదుటివారి వస్తువాహనాలను చూసి తాము కూడా ఆ మాదిరి వస్తువాహనాలను కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నించడం, విజయంసాధించడం మన చూస్తున్నాం. అలాగే, ఎదుటి వారిలో ఉండే వినయ వినమ్రతలను మాత్రం అనుకరించేందుకు ప్రయత్నించం. పైగా వినయంగా ఉండేవారిని లోకువ కట్టేవారే ఎక్కువ మంది ఉన్నారు. వినయంగా ఉండేవారికి మెతక మనుషులని ముద్ర వేస్తుంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దెబ్బలాడేటట్టు, గద్దించి మాట్లాడటం సంస్కార వంతుల లక్షణం కాదు.
వినయ విధేయతలు ప్రతి మనిషికీ అవసరమే కానీ, మన విధేయత వ్యక్తులకు కాదు, వ్యవస్థకు, సమాజానికీ, దేశానికీ పరిమితం కావాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి గీతోపదేశం పేరిట చెప్పిందిదే. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో యుద్ధ భూమిలో కురుకుల పితామహుడు భీష్మాచార్యుణ్ణీ, సకల విద్యలు నేర్పిన ద్రోణాచార్యుణ్ణీ చూడగానే అర్జునుడు నిశ్చేష్టుడవుతాడు. యుద్ధభూమి నుంచి ఉన్నపళంగా వెనుదిరిగేందుకు సిద్ధపడతాడు. అప్పుడు భగవానుడు అర్జునునికి చేసిన ఉద్బోధే గీత. సర్వకాల సర్వావస్థల్లో మనిషికి ఉపయోగపడే కరదీపిక భగవద్గీత. తరతరాలుగా మన పెద్దలు ఆచరించి, అనుసరించిన మార్గంలోనే మనం కూడా పయనించడం శ్రేయస్కరం.
అర్జునుడికి భీష్మ, ద్రోణాచార్యుల పట్ల వినయవిధేయతలకు కృష్ణ పరమాత్ముడు ఎంతో సంతోషిస్తాడు. పితామహుణ్ణీ, గురువునూ గౌరవించేవారూ, వారిపట్ల వినయ విధేయతలు ప్రదర్శించేవారు ఈరోజుల్లో ఎంత మంది ఉన్నారు? ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎంత సంపాదించుకుంటున్నా పెద్దలను గౌరవించాలన్న సృ్ఫహ కలిగిన వారెంత మంది ఉన్నారు ఈరోజుల్లో? ఇందుకు వారిని తప్పు పట్టనవసరం లేదు. వారికి పెంచి పోషించిన తల్లితండ్రులూ, వారికి విద్యాబుద్ధులు నేర్పించే గురువులూ బాధ్యులు.
మన మాటే మనకు మన్ననను తెస్తుంది. అందువల్ల అనుకరణ అనేది మంచి విషయాలకే పరిమితం కావాలి. వినయ విధేయతలతో ఉండటాన్ని బలహీనతగా పరిగణించ కూడదు. మనిషి వినయవిధేయతలే అతడిని సమాజంలో ఉచ్ఛస్థితిలో నిలబెడతాయి. వినయ విధేయతలు ప్రతి మనిషికి భూషణమే నని నిరంతరం స్పహలో ఉంచుకోవడం సత్పురుషుల లక్షణం