మనిషి దృఢ నిశ్చయానికి ధూమ పానం మానడం ఒక సవాలుగా తయారైంది. ఇతర వ్యసనాలతో పోల్చితే ధూమపానం మానడం వల్ల శరీరంపై మానసిక, శారీరక ప్రతిచర్యల ప్రభావం పడుతుంది. ధూమ పానం మానడానికి చాలా మార్గాలున్నాయి. నికోటిన్ ప్యాచ్‌లు, హిప్నోసిస్, మందులతో మానొచ్చు. సిగ రెట్ తాగడం మానాలని ప్రతీరోజూ ఏదో ఒక విధంగా మనం ప్రయత్నిస్తుంటాం. అయితే ఎలా అంటే.....
ప్రణాళిక
ధూమపానం మానడానికి కచ్ఛితమైన ప్రణాళిక ముఖ్యం. దీనికోసం కొంత సమయాన్ని కేటాయిం చండి. మీరెలాంటి సిగరెట్ తాగేవారో ఆలోచించండి. అంటే చైన్‌స్మోకరా, అప్పుడప్పుడు స్మోక్ చేస్తారా? కేవలం స్నేహితులు కలిసినప్పుడు వారికి కంపెనీ ఇవ్వడానికి స్మోక్ చేస్తారా? అనే అంశాలు రాసు కోవాలి. ఈ సందర్భాల్లో ఎందుకు తాగాల్సి వస్తుందో కూడా పరిశీలించాలి. దీనివల్ల మీరు ధూమపానం మానడానికి ఎలాంటి పద్ధతి అవసరమో తెలుస్తుంది.
వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నికోటిన్ కావాలనే కోరిక తగ్గుతుంది. దీనివల్ల సిగరెట్ తాగాలనే
లక్షణాలు తగ్గుముఖం పడతాయి. మధ్య స్థాయి వ్యాయామం కూడా మేలు చేస్తుంది. పార్కులో నడవడం, పెంపుడుకుక్కతో సాయంత్రం వేళ బయ టికెళ్లడమూ ఓ రకమైన వ్యాయామమే. ధూమపానం మానడంవల్ల బరువు పెరుగుతారు. ఇలా వ్యాయా మం చేస్తే కేలరీలు ఖర్చయ్యి, బరువు తగ్గుతారు.
స్నేహితునికో సవాలు
ధూమపానం మానాలని అనుకోవడం చాలా సులభం. కానీ ఆ మాట నిలుపుకోవడమే కష్టం. కానీ ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. ధూమపానం మానే రోజును నిర్ణయించి, ఒక డెడ్‌లైన్ పెట్టుకోవాలి. కచ్ఛితంగా ఆ రోజు నుంచి సిగరెట్ తాగనని మీ స్నేహి తునితో సవాలు చేయండి. దీనికి మీ స్నేహితుని సహకారం తీసుకోవాలి.
ధూమపానం మానాలి
సిగరెట్లు తాగడానికి ఆల్కహాలు కూడా ఒక విధంగా కారణమవుతుంది. మందుకొడుతున్నప్పుడు దీన్ని తోడుగా తీసుకుంటారు. కోలాలు, టీ, కాఫీలు తాగే సమయంలో లేదా సేవించాక సిగరెట్ తాగితే మంచి రుచిగా ఉంటుంది. అందుకని మీరు బయటికి వెళ్లినప్పుడు ఏదైనా తాగాల్సి వస్తే నీళ్లు, పళ్లరసాలు తాగాలి. అలవాట్లు మార్చుకుంటే సిగరెట్ తాగడం కూడా తగ్గుతుంది.
ఒత్తిడిని అదుపుచేయాలి
సిగరెట్ తాగడానికి ముఖ్యకారణం ఇందులో ఉండే నికోటిన్ రిలాక్స్ అవడానికి తోడ్పడుతుంది. ఒత్తిడి తగ్గడానికి మేం సిగరెట్ తాగుతున్నామని చాలా మంది సాకులు చెబుతుంటారు. మీరు సిగరెట్ తాగడం మానడంవల్ల ఒత్తిడి తగ్గించుకునే ఇతర మార్గాలు అన్వేషించాలి. వీలుంటే మసాజ్ చేయించు కోండి. మంచి సంగీతం వినండి. యోగా చేయండి. ధూమపానం మానిన తర్వాత వీలైతే మొదట కొన్ని వారాలపాటు ఒత్తిడితో కూడిన పరిస్థితులకు దూరంగా ఉండటం మంచిది.
బేకింగ్ సోడా
బేకింగ్‌సోడా మూత్రంలో పి.హెచ్. స్థాయిని పెంచుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న నికోటిన్ నెమ్మదిగా బయటికి వెళ్తుంది. ఫలితంగా నికోటిన్ కావాలనే కోరిక తగ్గుతుంది. రోజుకు మూడుసార్లు అర చెంచా బేకింగ్‌సోడా తీసుకోవాలి. ధూమపానం అలవాటును వదులుకోవాలంటే రెండు చెంచాల బేకింగ్ సోడాను ఒక గ్లాసు నీళ్లలో కలిపి తీసుకోవాలి. భోజనం తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి.
పళ్లు -కూరగాయలు పాలు, ఆకుకూరలు, క్యారెట్, పళ్లు, కూర గాయలు తీసుకున్న తర్వాత సిగరెట్ తాగితే నోరు చేదుగా ఉంటుంది. అందుకని మానాలనుకున్న వాళ్లకు ఇదొక సులువైన మార్గం.
సేకరణ: ప్రజాశక్తి, జీవన