Pages

Monday, 5 August 2013

నిత్యం వ్యాయామం-ఒత్తిళ్ళ నుండి దూరం

ఆధునిక సమాజంలో మానసిక ఒత్తిళ్ళు, రుగ్మతలు, వ్యసనాలు పెరిగిపోతున్నాయి. జీవన ప్రమాణాలు, జీవించే కాలం పెరిగినా ఆరోగ్యం క్షీణిస్తోంది. అవసరాలకు తగినంత మంది మానసిక వైద్యులు, సైకాలజిస్టులు లేకపోవడంవల్ల సమస్యలు తీవ్రతరమవుతున్నాయి. కొన్ని మానసిక రుగ్మతలకు దీర్ఘకాలం మందులు వాడవలసి రావడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మానసిక చికిత్సలో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సహజ సిద్ధమైన శారీరక వ్యాయామాలు పలు రుగ్మతల్ని తగ్గిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలలో వ్యాయామ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు స్థూలకాయం లాంటి శారీరక సమస్యలు తగ్గించడంలో వ్యాయామం ఉపయోగపడుతుందని భావించేవారు. గత పాతికేళ్లుగా అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాలలో జరిగిన ప్రయోగాలలో, మానసిక సమస్యల నివారణలో వ్యాయామాల ప్రయోజనాలు తెలిసి వచ్చాయి. దీంతో ఇప్పుడిప్పుడు మానసిక వైద్యులు యోగ, ధ్యానం వ్యాయామాలను సహాయకారి చికిత్సలుగా గుర్తిస్తున్నారు. దీంతో వ్యాయామ పద్ధతులకు ప్రాధాన్యత పెరుగుతున్నది.
మానసిక రుగ్మతలు దూరం
ప్రతినిత్యం క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేసేవారు మానసిక ఒత్తిళ్ళు, రుగ్మతలకు దూరంగా ఉంటారు. సహజంగానే మానసిక ఒత్తిళ్ళు వ్యాయామం ద్వారా తగ్గుతాయి. అయితే స్కిజోఫ్రెనియా లాంటి తీవ్రమైన మానసిక రుగ్మతను తగ్గించడంలో వ్యాయామం సహాయకారిగా పనిచేస్తుందని 1991వ సంవత్సరం పెల్‌హాం, క్యాంపజ్ఞ చేసిన ప్రయోగంలో రుజువయ్యింది. అలాగే పలువురు క్లినికల్ సైకాలజిస్టులు చేసిన ప్రయోగాలలో డిప్రెషన్, యాంగ్జైటి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, సోమటైజేషన్ డిజార్డర్, హైపోకాండ్రియాసిస్ లాంటి తీవ్రమైన రుగ్మతలు వ్యాయామంద్వారా తగ్గడాన్ని గుర్తించారు. రకరకాల ప్రయోగాలలో వివిధ పద్ధతులను, చికిత్సా సమయాలను పాటించారు.

ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాలు వ్యాయామం చేసేలా మానసిక రోగులను ప్రోత్సహించారు. కనీసం వారంలో నాలుగు రోజుల చొప్పున నెలనుంచి మూడు నెలలపాటు వ్యాయామాలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యాయామాలు ఆచరించినవారిలో 60 శాతం అద్భుత ఫలితాలు సాధించారు. 29 శాతం మంది ఓ మాదిరి సత్ఫలితాలు పొందారు. మిగిలినవారిలో పెద్దగా ప్రయోజనం కన్పించలేదు.

శారీరక వ్యాయామాలవల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. ఎండార్ఫిన్లు, సెరటోనిన్ లాంటి సానుకూల రసాయనాల ఉత్పత్తి పెరుగుతుంది. అడ్రినలిన్, కార్టిసోల్ లాంటి ఒత్తిళ్ళను కలిగించే రసాయనాలు అదుపులోకి వస్తాయి. శరీరంలోని కండరాలు, నాడీ వ్యవస్థ, మెదడులోని న్యూరాన్లు చైతన్యవంతమై చురుగ్గా పనిచేస్తాయి. దీనివల్ల సైకోథెరపీ, బిహేవియర్ థెరపి ద్వారా ఒనగూడే సత్ఫలితాలు సిద్ధిస్తాయని ఇంగ్లాండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థపేర్కొన్నది. అలాగే వ్యాయామం చేసే సమయంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. మెదడులోని హైపోథలమస్ ఉత్తేజితమవుతుంది. శారీరక శక్తి పెరగడంతో ఆత్మవిశ్వాసం, స్వీయ గౌరవం వృద్ధి పొందుతుంది. దీనివల్ల మానసిక రుగ్మతల్ని అదుపు చేయడం, నివారించడం సాధ్యమవుతుంది.

సాధారణంగా మనసు బాగలేనపుడు, ఒత్తిడికి గురైనపుడు ఉత్తేజం పొందడానికి మత్తు పదార్థాలపై ఆధారపడుతుంటారు. చాలామంది మూడ్ కోసం సిగరెట్లు, పొగ త్రాగడానికి అలవాటుపడుతుంటారు. అయితే జాగింగ్ చేయించడం ద్వారా పొగ మాన్పించవచ్చని ప్రొఫెసర్ ఆడియన్ టేలర్ అంటున్నారు. కెనడాలోని ఎక్సెటర్ యూనివర్సిటీ సైకాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన పొగ మాన్పించేందుకు పంథొమ్మిది వైద్య ప్రక్రియలతో కూడిన అధ్యయనాన్ని చేపట్టాడు. పొగ త్రాగేవారిలో చాలామందికి మానేయాలని ఉంటుంది. అలాంటివారు వ్యాయామం, క్రీడల ద్వారా మనస్సును నియంత్రించుకోవచ్చునని అంటున్నాడు. వ్యాయామం వల్ల మెదడు ఉత్తేజితం కావడంవల్ల, కృత్రిమంగా ఉత్తేజపరిచే సిగరెట్ త్రాగాలన్న కోర్కె తగ్గిపోతుంది. సిగరెట్టులో ఉన్న నికోటిన్ మెదడును చైతన్యపరుస్తుంది. వ్యాయామం చేయడంవల్ల మెదడు చురుకుదనం పొందడం జరిగి, నికోటిన్ అవసరం తీరిపోతుంది.

ఈ విషయం గుర్తిస్తే, ఏటా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురయ్యే లక్షలాది మంది ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఎక్కువమంది పనిఒత్తిళ్ళు పెరిగినపుడు, ఉత్సాహం తగ్గినప్పుడు పొగ త్రాగుతుంటారు. అలాంటివారు అలవాటును వ్యసనంగా మార్చుకుని నష్టపోతుంటారు.

వ్యాయామాలు అనగానే జిమ్ముల్లో చేసే ఖరీదైన విన్యాసాలు, ప్రక్రియలని భయపడవలసిన పనిలేదు. నడక, జోరు నడక, పరుగు, ఈత, క్రీడలు, సాధారణ వ్యాయామాలు, సైకిలింగ్, యోగ లాంటి అనువైన వాటిని ఎంచుకోవచ్చు. అయితే ప్రతి రోజు కనీసం అర్థగంటయినా శరీరానికి అలసట కలిగేలా ఆచరించాలి. వారానికి కనీసం నాలుగు రోజులైనా వ్యాయామం చేసినపుడే సత్ఫలితాలుంటాయి. ఏ వ్యాయామమైనా కనీసం నెల రోజులపాటు చేయనిదే దాని ప్రయోజనం కనిపించదు. అందుకే మన పూర్వీకులు మండలం (40), అర్థమండలం రోజులైనా ఆచరించాలని నియమం పెట్టేవారు. గతంలో వ్యాయామాలనే గుళ్లు, గోపురాల ప్రదక్షిణల పేరుతో చేయించేవారు. డిప్రెషన్, హిస్టీరియా, భ్రమలు - భ్రాంతులు లాంటి రుగ్మతలకు పూజలపేరుతో వ్యాయామాలు చేయించేవారు. ఇప్పుడు చక్కని వైద్య విధానాలు, శాస్ర్తియ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మానసిక రుగ్మతలు, వ్యసనాల నుంచి బయటపడాలనుకునేవారు వైద్యులు, నిపుణుల సలహాలతో వ్యాయామ ప్రక్రియలను ఆచరించాలి.