Pages

Wednesday, 28 August 2013

నిద్ర తక్కువైతే.. కేన్సర్ ప్రమాదం..!


మానవుడికి పరిపూర్ణమైన ఆరోగ్యం నిద్ర వల్లనే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎన్ని కసరత్తులు చేసినప్పటికీ రాని ఆరోగ్యం నిద్ర వల్ల వస్తుందట. నిద్ర గనుక ఏమాత్రం తక్కువైతే మాత్రం కేన్సర్ కోరల్లో చిక్కుకోక తప్పదంటున్నారు అమెరికన్ పరిశోధకులు.

వివరాల్లోకెళ్తే... అమెరికాకు చెందిన ఓ పరిశోధకుల బృందం 5968 మంది మహిళలపై పరిశోధనలు జరిపిన పిమ్మట పై అభిప్రాయానికి వచ్చారు. ప్
రతిరోజూ వ్యాయామం చేసే మహిళలతో పోలిస్తే... ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోయే మహిళలలో బ్రెస్ట్ కేన్సర్ లేదా కలోన్ కేన్సర్ వచ్చే అవకాశాలు 47 శాతం ఎక్కువగా ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వారంటున్నారు.

ఈ మేరకు వాషింగ్టన్‌లో జరిగిన అమెరికన్ అసోసియేషన్ సమావేశంలో పై పరిశోధనల వివరాలను పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనల్లో కనుగొన్న విషయాల గురించి అమెరికా జాతీయ కేన్సర్‌ సంస్థకు చెందిన జేమ్స్ మెక్‌క్లెయిన్ మాట్లాడుతూ... పరిశోధనా వివరాలు తమని ఆశ్చర్యానికి గురి చేశాయని, ఏమైనప్పటికీ దీనిపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. తక్కువ నిద్రతో కేన్సర్ ఎలా వస్తుందో తమకు పూర్తిగా అర్థంకాని విషయంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే... అమెరికాలో తక్కువగా నిద్రపోవటం అనేది ఓ ఆరోగ్య సమస్యగా ఉందని "యూఎస్ వ్యాధుల నియంత్రణ, నివారణా కేంద్రం (సీడీసీ)" కూడా తెలపడం గమనించదగ్గ విషయం. అయితే ఇది అంత పెద్ద సమస్యగా అమెరికన్లు భావించటం లేదని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆరు గంటలు, అంతకంటే తక్కువగా రాత్రిపూట కునుకు తీసేవారి శాతం 1985 నుండి పెరిగిపోతోందని అంటోంది.

అయితే.. నిద్రలేమికి, పలు ఆరోగ్య సమస్యలకు విడదీయరాని సంబంధం ఉందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో ముఖ్యమైనవి ఊబకాయం, మధుమేహం, హైబీపీ, గుండెపోటు, ఒత్తిడి, పొగత్రాగటం, మద్యం సేవించటం లాంటి సంభవిస్తాయని వారంటున్నారు.

ఇకపోతే... ప్రతిరోజూ వ్యాయామం చేయటం వల్ల రొమ్ము కేన్సర్, పెద్ద పేగుల్లో కేన్సర్ లాంటివి వచ్చే అవకాశాలు తగ్గుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వ్యాయామం వల్ల శారీరకంగా బరువు తగ్గడంతో పాటు హార్మోన్లు సమర్థవంతంగా పనిచేస్తాయని, తద్వారా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రకంగా కేన్సర్ నిరోధానికి వ్యాయామం మేలే చేస్తోందని వారు రూఢీ చేస్తున్నారు కూడా...!