Pages

Tuesday, 17 September 2013

శంకరుడు ఇచ్చిన అద్భుతమైన వరం సౌందర్య లహరి..... సౌందర్య లహరి.గ్రంథ పరిచయం

జగన్మాతను ఆది శంకరాచార్యుడు స్తుతించిన అపూర్వ 
గ్రంధము సౌందర్యలహరి. త్రిపుర సుందరి అమ్మవారిని 
స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. సౌందర్య లహరి అంటే అమ్మవారి సౌందర్యం యొక్క తరంగాలు. హైందవ ధర్మానికి ఆది శంకరుడు ఇచ్చిన అద్భుతమైన వరం సౌందర్య లహరి.
సౌందర్య లహరి స్తోత్రా విర్భావం గురించి ఒక కధ చెప్పబడుతుంది. ఒకనాడు, ఆది శంకరుడు స్వయంగా కైలాసం వెళ్ళాడట. అక్కడ వ్రాసి ఉన్న ఒక శ్లోకాన్ని చదువుతుండగా వినాయకుడు దానిని క్రింది నుండి చెరిపేశాడట. అది మానవులకు అందరాని అత్యంత గుహ్య విద్య గనుక గణేషుడు అలా చేసాడు. అలా శంకరుడు మొదటి 40 శ్లోకాలు మాత్ర,మే చదివాడు. తను చదివిన 40 శ్లోకాలు, వాటికి తోడు మరొక 60 శ్లోకాలు శంకరాచార్యుడు రచనం చేసాడు. ఆ వంద శ్లోకాలు కలిపి సౌందర్య లహరిగా ప్రసిద్ధమయ్యాయి. ఈ కధకు వివిధ రూపాంతరాలున్నాయి. ఏమయినా మొదటి 40 శ్లోకాలు యంత్ర తంత్ర విధాన రహస్యాలు తెలుపుతుండగా తరువాతివి శ్రీమాత యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నాయి.సౌందర్యలహరి ఒక ప్రక్రియలో చెయ్యబడ్డ శ్లోక మాలికగా చెప్పలేము. అది ఒక స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), ఇంకా ఒక కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. అందుకే సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.
ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం
ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల. ఈ మంత్రాలకు ఫలసిద్ధులను వ్యాఖ్యాతలు తెలియబరచారు.
ఆగమ తంత్రాలను విశదీకరించే, శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంధం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి.
సౌందర్యలహరి రెండుభాగాలలో కనిపిస్తుంది - ఆనందలహరి మరియు సౌందర్యలహరి. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు ఉన్నాయి. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్ట పరుస్తున్నాయి. సౌందర్యలహరి అన్న పేరులో సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు కనిపిస్తున్నాయి