మధుమేహం (షుగర్ వ్యాధి) ,గుండె జబ్బులు మనలో చాలామందిలో సాధారణంగా కనిపించే వ్యాధులు.శరీరంలో కొలెస్టరాల్ గాని,రక్తంలో షుగర్ గాని అతిగా పెరగడం వల్ల వచ్చే ఈ వ్యాధులు ఇతర రుగ్మతలకు కూడా దారితీస్తాయి.ఈ వ్యాధులు ఉన్నవారు మెంతులను తింటే ఉపశమనం పొందుతారని జాతీయ పోషకాహార సంస్థ (హైదరాబాద్) చేసిన ఒక పరిశోదనలో తేలింది. ఈ వ్యాధి గ్రస్తులకు ఇచ్చే మందులు,చికిత్సతో పాటు మెంతులు కూడా ఇస్తే రోగికి మరింత ఆసరా ఉంటుంది. మెంతులను ఎంత మోతాదులో, ఏరూపంలో ఇవ్వాలి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈకింది విధంగా ఉన్నాయి.
- భారతీయ వంటకాల్లో అతి సాధారణంగా వాడే మెంతులు కిరాణా షాపుల్లో లభిస్తాయి.
- మెంతుల్లో పీచు (ఫైబర్) పదార్ధం అతి ఎక్కువగా అంటే 50 శాతం వరకు ఉంటుంది. ఈ కారణంగా ఇది రక్తం,మూత్రంలోని గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. కొలెస్టరాల్ అతిగాపెరిగిన కారణంగా గుండె జబ్బులకు గురయ్యే వారిలో ఈ కొలెస్టరాల్ స్థాయిని మెంతులు గణనీయంగా తగ్గిస్తాయి. మెంతులను ధాన్యం రూపంలో అయినా లేదా వంటకాల్లో ఉపయోగించినా ఈ ఫలితాలు అందిస్తాయి.
- అయితే మెంతి కూర (ఆకుకూరల్లో ఒకటి) లో మాత్రం ఈ లక్షణాలు ఉండవు. కేవలం మెంతులు మాత్రమే పైన పేర్కొన్న ఆరోగ్య ఫలితాలను ఇస్తాయని గమనించాలి.
- మెంతులను ఏమోతాదులో ఉపయోగించాలనేది మధుమేహం వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. అలాగే శరీరంలో కొలెస్టరాల్ స్థాయిని బట్టి మోతాదును నిర్ణయిస్తారు.సాధారణంగా 25 గ్రా నుంచి 50 గ్రా మధ్య ఈ మోతాదు ఉంటుంది.
- ప్రారంభంలో మెంతులను రోజుకు 25 గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటిని రెండు భాగాలుగా చేసి అంటే 12.5 గ్రాముల చొప్పున (రెండు టీ స్పూన్లు) రెండు సార్లు తీసుకోవాలి. మద్యాహ్న భోజనం,రాత్రి భోజనం తో పాటు వీటిని ఆరగించాలి.
- మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి గాని, లేదా పౌడర్ గా చేసి మంచినీళ్ళు లేదా మజ్జిగలో కలుపుకొని గాని భోజనానికి పావు గంట ముందు సేవించాలి.
- సహజంగా రుచి చేదుగా ఉండే మెంతుల్లో ఆ చేదు రుచిని నిర్మూలించే ప్రక్రియ ప్రస్తుత మార్కెట్లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు.
- నానబెట్టిన మెంతులను గుజ్జుగా చేసిగాని పౌడరుగా చేసిగాని వివిధ రకాల వంటకాల్లో చేర్చి వాడుకోవచ్చు.ఉదాహరణకు రొట్టెలు,పెరుగు,దోశ,ఇడ్లి,ఉప్మా, వివిధ రకాల కూరలు తదితర వంటకాల్లో చేర్చినట్లయితే మెంతుల చేదును కొంతవరకు తగ్గించవచ్చు.వంటకాలను తమతమ అభిరుచికి అనుగుణంగా పుల్లగా లేదా ఉప్పుగా తయారు చేసుకోవచ్చు.
- రక్తంలో,మూత్రంలో షుగర్ లెవెల్ అతిగా ఉన్నంత కాలం మెంతులను తీసుకుంటూనే ఉండాలి.
- మెంతులను తీసుకోవడంతోపాటు రోజూ క్రమం తప్పకుండా నడవటం లాంటి వ్యాయామం చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది.ఎందుకంటే శరీర బరువు తగ్గటం వల్ల ఇన్సులిన్ చక్కగా పనిచేస్తుంది.అందుకే శరీరంలొ క్రొవ్వును చేర్చే పంచదార పదార్ధాలను తీసుకోకుండా నియంత్రించాలి.
- మెంతులను వినియోగిస్తున్న కొత్తలో కొందరికి విరోచనాలు కావడం లేదా కడుపు ఉబ్బరంగా ఉండటం జరుగుతుంది.
- మధుమేహం వచ్చిన వారు వ్యాధికి తీసుకుంటున్న ఔషధాలను కొనసాగిస్తూనే మరింత ఉపశమనానికి మెంతులను వాడాలి.మెంతుల వాడకం ద్వారా ఔషధాల అవసరాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.అయితే ఏమేరకు ఔషధాలను తగ్గించాలి, ఎంత మోతాదు ఇవ్వాలనేది మీవ్యాధి పరిస్థితిని బట్టి కేవలం మీ వైద్యుడు మాత్రమే నిర్ణయిస్తాడు.మధుమేహ వ్యాధి తీవ్రమైనప్పుడు తక్షణమే వైధ్య సహాయం పొందాలి.
|