Pages

Tuesday, 1 October 2013

ఈశ్వర పూజకు మారేడు దళాలు ఎందుకు?

“ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దాళలలతో శివుని పూజిస్తారు.
మూడు డళములు కలసి ఒక్క అండముననే ఉండును కావున, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా,

“పూజకుడు – పూజ్యము – పూజ”,
“స్తోత్రము – స్తుత్యము – స్తుతి”,

“జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము “  అని అర్థాలు చెప్పు చున్నారు.  ఈ విధంగా  (3×3) మూడు, మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటిజ్ఞానము, ఇదియే అజ్ఞానము, వేరువేరుగా కనిపించినను, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, “ఓ మహాదేవా!” సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవే “మారేడుదళము” నందు మూడు పత్రములుగా వేరువేరుగా వున్నట్లు తోచుచున్నావు.

“పూజకుడవు నీవే, పూజింపబడునది నీవే, పూజాక్రియవు నీవే” – అనే భావంతో అభేదబుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి, మరియు పుణ్యఫల ప్రదము.  ఈ విధమైన భావముతో పూజించకుండుటయే అజ్ఞానము మరియు పాపహేతువు. ఈ జ్ఞానరహస్యమును తెలుసుకుని – బిల్వపత్రరూపముతో “త్రిపుటి జ్ఞానమును” నీ పాదములచెంత నేను సమర్పించుచున్నాను.  ‘శివోహం – శివోహం ‘ అను మహావాక్య జ్ఞానమును, స్థిరపర్చునదియే బిల్వార్చనయగును.

పవిత్రమగు ఈశ్వర పూజకు ఈ “బిల్వపత్రము” సర్వశ్రేష్ఠమైనది మరియు అతి పవిత్రమైనది. శివార్చన లకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళముననే ఉపయోగించవలెను. ఒకసారి కోసిన బిల్వపత్రములు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కల్గియుండును. వాడిపోయినను దోషములేదు, కాని మూడురేకులు మాత్రము తప్పనిసరిగా ఉండవలెను.

ఏకబిల్వ పత్రంలోని మూడు రేకులలో ఎడమవైపునది బ్రహ్మ అనియు, కుడీవైపునది విష్ణువనియు, మధ్యనున్నది సదాశివుడనియు, పురాణములలో తెలియుచున్నది. మరియు బిల్వదళములోని ముదుభాగమునందు అమృతమును, వెనుక భాగమున యక్షులును వుండుటచేత, బిల్వపత్రము యొక్క ముందుభాగమును శివునివైపు వుంచి పూజించాలి.

బిల్వవనము కాశీక్షేత్రముతో సరిసమానమైనది అని శాస్త్రములలో తెలుపుచున్నారు. మారేడుచెట్టు వున్నచోట ఆ చెట్టు క్రింద శివుడు ఉంటాడు.

ఇంటి ఆవరణలో ఈశాన్యభాగమున మారేడు చెట్టు వున్నచో, ఆపదలు తొలగి సర్వైశ్వర్యములు కల్గును. తూర్పున వున్నచో సుఖప్రాప్తి కల్గును, పడమరవైపున వున్నచో సుపుత్రసంతానము కల్గును. దక్షిణవైపున వున్నచో యమబాధలు వుండవు.

శ్లో!!  బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాపసమ్హారం ఏకబిల్వం శివార్పణం!

బిల్వపత్రము యొక్క దర్శనంవలన పుణ్యము లభించును, వాటిని స్పృశించుట వలన సర్వపాపములు నశించును. ఒక బిల్వపత్రమును శివునికి భక్తిశ్రధ్ధలతో అర్పించుటవలన, ఘోరాతిఘోరమైన పాపములు సైతము నిర్మూలమగును. ఇట్టి త్రిగుణములు గల  బిల్వదళమును నీకు అర్పించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము.