Pages

Wednesday, 23 October 2013

సీతాదేవికి చిలుక శాపము



అది మిథిలా నగరములోని అంతః పురస్త్రీల ఉద్యానవనము. సేతాదేవి చెలికత్తెలతో విహారమునకు వచ్చెను. ఒక చెట్టుమీద చిలుకల జంట ముచ్చట లాడుకొనుచుండెను. అవి వాల్మీకి ఆశ్రమమునుండి వచ్చినవి. మగచిలుక, " ఈ దేశపు రాజుగారి కే సీత నాగటిచాలులో దొరికినదట. ఆమెను శ్రీరాముడు శివ ధనుర్భంగము చేసి పెండ్లాడునట" అని భార్యకు చెప్పుచుండెను. అది విన్న సీత, ఆ రెండు చిలుకలను బట్టి తెప్పించెను. వానితో సీత, "మీరెవరిని గురించి మాట్లాడుతున్నారు ? సీతను నేనే. నన్ను గురించియేనా? ఆ రాముడెవడో చెప్పుడు. ఈ సంగతులు మీ కెట్లు తెలిసినవి. "అని అడుగగా "మేము వాల్మీకి ఆశ్రమములోని వారము. విహారమునకై వచ్చినాము. వాల్మీకి ముని రామాయణము అని ఒక గ్రంథము వ్రాయుచున్నాడు. అందులోని కథ చెప్పుచున్నాను. రాముడు అయోధ్యకు యువరాజు" అని శుకములు చెప్పి, తమ్ము వదలమని ప్రార్ధించెను. " ఆ శుభకార్యము జరిగిన తరువాత్ అమిమ్ము విడిచెద" నని సీత యనెను. అవి "మేము స్వేచ్చగా తిరిగేది వారము. పంజరములలో ఉండలేము అదియునుగాక  నాభార్య చూలాలు. శ్రమకు ఓర్వలేదు. దయతో విడిచిపెట్టు" మని కోరెను. సీత, "అయినచో ప్రసవ మగునంతవరకు ఆడచిలుక నాయొద్దనే యుండును. నీవు పొమ్మని" మగ చిలుకను విడిచెను. అది, "తల్లీ, దీనిని విడిచి నేను బ్రతుకలేను. కరుణించి మమ్మిద్దరిని విడిచిపెట్టు" మని దీనముగా ప్రార్ధించెను. కాని సీత వినలేదు. ఆడచిలుక, సీతతో నాభర్త నన్ను విడిచి బ్రతుకలే ననుచున్నాడు. నేనునూ అతనిని విడిచి బ్రతుకలేను. కావున మమ్ము దయజూడు మనెను. సీత వినలేదు. మగచిలుక ఏడుపు ఆడచిలుక గుండెలు పగులగొట్టగా అది సీతను జూచి "యింత కటినురాలవై గర్భవతియైన నన్ను నాభర్తనుండి విడదీసినావు కావున, నీవు కూడా గర్భవతివై భర్తను ఎడబాసి దుఃఖపడెదవు". అని శపించి ప్రాణము విడిచెను. మగచిలుక " నాభార్యను అన్యాయముగా చంపినావు. కావున నిన్ను నీ భర్త విడచుటకు మూలకారణుడైన చాకలివాడనై జన్మించి పగ తీర్చుకొందు" ననుచూ వెళ్ళి గంగానదిలో పడి మరణించెను.

సీతను రాముడు అడవిలో విడుచుటకు ఇదియే కారణము ..................పద్మ పురాణము