Pages

Wednesday, 23 October 2013

రాముడుకు శివుడు విభూది మహిమని తెలిపిన విధము పద్మ పురాణము నుండి

కైలాసము నుండి శంకరుడు విప్రవేషముతో నొకనాడు రామునొద్దకు వచ్చెను. రాముడు " తమ నామమును, నివాసమును చెప్పు డనగా ఆయన నాపేరు శంభుడు, కైలాసము నా నివాసము" అనగా అతనిని శంకరుడుగా గ్రహించి రాముడు విభూతి మహిమను చెప్పుడని యడిగెను. శివుడు చెప్పసాగెను.

"రామా! భస్మ మహత్యము చెప్పుటకు బ్రహ్మాదులకు గూడ శక్యము గాదు. బట్ట మీది చారలను అగ్ని కాల్చినట్లు, మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను గూడ తుడిచివేయు శక్తి భస్మమునకు ఉన్నది. విభూతిని మూడు రేకలుగా పెట్టుకోన్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లు అగును.

ముఖమున భస్మమమును ధరించిన నోటి పాపములు (తిట్టుట - అభక్ష్యములను దినుట అను పాపములు), చేతుల పైన ధరించిన చేతిపాపములు (కొట్టుట మొ||) హృదయము పై ధరించిన మనః పాతకములను (దురాలోచనలు మొ||), నాభి స్థానమున ధరించుట వలన వ్యభిచారాది దోషములను, ప్రక్కలందు ధరించుట వలన పరస్త్రీ స్పర్శ దోషములను పోగొట్టును. పాపములను భార్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది గాన భస్మము అను పేరు దీనికి పేరు గలిగెను.

భస్మముమీద పండుకొన్నను, తిన్నను, ఒడలికి పూసికొన్నను పాపములు భస్మీభూతము లగును. ఆయువు పెరుగును. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవము గలిగించును. సర్పవృశ్చికాది విషములను హరించును. భూత పిశాచాదులను పారద్రోలును.

వశిష్ట వంశములో ధనంజయుడు అను విప్రుడు గలడు. అతనికి వందమంది భార్యలు, వందమంది కొడుకులు. వారికి తన దానములను సమానముగా పంచి యిచ్చి ఆ విప్రుడు గతించెను. కొడుకులు అసూయతోను, దురాశాతోను ఒక ధనముల కొకరాశపడుచు తన్ను కొనసాగిరి. వారిలో కరుణుడను కొడుకు, శత్రు విజయము సాధించ వలెనని గంగాతీరమున కేగి  స్నామాది తపము చేయవలెననుకొని మునుల సేవ చేయుచుండగా ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతియని ఒక నిమ్మ పండు దెచ్చి అక్కడ పెట్టెను. దానిని వీడు వాసన చూచెను. అందుకు మునులాగ్రహించి ఈగవై పొమ్మని శపించిరి. వీడు వేడుకొనగా పూర్వస్మృతి నిచ్చిరి. అంతట ఏడ్చుచూ వెళ్లి భార్యతో చెప్పెను. ఆమె పతివ్రత. చాల విచారించెను. ఒకనాడీ సంగతి తెలిసిన వాని సోదరులు పట్టి చంపిరి. అతని భార్య ఈగ దేహమున్ ఉ తీసికొని అరుంధతి దగ్గరకు బోయి ప్రార్ధింపగా ఆమె, మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని జల్లి, కరుణుని బ్రతికించెను.
.
​....​..................పద్మ పురాణము