Pages

Tuesday, 17 December 2013

అయిదు కొండల స్వామి



అయిదు కొండల స్వామి
ఏడుకొండల స్వామి వెంకన్నయితే అయిదు కొండల స్వామి అయ్యప్పని చెబుతారు. ఆంధ్రావనిలో ఏడుకొండల స్వామిని తెలియని వారుండరు. జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండల వేంకటేశ్వర స్వామిని దర్శించని ఆంధ్రుడుండడంటే అతిశయోక్తి కాదు.
కేరళ రాష్ట్రంలో శబరిమల అయ్యప్పస్వామి అయిదు కొండలైన అళుదామేడు, కరిమల, నీలిమల, అప్పాచిమేడు, శబరిగిరి శిఖరాలపై ఉన్నాడని పంచాద్రి నిలయునిగా స్వామిని కీర్తిస్తారు.
దేశంలో ఏ తీర్థయాత్రకూ లేని యాత్రా నియమావళి శబరిమల యాత్రకు నిర్దేశించారు. తిరుపతి వేంకటేశ్వరుని దర్శించాలంటే మన వీలును బట్టి సంవత్సరంలో 365రోజులలో ఏదో ఒకరోజు కుటుంబసమేతంగా వెళ్ళి దర్శించి రావచ్చు.
శబరిమల అయ్యప్ప దేవాలయం సంవత్సర కాలంలో కొన్ని రోజులు మాత్రమే అంటే మండల పూజ పేరుతో నవంబరు 16 - 17 తేదీలలో(వృశ్చికలగ్నం) తెరచి మరల డిసెంబరు 24వతేదీనాడు మూసివేస్తారు. మరల జ్యోతి దర్శనమని చెప్పి జనవరి 2వతేదీ నాడు తెరచి 20వ తేదీనాడు దేవాలయాన్ని మూసివేస్తారు. నెల పూజల పేరుతో ప్రతినెలా అయిదు రోజుల పాటు (సుమారు 16-21 తేదీల మధ్య) దేవాలయం తరచి పూజానంతరం తిరిగి మూసివేస్తారు. కొందరు భక్తులు ఆసమయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుందని శబరిమల వెళ్ళి స్వామిని దర్శించుకు వస్తున్నారు.
కేరళలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలైన ఓణం, విషు, ఉత్తర ఫల్గుణి మొదలైన సందర్భాలలో కూడా దేవాలయం అయిదు రోజుల పాటు తెరచి ఉంచుతారు. ఆసమయంలో ఎక్కువగా కేరళీయులే వెళ్ళి దర్శనం చేసుకుంటారు. నవంబరు, డిసెంబరు, జనవరి మాసాలు (కార్తికం, మార్గశిరం) దీక్షకు, యాత్రకు వాతావరణం అనుకూలంగా ఉండడంవల్ల భక్తులు ఆకాలంలోనే లక్షల సంఖ్యలో శబరిమల యాత్ర చేసి వస్తారు.
శబరిమల యాత్రకు వెళ్ళాలంటే 41రోజులు ముందుగా ముద్రమాలను గురుస్వామి ద్వారా మెడలో ధరించి దీక్షను ప్రారంభిస్తారు. దీక్షా వస్త్రాలుగా నలుపు లేక కాషాయ వస్త్రాలు ధరిస్తారు.
దీక్షలో తల, ముఖం క్షవరం పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ రెండు పూటలా చన్నీటి స్నానం తలకు చేసి, నుదుట విభూది, చందనం, కుంకుమ ధరించి ఇంట్లో నిత్యం దీపారాధన చేసి అయ్యప్ప పూజ చేయాలి. లేకుంటే కనీసం అయ్యప్ప శరణు ఘోష (108నామాలు)నైనా చెప్పుకొని ప్రతిరోజు ఏదో ఒక దేవాలయానికో, భజనకో వెళ్ళి సత్కాలక్షేపం చేయాలి.
నేలపై కొత్త చాప వేసుకొని, తలదిండు లేకుండా నిద్రించాలి. ఒకపూట భోజనం, రాత్రిపూట అల్పాహారం సేవించాలి. సాత్వికాహారం మాత్రమే స్వీకరించాలి. అసత్యమాడరాదు. దానధర్మాలు విరివిగా చేయాలి. మాంసాహారం భుజించరాదు. పొగత్రాగడం, జూదమాడడం, మద్యం సేవించడం, గుట్కా, కారాకిళ్ళీ, వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. తరచు సత్సంగాలలో పాల్గొంటూ వ్యర్థ ప్రసంగాలు చేయకుండా దైవ చింతనలోనే కాలక్షేపం చేయాలనేది దీక్షాలక్ష్యం.
1977 వరకు శబరిమల అయ్యప్పస్వామి గురించి పలువురు ఆంధ్రులకు తెలియదు. విజయవాడలో గొల్లపూడి, హైదరాబాద్ బొల్లారంలో అయ్యప్పస్వామి దేవాలయాలు నిర్మించడం, కొందరు స్వాములు తమిళులు, కేరళీయులతో యాత్ర చేసి వచ్చిన తరువాతే ఆంధ్రరాష్ట్రంలో అయ్యప్ప స్వామి ప్రాచుర్యం పెరిగింది.
శబరిమల యాత్రకు వయసులో ఉన్న స్త్రీలకు (10-50ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారికి) అనుమతి లేదు. పదేళ్ళలోపు బాలికలను, యాభైయేళ్ళ దాటిన స్త్రీలను మాత్రం శబరిమల యాత్రకు అనుమతిస్తారు.
శబరిమల వెళ్ళడానికి అడవులు, కొండలపై నడచి వెళ్ళాలి. దారిలో మరుగు సదుపాయాలు లేకపోవడం స్త్రీలకుండే నెలసరి బహిష్టు సమస్య, స్వాముల బ్రహ్మచర్యదీక్ష మొదలైన కారణాల వల్లనే స్త్రీలకు ప్రవేశం కల్పించలేదనిపిస్తుంది.
దీక్షలో తరచుగా పూజ, భజన కార్యక్రమంలో పాల్గొనడం, చెప్పులు లేకుండా నడవడం, దేవాలయాలు సందర్శించడం వలన ఆధ్యాత్మిక చింతన పెరిగి ఉత్సాహంగా ఉంటారు.
శబరిమల యాత్రకు ఇరుముడి జీవం క్వంటిది. ఇరుముడి లేకుండా శబరిమల వెళ్తే అక్కడ ఉన్న పదునెట్టాంబడి(18పవిత్రమైన మెట్లు) ఎక్కడానికి అనుమతించరు. పరశురామ నిర్మితమైన పదునెనిమిది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించడానికే దీక్ష, ఇరుముడి ఏర్పాటు చేశారు.
రెండు అరల సంచిలో ముందు భాగంలో ఆవునెయ్యి నింపిన టెంకాయ, పూజా ద్రవ్యాలు ఉంచి వెనుక భాగంలో తినుబండారాలు, ఇతర సామగ్రి ఉంచి కట్టిన మూటనే ఇరుముడి అంటారు.
ముద్రకాయలో ఉన్న ఆవునేతితో స్వామివారికి అభిషేకం చేసి, పూజా ద్రవ్యాలను స్వామి వారికి సమర్పిస్తారు. అందుకే ఇరుముడిని ఎంతో పవిత్రంగా శిరస్సుపై పెట్టుకొని యాత్రకు బయలుదేరుతారు. ఎరుమేలి నుండి 70కిలోమీటర్ల దూరమైనా, పంబాతీరం నుండి 6కిలోమీటర్ల దూరమైనా తలపై ఇరుముడి మోసుకుంటూ అడవులలో కొండలపై నడచి స్వాములు శబరిమల చేరి అయ్యప్పస్వామిని దర్శించి రావడం ఈయాత్రలో గొప్ప విశేషం.
ఇంత పవిత్రమైన దీక్షను కొందరు స్వాములు ఇష్టం వచ్చినట్లు సడలించి వారికి అనుకూలంగా మార్చుకొని శబరిమల యాత్రకు కళంకం తెస్తున్నారు. శబరిమలలో పక్కా వసతి గృహాలు, భోజన ఫలహారశాలలు, ఫోను సౌకర్యం, సెల్ ఫోన్లు వచ్చాక శబరిమల స్వరూపం మారిపోయింది. భక్తి సన్నగిల్లుతోందని చెప్పడానికి బాధాకరంగా ఉంది.
పూర్వపురోజులలో శబరిమల యాత్రకు వెళితే ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంటి సంగతులు, బయట విషయాలు తెలిసేవి కావు. అందువలన యాత్ర సఫలీకృతమై పరమాత్ముని కృపకు పాత్రులయ్యేవారు.
స్వామి శరణం! ఓం స్వామియే శరణమయ్యప్ప