Pages

Tuesday, 17 December 2013

గణపతి మొదటి అవతారము: వక్రతుండావతారము.


గణపతి  మొదటి అవతారము: వక్రతుండావతారము.

ధ్యానశ్లోకం: వక్రతుండావతారశ్చ దేహానాం బ్రహ్మధారక:, 
మత్సరాసురహంతా స సింహవాహనగ: స్మృత:

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: దేవరాజైన ఇంద్రుని పొరపాటువలన మత్సరాసురుడనే రాక్షసుని జననం జరిగింది. రాక్షస గురువైన శుక్రాచార్యులు ఇచ్చిన మంత్రోపదేశంతో కఠోరమైన తపస్సు చేసి అనేక వరాలను పొంది అశేష సేనాబలంతో మూడు లోకాలనూ జయించాడు. దేవతలు కూడా ఈ రాక్షసుని బాధలకు తాళలేక తరుణోపాయం గురించి తపస్సు చేయగా, వారికి భగవాన్ శ్రీ దత్తాత్రేయస్వామివారు ప్రత్యక్షమై వక్రతుండుని ఉపాసనావివరములు తెల్పి అతనిని ప్రసన్నము చేసుకోవలసినదిగా అదేశించెను. దేవతల ఆరాధనకు సంతసించిన గణపతి వక్రతుండునిగా సింహవాహనుడై వారిముందు ప్రత్యక్షమై మత్సరాసురునిపై యుద్ధానికి అనేక సేనలతో బయల్దేరేడు. యుద్ధం 5 రోజులుగా కొనసాగింది. ఆ యుద్ధంలో మత్సరాసురుని పుత్రులైన `సుందరప్రియుడు ' మరియు `విషయప్రియుడు ' అనబడే అసురులు వధింపబడ్డారు. పుత్రుల వధ తెలుసుకున్న మత్సరాసురుడు యుద్ధభూమిలో అడుగుపెట్టేడు. 14 భువనాలనూ భయపెట్టిన ఆ మత్సరాసురుడు, వక్రతుండుని దర్శించగానే భయముతో వణుకుతూ శరణువేడి రక్షించమని ప్రార్థించాడు. దయామయుడైన వక్రతుండుడు మత్సరాసురునితో వక్రతుండుని భక్తులజోలికి రావద్దని నియంత్రించి అధోలోకానికి పంపివేసాడు. ఆ నాటినుండి దేవతలందరూ స్వతంత్రులై వక్రతుండుని సేవిస్తూ వారి వారి విధినిర్వహణలు కొనసాగించారు.

....కాస్త అలోచనాబుద్ధితో ఈ కథ చదివితే ఇందులో అంతరార్థం తేటతెల్లమవుతుంది. మన ఇంద్రియాలకి అధిపతే ఇంద్రుడు. వాటినుండి పుట్టినవాడే మత్సరాసురుడు. అసురునిచే బాధలుపడుతున్న ఇంద్రియాలు (దేవతలు) గురువైన దత్తాత్రేయుని శరణువేడగా సద్గురుని ప్రసాదం వల్ల వక్రతుండావతారం జరిగి, మొదటిగా విషయ, సుందర ప్రియత్వాలని నాశనంచేసి మత్సరాసురుని నియంత్రించాడు. కాబట్టి మనం కూడా వక్రతుండుని శరణువేడి మాత్సర్యగుణాన్ని పోగొట్టుకుందాము. "శ్రీ వక్రతుండాయ నమ:" ...మనలో మాత్సర్య గుణం వక్రతుండుని అనుగ్రహం వలన నశించుగాక.